
వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడం, ఆహార వస్తువుల ధరల స్థిరీకరణ సాధించడం, పేద ప్రజలకు ఆహార భద్రత కలిగించడం, వ్యవసాయదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం, దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడం, పరిమితంగా ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడం.... వంటి విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించట్లేదు. అందుకని మనం పేదరికం ఊబిలో కూరుకుపోతున్నాం. ధరలు నానాటికీ పెరగడానికి కారణం వ్యవసాయ అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడటమే. ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది శ్రమ సంస్కృతి. పేదరికానికి మూలం కర్మవాదం అనే భావనలో నెట్టకుండా, ప్రజలను ఉత్పత్తిలో భాగస్వాములుగా చేయడం.
భారతదేశం లోని ఆర్థిక వ్యవస్థ సూచి నానాటికీ దిగజారి చివరకు శ్రీలంక కంటే కూడా దిగువ స్థాయిలో ఉండడం బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రపంచ దారిద్య్ర సూచికలో 2022 సంవత్సరానికి గానూ 121 దేశాల వివరాలు ప్రకటించారు. దానిలో భారతదేశం 107వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశ స్థితిని దారిద్య్రం వైపు, దివాలాకోరుతనం వైపు చూడడానికి ఒక అవకాశం కలిగింది. ఎందుకంటే ఆ సూచీలో రువాండా 102వ స్థానం, నైజీరియా 103వ స్థానం, ఆప్ఘనిస్తాన్ 109వ స్థానంలో ఉన్నాయి. దగ్గర దగ్గర వాటికి సమాంతరంగా మనం ఉన్నాము. ఈ విధంగా భారతదేశం దిగజారిపోవడానికి కారణం పాలకవర్గం మతోన్మాదంతో దేశాన్ని పాలించడమే. ముఖ్యంగా దేశంలో ఈనాడు ధనవంతులుగా ఉన్న వారిలో కార్పొరేట్ శక్తులు, మతతత్వవాదులు, బ్యాంకులకు డబ్బులు ఎగవేసిన వాళ్ళు, అవినీతి అధికారులు, దోపిడీని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులే అత్యధికం. ప్రధానంగా మతోన్మాదం అంతర్గతంగా అన్నిటినీ అజమాయిషీ చేయాలని చూస్తోంది. 150 కోట్ల చెక్కు వేంకటేశ్వరస్వామి హుండీలో పడిందంటే ఎంత నల్ల డబ్బు దేవుడి పేర చెలామణి అవుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఈ నెల 23వ తేదీన 80,560 మంది భక్తులు రూ.6.31 కోట్లు హుండీలో వేశారంటే భారతదేశ మిగుల ధనం మూఢాచారాలకూ, మూఢవిశ్వాసాలకు ఎంతగా వ్యర్థమౌతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం సముద్ర స్నానాలలో ఒక్క అక్టోబర్ నెలలోనే 180 మంది చనిపోయారంటేనే ఎన్ని మూఢ విశ్వాసాలు ముప్పిరిగొన్నాయో అంచనా వేయవచ్చు. ఎ.పి లోని కర్నూలు జిల్లాలో శ్రీశైల మల్లిఖార్జున జ్యోతిర్లింగాన్ని, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కాశీవిశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని, మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని, తమిళనాడు లోని కన్యాకుమారి వద్ద ఉన్న శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని కార్తీక మాసంలో దర్శించడమే కాక లక్షలాది దీపాలు వెలిగించి, కానుకలు సమర్పించి కోట్ల రూపాయలు తీర్ధయాత్రల పేర ప్రయాణాలకు ఖర్చుపెట్టి మూఢత్వాన్ని ఎంతగా పెంచుకుంటున్నారో, మిగుల ధనాన్ని అంతా దేవాలయాలకు ఎలా సమర్పిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మరీ ముఖ్యంగా బి.జె.పి, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ దేశంలో జ్ఞానాన్ని పెరగనివ్వడం లేదు. దేశంలో ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రజలు కొద్దిగా డబ్బు దొరికితే దేవాలయాలు, స్వాములు, యోగుల వైపు పరుగెడుతున్నారు.
నిజానికి దీపావళి ఒక అసంబద్ధమైన పండుగ. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బాణాసంచా కాల్చొద్దని ప్రకటన చేస్తే బి.జె.పి వారు దానిని ఎదిరించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో అర్థరాత్రి నుంచి బాణాసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి జనానికి ఊపిరాడని పరిస్థితి వచ్చింది. కేవలం ఒక కట్టు కథతో నరకాసురుడు అనే రాక్షసుడిని కృష్ణుడు చంపాడనే భావనతో దేశమంతా అక్టోబర్ 24న దీపావళికి బాణాసంచా కాల్చారు. దీనివల్ల మొత్తం భారతదేశ పర్యావరణ వ్యవస్థనే దెబ్బతీసేంతగా వాయు కాలుష్యం జరిగింది.
ఇకపోతే భారతదేశం ఎందుకు ఆర్థికంగా సంక్షోభంలో వుందని పరిశీలిస్తే రాజ్యాంగ అధికరణం 48లో వ్యవసాయ పశుగుణాభివృద్ధి ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్దేశితం చేయడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని, పాడి పరిశ్రమను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ భారత ప్రభుత్వం రైతులను, రైతు కూలీలను నిరంతరం సంక్షోభంలో వుంచుతోంది. అంతేకాకుండా పోలవరం వంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం ఇవ్వట్లేదు. భారతదేశంలో వ్యవసాయ భూమి విస్తరించట్లేదు. పేద ప్రజలకు భూములు ఇవ్వడంలేదు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీతో జోడి కడుతున్నారు. భారత రాజ్యాంగం వ్యవసాయ విస్తృతిని గురించి పెద్ద ఎత్తున ప్రణాళికలు ఇచ్చింది. పాలకవర్గం వాటన్నింటినీ విస్మరించడం వల్లే ఈ రోజున పేదరికం ఈ స్థాయిలో పెరిగింది. మరి ముఖ్యంగా సంస్కరణలు వృద్ధిరేటును పెంచినప్పటికి నిరుద్యోగ నిర్మూలనకు పెద్దగా తోడ్పడలేదు. సంస్కరణలకు ముందు ఉపాధి వృద్ధిరేటు సంవత్సరానికి 2.39 శాతం కాగా, సంస్కరణల తర్వాత 1 శాతం మాత్రమే ముఖ్యంగా సంఘటిత రంగంలో ఉపాధి తగ్గిపోతున్నది. రెగ్యులర్ ఎంప్లాయీస్ తగ్గుతూ క్యాజువల్ లేబర్ పెరుగుతున్నారు. క్యాజువల్ లేబర్‌ను, ప్రభుత్వ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చకపోవడం వలన వారు అభద్రతలో వున్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే వివిధ ప్రణాళికలు కొన్ని సూచనలు చేశాయి. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడం, ఆహార వస్తువుల ధరల స్థిరీకరణ సాధించడం, పేద ప్రజలకు ఆహార భద్రత కలిగించడం, వ్యవసాయదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం, దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడం, పరిమితంగా ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడం. ... వంటి విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించట్లేదు. అందుకని మనం పేదరికం ఊబిలో కూరుకుపోతున్నాం. ధరలు నానాటికీ పెరగడానికి కారణం వ్యవసాయ అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడటమే. ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది శ్రమ సంస్కృతి. పేదరికానికి మూలం కర్మవాదం అనే భావనలో నెట్టకుండా, ప్రజలను ఉత్పత్తిలో భాగస్వాములుగా చేయడం. దేవునిపై విశ్వాసం అనేది వ్యక్తిగత అంశం. ప్రభుత్వాలు వాటిని రాష్ట్రీయ అంశంగా దేశీయ అంశంగా మార్చి ప్రజలను కర్మవాదంలో ముంచుతున్నారు. కానీ ప్రజలను చైతన్యవంతులుగా, విజ్ఞానవంతులుగా, ఆలోచనా పరులుగా, అవగాహనాపరులుగా చేసి...పని సంస్కృతిని అలవరచాలి. ఆ రోజున మనకు భారతదేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల అభివృద్ధి జరుగుతుంది.
/ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు,
సెల్ : 9849741695/
డా|| కత్తి పద్మారావు