
అమెరికా అగ్రరాజ్యంగా వున్నందున, అది చేసిన తప్పుల ప్రభావాలు కూడా చాలా బలంగా వుంటాయి. ప్రాంతీయ ప్రధాన శక్తుల చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను గౌరవించాలన్నది ప్రధానంగా నేర్చుకోవాల్సిన విలువైన మొదటి పాఠం. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సంయమనం పాటించాలన్నది రెండో పాఠం. ఇక చివరిది, తన మాతృభూమిని పరిరక్షించుకోవాలన్న చైనా కృతనిశ్చయాన్ని అమెరికా ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.
కొరియా యుద్ధ విమరణ సంధిపై సంతకాలు జరిగి గురువారానికి 70 ఏళ్ళు పూర్తయింది. ఈ సంస్మరణ దినానికి ముందుగా, అమెరికా అణు బాలిస్టిక్ క్షిపణి దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటించింది. 1981 తర్వాత అమెరికా జలాంతర్గామి జరిపిన మొదటి పర్యటన ఇది. ఈ చర్య ఉత్తర కొరియాకు హెచ్చరిక మాత్రమే కాదని, చైనాను నిలువరించడానికి కూడానని కొంతమంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు బహిరంగంగానే చెప్పారు.
అయితే ఇదంతా చూస్తుంటే కొరియా యుద్ధం నుండి నేర్చుకున్న గుణపాఠాలను అమెరికా సీరియస్‌గా తీసుకోనట్లు కనిపిస్తోంది. ఆనాడు చేసిన తప్పులనే పునరావృతం చేయాలని చూస్తున్నట్లుంది. ఫలితంగా, ఈ యుద్ధ విరమణ సంధి డెబ్బయ్యవ వార్షికోత్సవ తరుణంలో, యుద్ధం వల్ల నేర్చుకున్న గుణపాఠాలను సమీక్షించాల్సిన అత్యవసర ప్రాధాన్యత వుంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన ప్రాంతీయ ఘర్షణల్లో కొరియా యుద్ధం ఒకటి. అమెరికా సైనిక చరిత్రలో అతి పెద్ద ఓటమిగా దీన్ని పరిగణిస్తారు. అయితే పీడకలగా నిలిచిన ఆ పరాజయాన్ని అమెరికా మరిచిపోయినట్లు కనిపించడం విచారకరం. ఉద్దేశపూర్వకంగానే అమెరికా దీన్ని విస్మరిస్తోంది. గతం నుండి గుణపాఠాలు నేర్చుకోవడంపై అమెరికన్లు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో కొత్త సంక్షోభాలు తలెత్తినపుడు వాటిని ఎదుర్కొనడంలో ఇబ్బందులు పడతారు. పైగా చేసిన పాత తప్పులనే మళ్లీ చేసే అవకాశం వుంటుంది. అంతకన్నా అధ్వాన్నమైన అంశమేమంటే, కొంతమంది అమెరికన్ రాజకీయ నేతలు ఈ కొరియా యుద్ధం నుండి పూర్తిగా తప్పుడు పాఠాలు నేర్చుకున్నారు. వాటిని ఉపయోగించే నేటి అమెరికా విదేశాంగ విధానానికి తప్పుడు మార్గనిర్దేశనం చేస్తున్నారు. దీంతో కొత్త సంక్షోభాలను, చివరకు యుద్ధాలను కూడా అమెరికా రెచ్చగొట్టడానికి దారితీస్తోంది.
అమెరికాకు కొరియా యుద్ధం నేర్పిన మూడు పాఠాలను పేర్కొంటూ అమెరికా విదేశీ వ్యవహారాల మేగజైన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ''నిరోధకతను, సంసిద్ధతను వాషింగ్టన్ ఎన్నడూ అలక్ష్యం చేయరాదు. సదా పోరాటానికి, సైనిక పాటవాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా వుండాలి'' అన్నది మొదటి పాఠం. ''రాజకీయాలు, పోరాటాలు అనేవి లోతుగా పెనవేసుకున్నాయ''న్నది రెండో పాఠం. ''ఒకసారి పోరాటం చెలరేగిన తర్వాత, మితిమీరిన స్వీయ నిగ్రహం మరింతగా దూకుడును ఆహ్వానించగలదు.'' అన్నది మూడో పాఠం.
ఈ మూడు పాఠాలు చైనాను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా తైవాన్ సమస్యను ప్రస్తావిస్తున్నాయి. అమెరికా అగ్రరాజ్యంగా వున్నందున, అది చేసిన తప్పుల ప్రభావాలు కూడా చాలా బలంగా వుంటాయి. వాటి వల్ల తనకు మాత్రమే ప్రమాదం గాకుండా ఆ ప్రాంతానికి, మొత్తంగా ప్రపంచానికి కూడా పెను భారంగా పరిణమిస్తాయి. ప్రాంతీయ ప్రధాన శక్తుల చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను గౌరవించాలన్నది ప్రధానంగా నేర్చుకోవాల్సిన విలువైన మొదటి పాఠం. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సంయమనం పాటించాలన్నది రెండో పాఠం. ఇక చివరిది, తన మాతృభూమిని పరిరక్షించుకోవాలన్న చైనా కృతనిశ్చయాన్ని అమెరికా ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్