
సాధారణంగా రీమేక్ అంటే కత్తి మీద సాము. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతో పాటు నటన, దర్శకత్వం, చిత్రం, కథనం, కూర్పు, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా ఆరు విభాగాల్లో ఆస్కార్స్ అందుకున్న 'ఫారెస్ట్ గంప్'ను రీమేక్ చేయడం అంటే? అటువంటి సవాలునే అమీర్‌ఖాన్ స్వీకరించారు. హాలీవుడ్‌లో టామ్ హాంక్స్ చేసిన పాత్రను హిందీ సినిమా 'లాల్ సింగ్ చడ్డా'లో అమీర్ చేశారు. ఈ చిత్రంతో అక్కినేని నాగచైతన్య హిందీ తెరకు పరిచయమయ్యారు. దీనికి తగినట్లుగా సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండడం ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఆయన పాత్ర ఎలా ఉంది? అనేది చూద్దాం.
కథలోకి వెళ్తే.. ఈ కథంతా 1975 నుంచి మొదలవుతుంది. లాల్‌సింగ్ చడ్డా (అమీర్‌ఖాన్) పంజాబ్‌లోని సిక్కు కుటుంబంలో జన్మించిన బుద్ధిమాంద్యం గల కుర్రాడు. చిన్నప్పుడే సరిగా నడవలేని పరిస్థితుల్లో తల్లి ప్రోత్సాహంతో స్కూల్‌కు వెళ్లి అందరిలా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. 'నువ్వు అందరిలాంటి చిన్నారివే. ఎందులోనూ తక్కువ కాదు. నీ పనులు నువ్వు చేసుకోవాలి' అని అతడికి తల్లి (మోనా సింగ్) ధైర్యం చెబుతుంది. అలా స్కూల్‌కు వెళ్లిన సమయంలో రూప (కరీనాకపూర్) అనే తన స్నేహితురాలి ప్రోత్సాహంతో ఎలాంటి అవసరం లేకుండా నడిచేలా మారతాడు. లాల్ కుటుంబంలో తాత ముత్తాతలంతా ఆర్మీలో పనిచేసినవాళ్లే. లాల్ కూడా ఆర్మీలో పనిచేయాలనేది తల్లి కోరిక. ఆ మేరకు ఆర్మీలో చేరతాడు. అక్కడే తోటి సిపాయి బాలరాజు (నాగచైతన్య) పరిచయమవుతాడు. అతని కుటుంబానికీ ఓ చరిత్ర ఉంది. బనియన్లు, డ్రాయర్లు తయారుచేసే కుటుంబం వాళ్లది. ఎప్పటికైనా తన తాత ముత్తాతల్లా కంపెనీని ఏర్పాటు చేయాలని కలలు కంటుంటాడు. లాల్, బాల ఇద్దరూ ఆర్మీ నుంచి బయటికెళ్లాక కలిసి బనియన్లు, డ్రాయర్ల వ్యాపారం చేయాలనుకుంటారు. మరి జీవితం ఆ ఇద్దరినీ ఎక్కడి వరకూ తీసుకెళ్లింది? చిన్నప్పుడు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రూపతో లాల్ జీవితాన్ని పంచుకున్నాడా? లేదా? తల్లి సాయం లేకుండా నడవలేని స్థాయి నుంచి రాష్ట్రపతి అవార్డు అందుకునే స్థాయికి లాల్ ఎలా చేరగలిగాడు అనేదే మిగతా కథ.
ఇది 90వ దశకంలో వచ్చిన 'ఫారెస్ట్ గంప్' కి భారతీయ అనుకరణ. పాయింట్ ఒక్కటే అక్కడ నుంచి తీసుకున్నారు. కానీ భారతీయులకు తగినట్లుగా అనేక మార్పులు, చేర్పులు చేశారు. ఆ కథకి మన సామాజిక, రాజకీయ పరిస్థితులతో ముడిపెట్టి, రచించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ విషయంలో రచయిత అతుల్ కులకర్ణి కథపై తనదైన ముద్ర వేశారు. పరిస్థితులతో పాటు.. ప్రేమ, మానవత్వం వంటి విషయాల్ని ఈ కథలో అందంగా స్పృశించారు. పటాన్ కోట్ నుంచి చండీగఢ్ వెళ్లే రైలులో ఈ కథ మొదలవుతుంది.
ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత, మత కలహాలు, ముంబయి అల్లర్లు, కార్గిల్ యుద్ధం, ముంబయి మారణహోమం, అన్నా హజారే దీక్ష.. ఇలా దేశంలో జరిగిన పలు సంఘటనల్ని కథతో ముడిపెట్టిన తీరు.. ప్రతి ఒక్కరినీ లీనం చేస్తుంది. లాల్ బాల్యం, అతని ఎదుగుదల, రూపతో ప్రేమ, ఆర్మీ జీవితం... ఇలా పలు పార్శ్వాలుగా కథ సాగుతుంది. షారూఖ్‌ఖాన్ ఎపిసోడ్, లాల్ పరుగు పోటీలు, బాల బనియన్ల కథ.. ప్రేక్షకులకు స్వచ్ఛమైన హాస్యం పంచుతాయి. ద్వితీయార్థం భావోద్వేగాలే ప్రధానంగా సాగుతుంది. లాల్- రూప బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హృదయాల్ని మెలిపెడతాయి. మహమ్మద్ భారు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మతం, మానవత్వం వంటి విషయాల్ని అందంగా ఆవిష్కరిస్తాయి. పతాక సన్నివేశాలు భావోద్వేగాలకి పెద్దపీట వేసినా.. అవి మరీ నిదానంగా, మాటలతో సాగడం అంతగా మెప్పించదు.
ఈ చిత్రంలో అమీర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాల్‌సింగ్ చడ్డా పాత్రలో జీవించేశాడు. రూప పాత్రలో కరీనాకపూర్ ఒదిగిపోయింది. ఇక జవాన్ బాలరాజు పాత్రతో నాగచైతన్య మెప్పించాడు. నటనలో, ఆహార్యంలో నాగచైతన్య వైవిధ్యం చూపించాడు. చడ్డీ బనియన్ బిజినెస్ చేయాలనుకునే ఆర్మీ మ్యాన్‌గా అక్కడక్కడా నవ్వులు పంచారు. లాల్ తల్లి పాత్రలో మోనాసింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రీతమ్ పాటలు బాగున్నాయి. తనూజ్ టీకు నేపథ్య సంగీతం బాగుంది. సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ నచ్చుతుంది. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సింది. అతిథి పాత్రలో షారుఖ్‌ఖాన్ మెరిశారు. ఆయన పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ నవ్విస్తుంది.
చిత్రం: లాల్ సింగ్ చడ్డా
నటీనటులు: అమీర్‌ఖాన్, కరీనాకపూర్, నాగచైతన్య, మానవ్ విజ్, మోనాసింగ్ తదితరులు
సాంకేతికవర్గం: ఛాయాగ్రహణం: సేతు,
కూర్పు: హేమంతి సర్కార్,
రచన: అతుల్ కులకర్ణి
సంగీతం: తనూజ్ టీకు, ప్రీతమ్
నిర్మాతలు: ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్,
జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
సమర్పణ: చిరంజీవి,
దర్శకత్వం: అద్వైత్ చందన్
నిర్మాణ సంస్థలు: వయాకామ్ 18 స్టూడియోస్, అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్
పంపిణీ: పారామౌంట్ పిక్చర్స్