సప్త వ్యసనాల్లో ఒకదాని పేరు పేకాట
ప్రపంచ వాణిజ్యసంస్థ పేకమేడలానే కూలింది
ఇస్పేటు రాజు, కళావరు రాజు, ఆఠీన్ రాజు, డైమండ్ రాజు
ఎవర్ని దేంతో పోల్చాలో తెలీడంలేదు కానీ
కళాత్మకమైన కలుపుగలుపు ముక్కల మధ్య
వలస కూలీలు నలిగిపోయారు
నిందితుడు ఎడారిదేశాల గడ్డం ఫకీరు కావచ్చు
మరో సామ్రాజ్యవాద వ్యతిరేకి కావచ్చు
వెట్టిలో ఉన్నవాడు తరతరాల తనఖా చిట్టాల్ని
చించి పారేస్తే వచ్చే ఆగ్రహం
ఇప్పుడు అంకుల్ సామ్‌కి వచ్చింది
'అప్పిచ్చువాడే వైద్యుడు ఎప్పుడు ఎడతెగక
ఏరు పారవలెన్' కనక మనకీ కోపం వచ్చింది
భావోద్వేగాలు, భూమ్యాకాశాలు
సొంత ఖాతాలోంచి జారిపోయి చాలా ఏళ్ళయింది
పరాధీనతే కాదు
ప్రస్తుతం ప్రాణభయంతో కూడా తలెత్తలేకుండా వున్నాం
ఏ గల్లీలో శతఘ్ని పేలుతుందో, ఆపరేషన్ ఎన్‌డ్యూరింగ్ ఫ్రీడం
ఎన్ని శ్మశానాల్ని నేలకు దిగవిడుస్తుందో అని ఒకటే భయం
ఎంతయినా అగ్రదేశం మీడియాకి 'డీసెన్సీ' తెలుసట!
చవకబారు సంచలనాల కోసం
కెమేరాలు శవాల చుట్టూ తిరగవు
శవాలు సౌధాల కంటే గొప్పవా ఏమిటి?
బిల్ క్లింటన్ శృంగభంగ పరువునష్టం దావాల తర్వాత
ఇదే కదా పిడుగుపాటు
మేడలు కూలడం కంటే విధ్వంసం ఇంకెక్కడుంది?
మృతశరీరాలదేముంది?
ఎన్ని దేశాల తల్లులు తిరిగి పురిటి నొప్పులకు
సిద్ధం కావడంలేదు
కూడూ గూడూ తోడూ జాడా వున్నా లేకపోయినా
సౌధాల కెగిరి తమ బిడ్డలు అరచేతి స్వర్గాలు
అందుకోవాలనే కదా కలలు కంటున్నారు
మన్‌హాట్టన్, పెంటగాన్ గోడలకు చిత్రపటాల్లా వేలాడే
కన్నీటి మంటల పద్దు తెలిసినా తెలీకపోయినా
వ్యూహాలు ఆగవు, వైఫల్యాలు తగ్గవు
దట్టించిన స్ఫూర్తితో రాళ్ళ నిర్మాణం మొదలవుతుంది
రాజు తల్చుకుంటే రాళ్ళదెబ్బలకు కొదవా?
గెలుపంటే ఏమిటో, ఈ ఓటమి ఫలాలకెవరు మూల్యం చెల్లిస్తారో
చెప్పేవాళ్ళు లేకపోయినా మూడో ప్రపంచ దేశాల వెన్నుపూస
అప్పుల మోతతో ఇంకాస్త వొంగుతుంది క్షమించండి!
నేనింకా దేశభక్తి అందని అట్టడుగు గ్రామాన్ని
అన్నం ముద్దకీ, అక్షరం ముక్కకీ మొహం వాచినదాన్ని
మీ జాతీయ, అంతర్జాతీయ విభేదాలెటువంటివైనా
విజయభేరీ ఎవరిదైనా
గోరీలుగా మారుతున్న ఇళ్ళమధ్య పిల్లల్ని కావిటేసుకుని
పారిపోతూ శాపాలు పెడుతున్నదాన్ని
- కొండేపూడి నిర్మల