Jul 17,2023 09:35
  • వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు
  • సందర్శకులపై పోలీసుల లాఠీఛార్జి

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : చారిత్రాత్మకమైన లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయంలో బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పిం చేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించు కున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుఫున అమ్మ వారికి దేవాదాయ శాఖ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పట్టువస్త్రాలు, హైదరా బాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి బంగారు బోనం సమర్పించారు.ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని దాదాపు 460 దేవాలయాలు బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌. ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భారత మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, హైదరాబాద్‌ నగర డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. క్యాసినోలు నిర్వహిస్తూ గతంలో పోలీసులకు చిక్కిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌... లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శిం చుకునే క్రమంలో భద్రతా సిబ్బంది గన్‌తో ఆలయం లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోనాల ఉత్సవాల్లో నృత్యం చేసుకుంటూ ఒక్కసారిగా బోనాలతో ఆలయానికి వచ్చిన సందర్శకులను అదుపు చేసే పేరుతో వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో, పోలీసుల వ్యవహార శైలిపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.