ఐక్యరాజ్య సమితి : పశ్చిమాఫ్రికాలో పెద్ద సంఖ్యలో శరణార్థులు వున్న చాద్‌లో మెజారిటీ మందికి సాయం అందించలేని పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు. సూడాన్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, నైజీరియా, కామరూన్‌లకు చెందిన దాదాపు 30 వేల మంది శరణార్థులకు ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ఆహారం, ప్రాణాధార మందులు వంటి సహాయాన్ని అందజేస్తోంది. అయితే ఈ నిధుల కొరతతో ఈ సహాయాన్ని నిలిపేసి పరిస్థితి ముంచుకోస్తోందని డబ్లుఎఫ్‌పి ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలు తక్షణమే స్పందించిన నిధులు సమకూర్చకపోతే..శరణార్థులకు అందిస్తున్న సాయంలో తీవ్రంగా కోత విధించే అవకాశాలు వున్నాయని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటానియో గుటెరస్ ముఖ్య ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు. అంటే నవంబరు కల్లా కేవలం 10 శాతం మంది శరణార్థులకు మాత్రమే సాయం అందే అవకాశాలు వుంటాయి.
నిధుల కొరత తీవ్రంగా వుండడం వల్ల ఈ నిర్ణయం తప్పడం లేదని డుజారిక్ అన్నారు. గత నెల్లోని 5,75,000 మంది శరణార్థులకు తోడు, చాద్‌లో నిర్వాసితుల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. 2020లో వీరి సంఖ్య 1,69,000 వుండగా, 2022నాటికి 3,81,000కి చేరిందన్నారు. చాద్‌లో ఇటీవలికాలంలో ఎన్నడూ లేని రీతిలో భయంకరమైన వరదలు సంభవించాయి. 10 లక్షల మందికి పైగా ఈ వరదలకు ప్రభావితులయ్యారు. ప్రభుత్వం చేపట్టిన జాతీయ ప్రతిస్పందన ప్రణాళికకు మద్దతుగా డబ్ల్యుఎఫ్‌పి బాధిత కుటుంబాలకు ఆహారం, నగదు సాయాన్ని అందచేసింది. ఆఫ్రికాలో అత్యంత నిరుపేద దేశాల్లో చాద్ ఒకటి. శరణార్ధులు, నిర్వాసితులకు, వరద బాధితులకు వచ్చే ఆరు మాసాల కాలానికి అత్యవసర సాయం అందాలంటే 10.2కోట్ల అమెరికన్ డాలర్లు అవసరమవుతాయని డబ్ల్యుఎప్‌ఫి చెబుతోంది.










