Jun 11,2023 06:52

              'అజ్ఞానపుటంధయుగంలో/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాధులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్‌/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఈ ఆధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. వైజ్ఞానిక రంగం అందించిన సమస్త సాధనాల్నీ వాడుకుంటున్నాం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని నూతన ఆవిష్కరణల ఫలాలనూ అనుభవిస్తున్నాం. వాటిని మన జీవన శైలిలో అంతర్భాగం చేసుకుంటున్నాం. కానీ ఆలోచనల్లో మాత్రం శతాబ్దాల వెనుకనే వుండిపోతున్నాం. ప్రపంచంలో మారనిదంటూ ఏదీ లేదు. మార్పు సహజం. 'శరత్‌కాలపు ఆకాశం నీలం, జ్యేష్టమాసపు వానల తర్వాత గాలిలో నిర్మలత్వం ఏదో అర్థం కాని నూతనత్వం' అంటాడు చలం. ఈ మార్పు కంటికి కనిపించకున్నా మనసుని స్పృశిస్తుంది... మైమరిపింపజేస్తుంది... గొప్ప అనుభూతిని పంచుతుంది. ఒకవైపు విజ్ఞాన ఫలితాలను అనుభవిస్తూనే... మరోవైపు భౌతికవాద దృష్టి లోపించడం, కార్యాకారణ సంబంధమనే సూత్రాన్ని, మార్పును ఒప్పుకోలేని మతోన్మాద పోకడ ఒక పథకం ప్రకారం దేశంలో అమలు జరుగుతోంది.
           'శవత్వం పాశవత్వం పెరిగి/ నవత్వం తరిగి/ దానవత్వం సర్వత్రా/ దంష్ట్రలు కొరుకుతున్న నేడు' అంటాడు శ్రీశ్రీ ఖడ్గసృష్టిలో. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ 'సంవర్ధిని న్యాస్‌'... ఢిల్లీలోని జెఎన్‌యులో 'గర్భ సంస్కార్‌' పేరిట ఒక వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో కొందరు గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు కూడా పాల్గొన్నారు. దేశభక్తి, స్త్రీల పట్ల గౌరవం పెంపొందాలంటే మహిళలు గర్భధారణ సమయంలో భగవద్గీత, రామాయణ శ్లోకాలు పఠించాలని, దీనివల్ల తల్లి గర్భంలోని శిశువుకు భారతీయ సాంస్కృతిక విలువలు అలవడతాయని ఉద్బోధించారు. అలాగే ఇటీవల అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కొందరు ఉద్యోగులు చనిపోయారని మృత్యుంజయ యాగం చేసేందుకు వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌ సమాయత్తమయ్యారు. గతంలో ఆచార్య దోణప్ప వైస్‌ ఛాన్సలర్‌గా వున్న కాలంలో జ్యోతిష్యాన్ని డిగ్రీ, డిప్లమో కోర్సులుగా ప్రవేశపెట్టడంపై పెద్ద వివాదమే జరిగింది. ఆ తర్వాత సి.నారాయణరెడ్డి హయాంలో జ్యోతిష్యం నిరూపితమైన శాస్త్రం కాదని తొలగించారు. తాజాగా... అత్యాచారానికి గురైన ఓ మహిళ జాతకంలో కుజదోషం వుందో లేదో తేల్చాలని ఇటీవల లక్నో విశ్వవిద్యాలయంలోని జ్యోతిష్య విభాగం అధిపతిని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఆదేశంపై అత్యున్నత ధర్మాసనం స్టే ఇచ్చినప్పటికీ... ఒక రేపిస్టు బెయిల్‌ దరఖాస్తును విచారించే సమయంలో జ్యోతిష్యుడి నివేదికను హైకోర్టు కోరడమే విడ్డూరంగా వుంది. ఒక రేపిస్టును తప్పించడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డుపెట్టుకోవడం న్యాయసమ్మతం కాదు.
          ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా దీర్ఘకాలంగా రాజుకుంటున్న వివాదంలో నమ్మకాల ఆధారంగానే తీర్పునిచ్చింది. శాస్త్రం మానవ జాతికొక అస్త్రం. కానీ, జ్యోతిష్యం నమ్మకం తప్ప శాస్త్రం కాదు. దాని ఆధారంగా కోర్టు ఈ రకమైన తీర్పునివ్వడం ధర్మం కాదు. ఈ వ్యవహారం ఆసాంతం నేరస్తుడ్ని తప్పించడానికి జరుగుతున్న కుట్ర తప్ప మరొకటి కాదు. న్యాయవ్యవస్థ, సమాజం ఒక రేపిస్టుని క్షమించదు. కానీ, అతడ్ని తప్పించడం కోసం... సమాజంలోని నమ్మకాల మాటున శాస్త్రం గాని శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఒక మహిళ గోప్యతా రక్షణతో పాటు ఆమె వ్యక్తిత్వంపై కూడా దోషాన్ని అంటగట్టే ప్రయత్నం న్యాయస్థానంలోనే జరగడం దారుణం. మతోన్మాద భావాలను సమాజంలో విచ్చలవిడిగా చెలామణీ చేసేందుకు సాక్షాత్తూ ప్రభుత్వమే పూనుకుంటోంది. 'మానవుడి జ్ఞానం తన అభివృద్ధి క్రమంలో సరళరేఖలా పయనించదు. అది నిరంతరం ఒక వక్రరేఖను అనుసరిస్తుంటుంది' అంటాడు లెనిన్‌ ఓ సందర్భంలో. అంతేకాదు... 'మనం చైతన్యవంతంగా వుండకపోతే, ఊబిలో కూరుకుపోయే ప్రమాదం వుంద'ని హెచ్చరిస్తాడు. మూఢత్వపు చీకట్ల నుంచి విజ్ఞానకాంతుల వైపు పయనించే పథగాములకు ఈ హెచ్చరిక మార్గదర్శకం.