Jul 02,2023 11:04

'పూలనే కునుకేయమంటా.. తను వచ్చెనంటా..!' అంటూ కవి పూలనే కునుకేయమన్నాడు. మరి మనం కునుకు తీస్తే మెదడుకు మంచిదేనంటండీ.. సహజంగా రాత్రి నిద్ర సరిగా పట్టకపోయినా.. ప్రయాణం చేసినా.. మరో కారణంతోనో పగలు ఒకటే కునుపాట్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పగలైైనా ఓ కునుకు తీస్తే మెదడుకు ఎంతో మంచిదని లండన్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇలా నిద్రపోయే వారి మెదడు 15 క్యూబిక్‌ సెంటీమీటర్లు పెద్దదిగా ఉంటుందనీ ఈ పరిశోధకుల బృందం నిరూపించింది. కునుకేసే వారిలో వయసు మీద పడటాన్ని కనీసం ఆరేళ్ల వరకు ఆలస్యం చేస్తుందని తెలిపింది. అలాగని గంటల తరబడి నిద్రపోయేరు. అర్ధగంట కంటే తక్కువే కునుకేయాలని సూచించారు.
చాలా మంది వృత్తిపరమైన జీవితాల్లో పగలు నిద్ర అనేది చాలా కష్టం. ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులపై నిద్ర లేమి ప్రభావం ఎక్కువ. 'ప్రతి ఒక్కరూ రోజులో కొద్దిసేపు కునుకేయడంతో కొంత ప్రయోజనాన్ని పొందగలరని మేం సూచిస్తున్నాం' అని డాక్టర్‌ విక్టోరియా గార్‌ఫీల్డ్‌ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ విషయాన్ని కనుగొనలేదని డాక్టర్‌ విక్టోరియా వివరించారు.
         మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పెరుగుదలకు నిద్ర అనేది ఎంతో అవసరం. వయసు వచ్చాక నిద్ర అనేది అంత ప్రధానం కాదు. నేటి జీవన వేగంలో పని ఒత్తిడితో కొట్టుకుపోతుంటాం. కానీ, పదవీ విరమణ తర్వాతో, వయసు మళ్లాకో పగటినిద్ర పెరుగుతుంది. 65 ఏళ్లు పైబడిన 27 శాతం మంది ప్రజలు పగలు నిద్రపోతున్నారు.
         చాలా మందికి బరువు తగ్గడం, వ్యాయామం చేయడమనేది చాలా కష్టం. కానీ, దానితో పోలిస్తే నిద్ర పోవడం చాలా తేలికైన పనని గార్‌ఫీల్డ్‌ చెప్పారు. వయసు పెరుగుతున్న కొద్దీ సహజంగా మన మెదడు తగ్గుతూ వస్తోంది. కానీ, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల్ని నిరోధించేందుకు పగటి నిద్ర సాయపడుతుందా? అన్న దానిపై ఇంకా అదనపు పరిశోధనలు చేయాల్సి ఉంది.
డెమెన్షియా (బ్రెయిన్‌ ఫంక్షన్‌ను తగ్గించే వ్యాధి) అనే దానిపై పోరాడేందుకు మెదడు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. ఈ వ్యాధి వల్ల నిద్రలేమి పెరుగుతుంది. నిద్ర లేమి అనేది ఇన్‌ఫ్లేమేషన్‌కు దారితీసి, కాలక్రమంలో మన మెదడు దెబ్బతినేందుకు కారణమవుతుందని పరిశోధకులు చెప్పారు.
         మెదడు కణాల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతుందన్నారు. 'నిద్ర లేమి కారణంగా తలెత్తే న్యూరోడీజనరేషన్‌ నుంచి రక్షించేందుకు పగటినిద్ర సాయపడుతుం డొచ్చు' అని రీసెర్చర్‌ వాలెంటినా పాజ్‌ చెప్పారు.
         పనిలో ఉన్నప్పుడు నిద్రపోవడానికి అవసరమయ్యే సౌకర్యవంతమైన స్థలాన్ని వెతుక్కోవడమే కాకుండా, మెదడును చురుకుగా ఉంచుకునేందుకు ఇతర మార్గాలనూ అన్వేషిస్తున్నట్లు డాక్టర్‌ గార్‌ఫీల్డ్‌ చెప్పారు.
            'నిజం చెప్పాలంటే, కొద్దిసేపు కునుకు తీయడం కంటే అరగంట వ్యాయామానికి నేను వెచ్చిస్తా. కానీ, ఇక నేను కునుకేయడా నికే ప్రయత్నిస్తా. మా అమ్మకీ ఈ పని చేయమని చెబుతా' అని గార్‌ఫీల్డ్‌ తెలిపారు.
        కొంచెం సేపు కునుకేయడంపై అధ్యయనం చేయడం సవాలుతో కూడుకున్నది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుండొచ్చు. లేదంటే రివర్స్‌ కూడా జరుగుతుండొచ్చు. మీకు అలసటగా ఉన్నప్పుడు, కాస్త ఎక్కువసేపే నిద్ర పోవాల్సి ఉంటుంది.
స్వల్ప నిద్ర అనేది ప్రయోజనకరమని నిరూపించేందుకు పరిశోధకులు స్పష్టమైన టెక్నిక్‌ను వాడారు.
మనం పుట్టినప్పుడు ఉండే జన్యు సంకేతం డీఎన్‌ఏను వాడుతూ ఈ ప్రయో గాన్ని చేపట్టారు. 40 - 69 ఏళ్ల మధ్యలో ఉన్న 35 వేల మంది డేటాను ఈ బృందం సేకరించింది. యూకే బయోబ్యాంక్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని ( తరువాయి 16 లో )
చేపట్టింది. పగలు స్వల్పంగా నిద్ర పోయేవారు, కునుకేయని వారి జన్యువులు పోల్చి చూసింది బృందం.
ఈ ఫలితాలను స్లీప్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురించారు. నిద్రపోయే వారి మెదడు 15 క్యూబిక్‌ సెంటీమీటర్లు పెద్దదిగా ఉంటుందని, అంతేకాక, వీరిలో వయసు పెరగడాన్ని 2.6 నుంచి ఆరున్నరేళ్ల వరకు ఆలస్యం చేస్తుందని తెలిపింది. ఈ అధ్యయనంలో మొత్తం బ్రెయిన్‌ వాల్యూమ్స్‌ 1,480 క్యూబిక్‌ సెంటీమీటర్లు.
         'వీకెండ్లలో కొద్దిసేపు పగలు నిద్ర పోవడాన్ని నేను ఆస్వాదిస్తుంటాను. ఇది సోమరితనంగా భావించక్కరలేదని ఈ అధ్యయనం నాకు చెబుతోంది. ఇది నా మెదడును కాపాడుతుందేమోనని నాకు అనిపించేలా చేసింది' అని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరా, బ్రిటీష్‌ న్యూరోసైన్స్‌ అసోసియేషన్‌కి చెందిన ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ తారా స్పైర్స్‌ జోన్స్‌ చెప్పారు. మెదడు చిన్నదే కానీ, బ్రెయిన్‌ వాల్యూమ్‌లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని ఈ ఆసక్తికరమైన అధ్యయనంలో వెల్లడైందని ఆమె చెప్పారు.
        మెదడు ఆరోగ్యకరంగా ఉండేందుకు నిద్ర అనేది ఎంతో అవసరమని ఈ డేటా చెబుతుంది. అయితే, పగలు ఎక్కువ సేపు నిద్ర పోవడంపై పరిశోధకులు నేరుగా పరిశోధన చేపట్టలేదు. కానీ, ఈ నిద్రను అర్ధగంటకు తగ్గించుకోవాలని సైన్స్‌ సూచిస్తోందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలెలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది. ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడాన్ని నిద్రలేమి అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు.
           అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో ట్రినిటీ కాలేజ్‌ ప్రొఫెసర్‌ షేన్‌ ఓమారా అంటారు.
           గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఎక్కువ మంది నిద్రలేమి సమస్యపై డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఊబకాయం సమస్య నానాటికి పెరుగుతుండటంతో నిద్రలేమి సమస్య తీవ్రమౌతుందని ప్రముఖ బ్రిటన్‌ కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ గై లెస్జినర్‌ తెలిపారు. నిద్రలేమికి 'కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరఫీ' అంటే.. ఆలోచన, ప్రవర్తనా విధానాన్ని మార్చే చికిత్సే పరిష్కారమని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కాదు. జీవనశైలిలో ఆలోచనా విధానం మార్పుతోనే సాధ్యమని వారంటున్నారు.