Oct 16,2022 08:54

కొన్ని గాయాలకు
మందు రాసే మార్మిక వైద్యాలు
పుట్టగొడుగుల్లా మొలుస్తాయి
చెదిరిపోని గాయం మచ్చల్ని
ఆర్థిక లెక్కల్తో మసి పూసి
తాత్కాలికంగా మరిపిస్తాయి

కొన్ని గాయాలంతే
రగిలే నిప్పుల్లా ఎగస్తూ
చరిత్రలో స్థిరంగా నిలబడతాయి
గూటికి చేరిన పేద పక్షి
రెక్కల చప్పుడే తెలుస్తాది గానీ
లోలోపలి ఆకలి పేగుల శబ్దం
ఏ పాలిత చెవులు గ్రహించకున్నాయి

ఆర్థిక నొప్పులన్నీ
సగటు గాయాలే భరించాలి
కోటానుకోట్లు
ఆర్భాటాల రంగుల్ని అద్దుకుని
వీధుల్లో గోడలకు అంటుకుంటాయి

వేల రూపాయల ఎక్కాలన్నీ
సభా ప్రాంగణం ముందు
వాగ్దానపు ముగ్గులై విచ్చుకుంటాయి
కానీ కొన్ని గాయాలు మాత్రం
ఆఖరి దాకా మాసిపోవు

గజ మాలల గాంభీర్యపు
సన్మానాల ఊరేగింపులు లెగస్తుంటే
బతుకు గాయాల మాటున
కొన్ని జీవితాలు నలిగిపోతున్నాయి

డబ్బు లేదని ఎవరన్నారు
కొట్టే డప్పులకు
మోసే పల్లకీలకు
వేలాడే ప్లెక్సీలకు
ఎగిరే తారా జువ్వలకు
కరెన్సీ పిట్టలు కట్టలు కట్టలుగా
రెక్కలిప్పి తుర్రున లేస్తున్నాయి

కొన్ని గాయాలు మాత్రం
విస్తరించుకుని పోతున్నా
కుళ్ళిపోయి పురుగులు పడుతున్నా
ఖరీదైన కళ్ళకు కనిపించకున్నాయి
ఆ గాయాలంతే మరి

నరెద్దుల రాజారెడ్డి
96660 16636