
(గత సంచిక తరువాయి)
ఆయన పక్కన మహారాష్ట్ర నుంచి వచ్చిన అశోక్‌థావలే.. ఆయన విజూ కృష్ణన్.. ఇతరులు. 2018లో నాసిక్ నుంచి ముంబయికి లక్షలాది రైతులతో కిసాన్‌లాంగ్ మార్చ్ నిర్వహించారు.' అని మీనా వివరించారు.
''వీళ్ళకి ఖలిస్తానీలతో సంబంధాలు ఉన్నాయంటున్నారుగా?'' అని అడిగాను.
'లేదు సార్. వీళ్లలో కొంతమంది భారత సైన్యంలో పనిచేసి, బంగ్లాదేశ్ విముక్తిలో కూడా పాల్గొన్నారు. ఖలిస్తానీలతో పోరాడి, తుపాకీ గుళ్ళు తిన్నారు. వీరి అనుయాయులు కొంతమంది ఖలిస్తానీ శక్తులతో పోరాడి, చనిపోయారు. వీళ్లలో కొంతమంది పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి లోక్‌సభ సభ్యుడు కూడా ఈ చట్టాలను వ్యతిరేకించి, పాలకపార్టీకి మద్దతును వెనక్కి తీసుకున్నాడు. అకాలీలైతే 30 ఏళ్లుగా తమకు బిజెపితో ఉన్న సంబంధాన్ని తెగ్గొట్టుకున్నారు. కేంద్రమంత్రి కూడా రాజీనామా చేసింది మీకు తెలుసుగదా!' అని అన్నాడు.
ఈ లోపు మంత్రులు వచ్చారు. చర్చలు మొదలయ్యాయి. మొదట మంత్రి పది నిమిషాలు ఈ చట్టాల వల్ల రైతులకు జరిగే మంచి గురించి చెప్తూ, వాటి గురించి వివరించారు. ఆయన చెప్పడం ఆపగానే, కవితా కురుగంటి 'మంత్రిగారూ! ఈ చట్టాలను ఎవరితో సంప్రదించి చేశారు?' అని అడిగారు.
'మేము వ్యవసాయరంగ నిపుణులతో సంప్రదించి ఈ చట్టాలను చేశాము' అన్నారాయన.
'ఆ నిపుణులలో ఎవరైనా వ్యవసాయం చేశారా?' అని అడిగారామె.
తెల్ల మొహం వేశాడాయన.
'సరే, మీరు చట్టాలలో ఉన్న మంచి చెప్పారు. 50 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న రాజేవాల్ గారు ఈ చట్టాలలో ఏమేమి లోపాలున్నాయో వివరిస్తారు' అన్నారామె.
రాజేవాల్ లాప్‌టాప్‌తో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
'అసలీ చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. పొలంలో పండిన పంట బజారులో రైతు అమ్మే ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుంది. అందువల్ల రాజ్యాంగం ప్రకారం ఈ చట్టాలను చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒక్కొక్క చట్టంలో రైతులకు నష్టం కలిగే అంశాలను విశదీకరించి, చెప్పారు. ఈ చట్టాలను సవరించడం కుదరదు. వీటిని సమూలంగా వెనక్కి తీసుకుని, మళ్ళీ రైతు సంఘాలతో, రాష్ట్ర ప్రభుత్వాలతో, వ్యవసాయ రంగ నిపుణులతో, వ్యాపారం చేసే కంపెనీల ప్రతినిధులతో సంప్రదించి, అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త చట్టాలు చేసి, వాటితో పాటు స్వామినాథన్ కమిటీ చెప్పిన పద్ధతిలో కనీస మద్దతు ధరని గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలి. కనీస మద్దతు ధరకి తక్కువగా వ్యాపారులు గాని, కంపెనీలుగాని కొనకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే' అన్నారు.
ఆయన ముగించాక నిమిషం పాటు అందరూ నిశ్శబ్ధంగా ఉన్నారు. మంత్రులూ, అధికారులూ ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. వీళ్లేదో పల్లెటూరి అజ్ఞానులనుకున్నాం. ఇంత కూలంకషంగా ఏకి పారేశాడేమిటా అని అనుకుంటున్నట్టున్నారు.
లంచ్ విరామం ప్రకటించారు.
'మేము తెప్పిన భోజనం చేయడానికి రైతు నేతలు నిరాకరించారు. తమ గురుద్వారా నుంచి వచ్చిన ఆహారం తిన్నారు. కొంతమంది రైతు నాయకులు నేల మీదే కూర్చుని తిన్నారు. నేనూ, మీనా, నెమ్మదిగా రాజేవాల్ గారి వద్దకు వెళ్ళాం. పరిచయాలయ్యాక ఆయనను ప్రశంసించాను. చాలా బాగా మాట్లాడారని మెచ్చుకున్నాను. ''రావుగారూ, ఆరునెలలుగా ఈ చట్టాలను గురించి ఊరూ వాడా ప్రచారం చేశాము. పంజాబు, హర్యానాలలో గ్రామగ్రామాన సమావేశాలు ఏర్పాటు చేశాము. ఈ చట్టాలను పంజాబీ, హిందీ భాషలలోకి తర్జుమా చేసి, కొన్ని లక్షల ప్రతులను రైతులకు పంచాము. రైతులందరితో చదివించాము. చదువు రాని వారికి, వారి పిల్లలు చదివి వివరించారు'' అన్నారాయన.
''మా ప్రదర్శనా స్థలానికి వచ్చి, ఎవరిని కదిలించినా ఈ చట్టాలను గురించి కూలంకషంగా చర్చించగలరు. నిద్రలోనైనా వీటిలోని లోపాలు చెప్పగలరు'' అని అన్నారు.
'మేమూ వాళ్ళతోనే భోం చేశాము. ''ఈ చట్టాలలో ఏ మార్పులు చేస్తే మీకంగీకారమో చెప్పండి. నేను మంత్రిగారితో మాట్లాడతాను'' అని అన్నాను.
''రావు గారూ, రెండేళ్ల క్రితం నీతి అయోగ్ వ్యవసాయ నిపుణులతో, వ్యవసాయోత్పత్తులను కొని, నిల్వ చేసి, అమ్మే కంపెనీ ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. దానికి రైతులను కూడా ఆహ్వానించారు. నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను. వారందరి ఉపాన్యాసాలు విన్నాను. నా కర్థమయిందేమంటే, చిన్న రైతుల భూములను కంపెనీలు స్వాధీనపరుచుకుంటాయి. తమకు కావలసిన పంటలు పండించేటట్లు చేస్తారు. రైతులు తమ పొలాల్లోనే కూలీ వాళ్ళుగా మారే పరిస్థితులను సృష్టిస్తారు. నలభైఏళ్ళ క్రితం 1980 దశకంలో అమెరికాలో ఇలాంటి చట్టాలనే తీసుకొచ్చారు. రీగన్ గారు అమెరికాలో అన్ని రాష్ట్రాలలో పర్యటించి, ఆ చట్టాల వల్ల రైతులు విపరీతంగా లాభపడతారని చెప్పాడు. చివరకు జరిగిందేమిటో తెలుసా? చిన్న రైతులు నాశనమయ్యారు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ ప్రస్తుతం అమెరికాలో నాలుగు పెద్ద కంపెనీల చేతులలో ఉన్నాయి. మన ప్రభుత్వం కూడా వ్యవసాయ ఉత్పత్తులను 3,4 కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూస్తోంది. మా పిల్లలు ఇంగ్లాండ్, కెనడా, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియాలలో పనిచేస్తున్నారు. మా పూర్వీకులు శతాబ్దం నుండి కెనడాలో వ్యవసాయం చేస్తున్నారు. ఈ చట్టాల ప్రతులను వారికి పంపించాం. వారు అక్కడ లాయర్లతో, వ్యవసాయ నిపుణులతో, సెనేటర్స్‌తో మాట్లాడారు. ఈ చట్టాలన్నీ కంపెనీల ప్రయోజనాలను కాపాడతాయనీ, రైతులకు వ్యతిరేకమయినవనీ వారందరి అభిప్రాయం.
''దేబబ్రత పైన్'' అని మన దేశం నుంచి నాసాలో పనిచేసిన శాస్త్రజ్ఞుడు. రిటైర్ అయ్యి లాస్‌ఏంజెల్స్, కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. చిట్టగాంగ్ అని ఒక డాక్యుమెంటరీ సినిమా తీశాడు. దానికి చాలా అవార్డులు వచ్చాయి. తన ముగ్గురు మిత్రులతో కారులో అమెరికాలో వ్యవసాయ ప్రధానమైన అయోవా, కాన్సాస్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో పదివేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, అక్కడ అనేక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అక్కడ రైతులతో వ్యవసాయరంగ నిపుణులతో మాట్లాడారు. వారి పరిస్థితులను, వారి సమస్యలను అధ్యయనం చేశారు. ''డెజావూ'' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రం రూపొందిస్తున్నారు.
ఆయన చెప్పిందేమిటంటే - ''అక్కడ రైతులు మన ప్రదర్శనలను గమనిస్తున్నారు. మా రీగన్ గారు కూడా ఇప్పుడు మీ ప్రధాని చెప్పినట్లే కబుర్లు చెప్పాడు. అరచేతిలో స్వర్గం చూపించాడు. మేము మోసపోయాం. అందరం సంఘటితంగా పోరాడి ఉంటే మా పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదు. మీరు సంఘటితంగా పోరాడుతున్నారు. మీరు విజయం సాధిస్తారు. ప్రపంచంలోని అందరు చిన్న రైతుల మద్దతు మీకుంటుంది'' అని అన్నారు.
ఇది మా జీవన్మరణ సమస్య. ఈ చట్టాలు వెనక్కు తీసుకోవాలి. కనీసమద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి. అది సాధించే వరకు వెనుతిరిగేది లేదు. ఎన్ని నెలలైనా, సంవత్సరాలైనా ఈ ఉద్యమం కొనసాగుతుంది'' అన్నారు.
తర్వాత చర్చలు మళ్ళీ ప్రారంభమయ్యాయి.
మంత్రులు పెద్దాయనతో సంప్రదించి వచ్చినట్లున్నారు. ''మేము ఈ చట్టాలను రైతుల సౌభాగ్యం కోసం, మంచి మనస్సుతో, ఉద్దేశ్యంతో చేశాము. మీరు మమ్మల్ని తప్పుగా అర్థంచేసుకుంటున్నారు. ఈ చట్టాలలోని లోపాలన్నిటినీ సవరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ముందు మీరు ఈ ఉద్యమం ఆపి, రైతులను వారి ఇళ్లకు పంపించండి. నలుగురైదుగురితో ఒక కమిటీ వేసి, ఈ చట్టాలను సవరించుదాం'' అని ప్రతిపాదించారు.
''దానికి రైతు నాయకులేమన్నారు?'' అని అడిగాను.
''పదిహేనేళ్ల నాటి స్వామినాథన్ కమిటీ సిఫార్సులనే ఏ ప్రభుత్వమూ పూర్తిగా అమలు చేయలేదు. కొత్తగా కమిటీ వేసినా అదే పరిస్థితి ఉంటుంది. ముందు ఈ చట్టాలను వెనక్కు తీసుకోండి. కనీస మద్దతు ధరని గ్యారంటీ చేస్తూ చట్టం చేయండి. కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఎవరూ కొనకుండా కొత్త చట్టం చేయండి. మళ్ళీ రైతులతో, వ్యవసాయరంగ నిపుణులతో, వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త చట్టాలను చేయండి. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆపేది లేదు'' అన్నారు రైతు నాయకులు.
'మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కలుద్దామని సమావేశాన్ని ముగించారు.
కొన్నిసార్లు మంత్రులతో, ఒకసారి హోంమంత్రితో చర్చలు జరిగాయి. అయినా ఫలితం రాలేదు. మొత్తం 11 సార్లు చర్చలు జరిపారు.
తర్వాత జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ ప్రదర్శన జరిగింది. ఒక రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. కొంతమంది రైతులు ఎర్రకోటలోకి వెళ్లారు. వారి మీద పోలీసులు లాఠీఛార్జి, భాష్పవాయు ప్రయోగం చేశారు. రైతులు తిరగబడి పోలీసులని ఎర్రకోట మీద నుంచి నెట్టారు. ఎర్రకోట మీద సిక్కు మత జండా ఎగరవేయడం మీరంతా మీడియాలో చూసి ఉంటారు గదా!' అన్నాడు సుబ్బిగాడు.
'అరే సుబ్బీ ఎర్రకోట దుర్భేద్యమైందంటారు గదా! అంత తేలికగా రైతులు దాంట్లోకెలా వెళ్లగలిగారు? అంత పెద్ద ఇనుపగేటుని ఎట్లా దాటగలిగారు?' అన్నాను.
'రైతుల వాదన అదే. కొంతమంది యువ రైతులు ఎర్రకోటలోకి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారని, వారి పేర్లతో సహా పోలీసు అధికారులకు ముందురోజు రాత్రి సమాచారం ఇచ్చామని రైతు నాయకులు చెబుతున్నారు. ఇదంతా పన్నాగం ప్రకారం పోలీసులు చేసిన పని అనీ, ఎర్రకోట వెళ్ళే దారిని కొంతమంది రైతులకు చూపించి, పోలీసులే తీసుకెళ్లారని రైతు నాయకులు అంటున్నారు. న్యాయ విచారణ జరపాలని వాళ్ళు డిమాండు చేస్తున్నారు.
నావీ నుండి రిటైర్ అయిన అడ్మినల్ రాందాస్ గారు మన దేశాధ్యక్షుడికి ఒక విజ్ఞాపన పంపించారు. తను ఎన్నోసార్లు ఎర్రకోటలో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నాననీ, సాయుధ బలగాల అంగీకారం లేకుండా ఎర్రకోటలోకి వెళ్ళటం అసాధ్యమని ఆయన అంటున్నారు. ఈ సంఘటన మీద న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నాడాయన.' అని చెప్పాడు సుబ్బీ.
'మరి ఆ విజ్ఞాపన గురించి రాష్ట్రపతి గారు స్పందించినట్లు లేరు గదా!' అన్నాను.
'ఆయన దేనికి స్పందించాడులే!' అన్నాడు యు గాడు.
'ఈ లోపు సుప్రీంకోర్టు ఈ చట్టాలను ఒకటిన్నరేళ్లు స్థంభింపచేసింది. ప్రభుత్వం దానికి అంగీకరించింది. రైతు నేతలు తమ డిమాండ్లు నెరవేరే దాక ఉద్యమం ఆపేదిలేదని పట్టుబట్టారు. తర్వాత పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌లలో కొన్ని లక్షల మందితో గ్రామ పంచాయత్‌లు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా రైతులకు సంఘీభావం ప్రకటించాయి. ప్రతి ఇంటి నుండీ ధన, వస్తు సహాయం అందించాలనీ ఆ పంచాయితీలలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.
పాలకపార్టీ నాయకులను ఊరిలోకి రాకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. వారిని సాంఘిక బహిష్కారం చేస్తున్నారు. పెళ్లిళ్ళకు, పేరంటాలకూ పాలక పార్టీ సభ్యులను పిలవడం లేదు.
ఈ లోపు బెంగాల్‌లో ఎలక్షన్ ప్రకటించారు. పాలకపార్టీ నేతలు, మంత్రులు బెంగాల్‌లో రెండు నెలలు మకాం వేశారు. ప్రధాని 15 సార్లు బెంగాల్ వెళ్లారు. హోంమంత్రి 55 సభలలో మాట్లాడారు. రోడ్ షోలు జరిపారు. రైతులు కూడా కేంద్రంలో పాలక పార్టీని బెంగాల్‌లో ఓడించమని ప్రజలను కోరుతూ ప్రచారం చేశారు. సభలలో ప్రసంగించారు.
ఈ లోపు కరోనా రెండో అల ఏప్రిల్ మాసం నుంచి మొదలైంది. అతి తీవ్రంగా వచ్చింది. ఉత్తర భారతంలో, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఆక్సిజన్ సరిగా అందక చాలామంది రోగులు మరణించారు. హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరక్క ఆవరణల్లో, రహదారుల మీద, కార్లలో, ఆటోలలో చాలామంది మరణించారు. స్మశాన వాటికల్లో చోటు లేక పార్కుల్లోనే శవాలను ఖననం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
గంగా నదిలో శవాలు తేలి రావడం, గంగ ఒడ్డున శవాలని పాతిపెట్టాల్సిన దుర్గతి పట్టింది.' అని చెప్పుకొచ్చాడు సుబ్బి.
'ఇదంతా ఎందుకు జరిగింది?' అడిగాడు యు గాడు.
'మన పాలకులు కరోనాని జయించామనే భ్రమలో ఉన్నారు. యూరప్‌లో చాలా దేశాలలో అప్పటికే రెండో అల వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మన శాస్త్రవేత్తలు, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు, రెండో అల కోసం ఆక్సిజన్‌ను ఎక్కువగా తయారుచేయాలని, ఐసియు బెడ్లను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞాపన చేశారు. వారిని పట్టించుకోలేదు. మన ప్రధాని దావోస్‌లో జరిగిన ప్రపంచ ప్రజానీకాన్ని కరోనా నుంచి కాపాడిందనీ ప్రగల్బాలు పలికాడు. మన ఆరోగ్యమంత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభలో కరోనా మీద పోరాటంలో మనం చివర దశలో ఉన్నామని ప్రకటించారు' అన్నాడు సుబ్బి.
'ప్రదర్శనలో పాల్గొంటున్న రైతులు కూడా 700 మంది మరణించారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతమంది రైతులు చనిపోయినా ఇప్పటివరకూ ప్రభుత్వ పెద్దలు వారికి కనీసం శ్రద్ధాంజలి ఘటించలేదు గదా!' అన్నాడు యు గాడు.
'మరి భవిష్యత్ ఎలా ఉంటుంది?' అడిగాను నేను.
'ప్రభుత్వం మొండిగా ఉంది. రైతులు మాత్రం తక్కువ తిన్నారా? ఈ పాలకులను ఓటిచ్చి గద్దెనెక్కించింది మేము. మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వీళ్ళని గద్దె దించగలమని అంటున్నారు. గ్రామగ్రామాన వీరికి మద్దతు పెరుగుతోంది. నాయకులు వెనక్కు తగ్గుదామన్నా ప్రజలు ఊరుకునేట్లు లేరు. వారినే బహిష్కరించే పరిస్థితి ఉంది.
తెలుగు జాతి స్వాభిమానం అనే నినాదంతో ఎన్టీఆర్ ఆ రోజులలో ఎన్నికల పోరు జరిపారు గదా! అలాగే రైతులు చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ పాలకులు మా స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నారనే భావనలో రైతులున్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేదాకా వెనుతిరిగేది లేదని అంటున్నారు. తాడో పేడో తేల్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా విజయం సాధించారని నా నమ్మకం.
ఇంకో విషయం చెప్పాలి. నేనే ఐఎఎస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. మన రాష్ట్రం వచ్చి చిన్న రైతుల కోసం నా వంతు సహాయం చేయాలని అనుకుంటున్నా' అన్నాడు సుబ్బిగాడు.
'అదేంటిరా! బంగారం లాంటి ఉద్యోగం వదిలేయడం ఏమిటిరా?' అని మేమిద్దరం ఒకేసారి అన్నాం.
'నాన్నగారి గురించి మీకు తెలుసు గదా! అట్టడుగున ఉన్న ప్రజలకు మేలు చేయలేకపోతే ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఉపయోగం లేదనేవారాయన. జిల్లా కలెక్టర్ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత అంతా పై పై మెరుగులే గాని, ప్రజలకు ఉపయోగపడే పనేమీ చేయలేము. పై అధికారులు, వారిపైన ఉండే రాజకీయ నేతలు ఏం చెప్తే అదే చెయ్యాల్సి ఉంటుంది. అలా నా శేష జీవితం గడపటం నాకు ఇష్టం లేదు.
మన జిల్లాలో చిన్న రైతులకు ఉపయోగపడేట్లు ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని అనుకుంటున్నాను. మీ ఇద్దరూ నాకు తోడయితే బాగుంటుంది' అన్నాడు సుబ్బి.
'తప్పకుండా మనం కలిసి పనిచేద్దాం!' అని మేమిద్దరం ఏక కంఠంతో అన్నాం.
(సమాప్తం)