Jul 30,2023 08:12

అక్కడ ఓ అమాయక కన్యత్వం
మదమెక్కిన పశుత్వం ముందర
పత్తా లేకుండా పోయింది..

అక్కడ మానవత్వం
తెగల మధ్య పుట్టిన
కొత్త తెగులును
చూసి దిగాలుపడింది..

అక్కడ సౌశీల్యం
నైతిక వైకల్యం ముందు,
మానసిక దౌర్బల్యం ముంగిట
వెక్కివెక్కి ఏడ్చి మోకరిల్లింది..

తెగల మధ్య పుట్టిన తెగులు
మానవత్వ పంటనాశిస్తోంది
అక్కడ పుట్టిన చీడ సర్వత్రా
ప్రశాంతతను చెడగొడ్తుంది..

భారతావని కీర్తి కిరీటంలో
మణిదీపమైన మణిపూర్‌
నేడు శోకతప్త హృదయంతో తల్లడిల్లుతోంది
తెగల మధ్య అంతర్యుద్ధంతో
తెగ బాధపడుతోంది..

ఈ చంద్రయాన్‌ జమానాలో
మనిషి అలవోకగా
ఈ గ్రహం నుండి
ఇతర గ్రహాలకు నిర్భయంగా
చేరుకుంటున్నాడు..

కానీ ఎందుకో..?
తెగల తెగుళ్లు పడ్డ పక్క గల్లీని
కులం గీసిన కూడలిని,
జాతి గీసిన జాడల్ని
మత పారవశ్యంలో మైమర్చిన
ఆ పక్క వీధిని దాటడానికి
జంకుతున్నాడు..

- సర్ఫరాజ్‌ అన్వర్‌
94409 81198