Oct 26,2022 09:29

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : బెంగళూరు-విజయవాడకు నాలుగు లైన్ల రహదారి కోసం రాష్ట్రంలో భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త రహదారులు తెరపైకి వస్తున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణం భూసేకరణ సమయంలో ఆగిపోయింది. కేంద్రం ప్రభుత్వం ఇటీవల బెంగళూరు నుంచి విజయవాడ వరకూ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రకటించింది. ఇందులో కొంత పాత రహదారిపోనూ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పేరుతో నూతనంగా 342 కిలోమీటర్ల పొడవున రోడ్డును కొత్తగా వేయనున్నారు. దీనివల్ల ఈ ప్రధాన నగరాల మధ్య 70 కిలోమీటర్లు వరకూ దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణ సమయం కూడా చాలా వరకూ తగ్గుతుందని అంచనా వేశారు. ఈ రహదారి దాదాపుగా ఎక్కువ వంపులు లేకుండానే సాగుతుంది. రాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లా, వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా రహదారి నిర్మాణం జరగనుంది. మిగిలిన జిల్లాల్లో పాత రోడ్డులో దీనిని కలపనున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ వరకూ 530 కిలోమీటర్ల రోడ్డు ఉంది. పాత జాతీయ రహదారిపోనూ మిగతా రహదారి కోసం భూసేకరణ మొదలైంది. రాష్ట్రంలో సత్యసాయి జిల్లా కొడికొండ నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకూ ఈ భూసేకరణ జరగాల్సి ఉంది. ఇందుకోసం ఎన్ని ఎకరాలు కావాలనేదీ అధికారులు ఇంకా తేల్చలేదు. ప్రకాశం జిల్లాలో మంగళవారం నాడు జాయింట్‌ కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు తాళ్లూరు మండలం శివరామపురంలో రహదారి కోసం సేకరించే భూములను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమ సందేహాలను అధికారులకు చెప్పుకున్నారు.
 

                                                                          రైతుల్లో కలవరం

గతంలో అనంతపురం నుంచి అమరావతి వరకూ చేపట్టే రహదారికి కూడా భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. అప్పట్లోనూ రైతులకు పరిహారంపై స్పష్టత లేదు. భూముల ధరలు నిర్ణయించలేదు. అయితే, ఆ రహదారి ఆగిపోయింది. ఇప్పుడు కొత్త రహదారి కోసం సేకరించే భూములకు ఎంత ధర ఇస్తారనేదీ స్పష్టత లేదు. భూసేకరణ, ధరల నిర్ణయం, పరిహారాల చెల్లింపులు వంటివి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో ఈ రహదారి వెళ్లే మార్గంలోని మండలాల్లో నివేదికలను అధికారులు తయారు చేస్తున్నారు. ఏయే గ్రామాల్లో నుంచి ఈ రహదారి వెళ్తుందనే సమాచారం ఇచ్చారు. దీంతో, ఆయా గ్రామాల రైతుల్లో కలవరం మొదలైంది. సాగు చేసుకుంటున్న భూములు ఖరీదైనవి. కొన్ని మండలాల్లో ఏడాదికి రెండు పంటలు పండే భూములు కూడా ఉన్నాయి. వీటిని కోల్పోతే ఎలా అనే ఆందోళన రైతుల్లో పెరుగుతోంది.
 

                                                       ఎకరాకు రూ.50 లక్షలు అడుగుతున్న రైతులు

ప్రకాశం జిల్లాలో సిఎస్‌పురం, వెలిగండ్ల, కనిగిరి, మర్రిపూడి, పొదిలి, తాళ్లూరు, చీమకుర్తి, అద్దంకి, జె.పంగులూరు మండలాల నుంచి ఈ రహదారి వెళ్తుంది. ఈ మండలాల్లోని గ్రామాల్లో భూములకు మంచి గిరాకీ ఉంది. తాళ్లూరు, అద్దంకి మండలాల్లోని భూములకు నీటివసతి ఉండడంతో అన్ని రకాల పంటలూ పండుతాయి. భూములకు రైతులు ఎకరాకు రూ.50 లక్షలు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతం అన్ని మండలాల్లో ఎకరం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ధర ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వచ్చాక పామూరు, సిఎస్‌పురం మండలాల్లోనూ పలు కంపెనీలు వెంచర్లు వేశాయి. వ్యవసాయ భూములు కూడా పట్టణాలకు దగ్గరలో ఉంటే ఎకరం రూ.రెండు నుంచి రూ.మూడు కోట్లు ధర ఉంది. పంటలు పండే భూములు కూడా ఎకరం కనీసం పాతిక లక్షల రూపాయలపైనే పలుకుతోంది. ఇప్పుడు ఎంత ధర ఇస్తారనే దానిపైనే రైతులు సందిగ్దంగా ఉన్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ రానందున భూములకు ఇచ్చే ధరలపై నోరువిప్పడం లేదు. ధర త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి వెనుదిరుగుతున్నారు.