
- అక్రమాలను అడ్డుకున్న సిపిఎం నేత హత్య
పాట్నా : బీహార్‌లో భూమాఫియా గూండాలు రెచ్చిపోయారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న ఉద్యమనేతను హత్య చేశారు. రైతుల హక్కుల కోసం, భూమిలేని నిరుపేదల కోసం అనునిత్యం పోరాడుతూ అక్రమార్కులు సాగిస్తున్న భూకబ్జాలను ప్రజలతో కలిసి అడ్డుకుంటూ పోరాటాలు సాగిస్తున్న సిపిఎం మురళీగంజ్ బ్లాక్ శాఖ కార్యదర్శి రాజేశ్ హంస్దాపై బుధవారం కొందరు భూబకాసురులు దాడి చేసి హత్య చేశారు. పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దారిమధ్యలో కాపుగాసి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజేశ్ హత్యను సిపిఎం తీవ్రంగా ఖండించింది. హంతకులను తక్షణమే అరెస్టు చేయాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యమపథంలో అంకితభావంతో ఎనలేని పోరాటాలు చేసిన రాజేష్‌కు ఘన నివాళులర్పించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లోని సిపిఎం అధికారిక పేజీల్లో పోస్టు చేసింది. రాజేష్ హత్యను సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా కూడా తీవ్రంగా ఖండించారు. అణగారిన ప్రజల పక్షాన ధీరోచిత పోరుసల్ఫిన అంకుఠిత దీక్షాపరుడు రాజేష్ అని ఆయన కొనియాడారు. ఆయన పోరాటం వృధా కానివ్వబోమని తెలిపారు. కాగా రాజేష్ హంస్దా హత్యను నిరసిస్తూ గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీహార్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. భూమాఫియా నుంచి సామాజిక కార్యకర్తలను పరిరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.