
అసలు ఇదంతా పది రోజుల క్రితం జరిగిన ఓ విషాదంతో మొదలయింది. బంధువులు అందరిలో భయంకరమైన గుబులు పెట్టించింది. షుగర్ బోర్డర్‌లోనే ఉంది. ఒకే టాబ్లెట్ ఇచ్చాడు డాక్టర్. అయితే ఇంచుమించుగా ఏడాదిపైనే అయింది చెకప్ చేయించుకుని.
యోగా క్లాసుకి రోజూ సాయంత్రం వెళుతున్నా ఈ వాకింగ్ చేయడానికి మటుకు ఆ సంఘటన నాంది. అదే నడివయసులో ఉన్న మా వదిన తమ్ముడు అకాల మరణం. బాగా కుదిపేసింది.
అందరూ అది ఒక స్వయంకృతాపరాధం అని అన్నారు. అందుకు కారణం మితిమీరిన షుగర్ ఉందని తెలిసినా అశ్రద్ధ చేయడం. కవాటాలు మూసుకుపోయిన గుండెకి ఆపరేషన్ చేసినా, ఫలితం లేకపోగా పెరిగిన షుగర్ వల్ల రెండు కాళ్లు తీసేసే పరిస్థితి వచ్చింది. అయినా దాని మూల్యం తన ప్రాణాన్ని చెల్లించాల్సి వచ్చింది.
ఆ భయంతో ఇంట్లో ఒకటే గొడవ. అంతేకాదు నాకు లోలోపల భయమేసింది. ఈమధ్య నడివయసులోనే ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. అందుకు కారణం మారిన లైఫ్‌స్టైల్, ఆఫీస్ ప్రెషర్ లాంటివి.
మూడు రోజుల క్రితం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవడానికి వెళ్లాను. డాక్టర్ దగ్గర నుంచి అన్నీ నార్మల్ ఉన్నాయి అనే అభయం తీసుకున్నాను.
పనిలో పని బరువు చూసుకుంటే అక్కడున్న చార్ట్ ప్రకారం ఇంకా తగ్గచ్చు అన్నట్లు చూపించింది.
ఇక ప్రతిదీ డాక్టర్ చెప్పక్కరలేదుగా అనుకుని, మార్నింగ్ వాక్ మొదలు పెట్టాను.
రోజూలాగే వచ్చాను. దగ్గరే కాబట్టి ఉదయమే ఐదున్నర కల్లా ఉంటాను. అప్పటికే ఒక ఆయన వచ్చి పద్ధతిగా యోగా మాట్ వేసుకుని యోగాభ్యాసం చేస్తుంటారు.
ఆయన ట్రాన్సిస్టర్ పెడుతుంటారు. అందులోంచి రఫీ, తలత్, ముఖేష్, ఆర్జిత్ మధురంగా పలకరిస్తుంటారు వాళ్ల పాటలతో..
'హా దివానా హు.. మై, గమ్ కా మారా హువా' ముఖేష్ గొంతులో విషాదపు జీర.. తెలియని ఆనందం.. విషాద ఆనందం.. నవ్వొచ్చింది నాకు.
రెండు రౌండ్లు పూర్తయ్యాయి.. అలుపుతో బెంచి మీద కూర్చున్నాను.
అలా చెట్ల కింద, ప్రత్యూష పవనాలతో పరవశిస్తూ తలలూపే చెట్టు కొమ్మల్ని, గలగలలాడే ఆకులను, గుసగుసగా ఊసులు చెప్పే పూలను చూడటం నాకెంతో ఆనందం.
అక్కడ రకరకాల మనుషులు కనిపిస్తుంటారు. కొంతమంది రోజూ వచ్చేవాళ్లు కనిపించారు. కానీ వాళ్లిద్దరూ ఇంకా రాలేదు. నిజానికి వాళ్ల రూపు రేఖలు తెలియవు.
ఎందుకంటే ఎప్పుడూ వాళ్లు తల నుంచి పాదం వరకూ నల్లటి ముసుగులోనే ఉంటారు. మనకు తెలియకుండానే రోజూ వచ్చేవాళ్లు కనిపించకపోతే 'అయ్యో ఇవాళ రాలేదు!' అనుకుంటాము. వాళ్లతో మనకి పెద్దగా పరిచయం ఉండదు. మాట్లాడుకోవటం అసలే ఉండదు.
అప్పుడప్పుడు అదీ ఎదురుపడినప్పుడు కొందరు నవ్వుతారు. అయినా ఏదో మనిషికీ మనిషికీ మధ్య ఉండే బంధం తాలూకు ఫీలింగ్ అవ్వచ్చు. అది కొద్ది క్షణాలే ఉండొచ్చు.
'ఫిర్ వహీ షామ్, వహీ గమ్, వహీ తన్హాయి' అబ్బ తలత్ గొంతులో ఆ పాథోస్ హృదయాన్ని పిండేస్తుంది.
మరో రెండు రౌండ్స్ పూర్తయ్యాయి.
దూరంగా నా పార్క్ ఫ్రెండ్స్ వాకింగ్ స్టిక్స్‌తో..
'బాగున్నారా? అంటూ మొదలెట్టిన కబుర్లు అనంతం. ఆ విషయంలో వాళ్లిద్దరూ ప్రసిద్ధులు. నిజానికి వాళ్ల పేర్లు నాకు తెలియదు. నేను వచ్చాకనే వీళ్లిద్దరూ వస్తారు. వాళ్లు ఏ విషయం మాట్లాడటంలో అయినా ముందుంటారు.
ఒకళ్లేమో వాట్సప్ మెసేజ్‌లో వచ్చే ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా చెబుతుంటారు.
మరొకళ్లు పూర్తిగా తెలుగు టీవీ న్యూస్ చానల్స్ ఫాలో అవుతూ ఆ 24 గంటల వార్తా స్రవంతిని కుదించి, అందిస్తారు.
పైగా నాతో అన్నారోసారి 'ఏముందండీ మీరు చూసే ఆ ట్రావెల్, ఫుడ్ ఛానెళ్లు, పైగా వాళ్లేమో వంటలు వండి అనాథలకు పెట్టడం. అబ్బే.. అది కాదండీ.. ఇప్పటి కరెంట్ అఫైర్స్ కావాలి. దేశం ఏమైపోతోందో? రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలండీ.. అదీ ఒక బాధ్యత గల పౌరుడిగా!' ఇలా సాగిపోతాయి.
ఇవాళ ఎందుకో రౌండ్స్ తిరగకుండా కూర్చున్నారు. ఇప్పటికీ ప్రస్తుతం దేవుడు కరుణించాడు.. కాదు కాదు. కిషోర్ కరుణించాడు.. 'యే జీవన్ హై జీవన్ కా యాహీ హై, యాహీ హై, యాహీ హై రంగ్ రూప్ యే జీవన్ హై జీవన్ కా' పాట వింటూ నడుస్తున్నాను. పాట.. హాయిగా ఉంది. మనసు ప్రశాంతంగా ఎప్పటిలాగే.. దూరంగా ఆ బెంచ్ మీద వాళ్లిద్దరూ.. ఎందుకో.. ఏదో విషయం ఉంది వాళ్లలో అనిపించింది.
ఒక్కోసారి లాజిక్‌కి అందని ఆలోచనలు, భావాలు కలుగుతాయి.
నా ముందు అబ్బాయి నడుస్తూ.. మాట్లాడుతున్నాడు. ఆ మాటలు గాలి తరంగాల మీదుగా నా చెవిలోకి వస్తున్నాయి. 'హలో బంగారు.. లేచావా.. లేదా బద్ధకంగా ఉన్నావా? నో లేచి వెళ్లి, పార్క్ దగ్గర వాక్ చెయ్యి. ఫోన్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇదయితే హాయి కదా! ఇంట్లో ఎవరన్నా వింటారని బాధ లేదు. ఊ..చెప్పు'.. అనుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నాడు.
షార్ట్స్, స్పోర్ట్స్ షూస్, ఇయర్ ఫోన్స్.. చెప్పొద్దూ... భలే జోరుగా ఉన్నాడు. అతని చూపులు సడన్‌గా ఆ బెంచ్ మీద కూర్చున్న ఇద్దరి మీద పడటం గమనించాను.
'అబ్బ! డాక్టర్ దగ్గరకు వెళితే చాలు బరువు తగ్గండి. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. వాకింగ్, ఎక్సర్‌సైజులు చేయమంటాడు. ఇప్పుడు ఆ యోగాలు, జిమ్‌లకు వెళ్లే ఓపిక నాకు లేదు. అందుకే ఇది మొదలుపెట్టాను'.
'అవునండీ, నాది కూడా ఇంచుమించు ఇదే సమస్య.. ఈ మధ్య బాగా బరువు పెరిగినట్లనిపిస్తోంది. అందుకే ఇక తప్పదని వస్తున్నాను.'
'అదీ నిజమే, లేకపోతే నాలా బాధపడాలి మీరూను!' మాట్లాడుకుంటూ వెళుతున్న వాళ్లు ఆగి మరీ.. 'అటు చూడండి అనుకుంటూ' .. ఆ బెంచ్ మీద కూర్చొని ఉన్న వాళ్లిద్దరినీ అదో రకంగా చూస్తూ వెళుతున్నారు.
మధ్యలో ఫౌంటెన్, దాని చుట్టూ పచ్చటి గడ్డి ఆకుపచ్చని తివాచీలా, ఆ పక్కన నడిచే వాళ్లకోసం చక్కని బాట, అక్కడక్కడా సిమెంటు బెంచీలు, ఆ బెంచీల వెనుకగా, బాటపైకి వంగి చూస్తూ, గన్నేరు, గుల్మొహర్, దేవకాంచనం చెట్ల వరుసలు.. పార్కుకు వచ్చేవాళ్లకి ఈ చెట్ల కాండాల మధ్య నుంచీ కనిపిస్తున్న ట్రాఫిక్, చెట్ల చిటారు కొమ్మల మీద నుంచి తొంగి చూసే సూర్యుడు.
చాలా మంది సిమెంటు బెంచీల మీద కూర్చున్నారు. కింద పచ్చ తివాచీలా ఉన్న గడ్డిలో మరికొంత మంది కూర్చున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ల నాన్న బస్కీలు తీస్తుంటే, వాళ్లు ఉత్తుత్తిగా చేస్తున్నారు.
మరోపక్క స్కిప్పింగ్ చేస్తూ ఆయాసపడుతున్న ఒక మధ్య వయసు మహిళ.. అంత అలుపులోనూ వాళ్లిద్దరి మీద ఓ కన్ను వేసింది. నడుస్తూ అందరినీ గమనిస్తున్నాను. పార్కులోని ప్రతి వాళ్లు ఆ ఇద్దరినీ ఒకలాంటి అభద్రతా భావంతో చూస్తున్నట్లుగా అనిపిస్తోంది.
అందుకు కారణం వాళ్లు మొహానికి కప్పుకున్న ముసుగా? మరేదైనా ఉందా? లేక నా ఆలోచన తప్పా? తెలియదు.
కొంతసేపటికి మళ్లీ నడకకి బ్రేక్ ఇచ్చి, ఆ ఇద్దరూ కూర్చున్న బెంచ్‌కి ఎదురుగా కూర్చున్నాను.
వాళ్లు ఫోన్లలో ఉన్నారు. అస్పృష్టంగా కళ్లు, ముక్కు, నోరు కనిపిస్తున్నాయి.
మధ్య మధ్యలో మాట్లాడుతూ వాళ్ల బ్యాక్ ప్యాక్‌ల్లోకి చూసుకుంటున్నారు.
కొంచెం సేపటికి పార్క్ స్నేహితులిద్దరూ నా పక్కకు చేరుకున్నారు. వీళ్లు సాధారణంగా చర్చించే విషయాలు 'ఈ కాలం పిల్లలు పాడయిపోతున్నారు' అనే మాటతో మొదలవుతుంది.
'అదిగో చూడండి ఆ కుర్రాడు ఎప్పుడు చూడు చెవిలో ఆ ఇయర్ ఫోన్స్‌తోనే ఉంటాడు. అప్పుడప్పుడు బయటకు కూడా చూస్తాడు. ఇప్పుడు కూడా అంతే!'
అయినా పూర్తిగా ఒకళ్ల గురుంచి తెలియకుండా ఇలా జడ్జిమెంట్ ఎలా ఇస్తారో చిరాకనిపించింది.
అంతలో వాళ్ల దృష్టి ఆ ఇద్దరి మీద పడింది. వాళ్లలో ఒకాయన ఒకింత అనుమానంగా చూస్తూ, 'ఇద్దరూ ఉదయాన్నే వస్తారు, కానీ వాకింగ్ చెయ్యరు. అసలు వాళ్ల మొహలే కనిపించవు. మీరు ఎన్నయినా చెప్పండి. సంథింగ్ బిజ్జర్ (ఏదో విచిత్రం) అనిపిస్తోంది.'
'అవును నాకూ అలానే అనిపిస్తోంది వాళ్ల అన్ యూజువల్ బిహేవియర్.'
'తొందరపడి మాట తూలకండి! మొహానికి ముసుగు వేసే పరిస్థితులు ఏంటో? ఎన్ని బాధలు, కష్టాలున్నాయో ఎవరికి తెలుసు? అయినా మన చూపు, మన ఆలోచన, వక్రంగా ఉంటున్నాయి. ' కొంచెం కోపంగా అనేసి వెళ్లిపోయాను.
నా మాటలకి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు. అయినా భరించలేకపోయాను ఆ అన్యాయపు మాటలని.
వైరల్ ఫీవర్ రావడంతో ఓ పది రోజులు నా వాకింగ్‌కి బ్రేక్ పడింది. ఇవాళ మళ్లీ ఈ పచ్చటి చెట్ల మధ్య చల్లని గాలి పీలుస్తూ హాయిగా, ఏకాంతంగా నడుస్తున్న నాకు ఇప్పుడు ఈ క్షణంలో నాకు పంజరపు చిలుకకి స్వేచ్ఛ వచ్చినంత హాయిగా ఉంది.
అంతలోనే అకస్మాత్తుగా ఆ ఇద్దరూ గుర్తొచ్చారు. చుట్టూ చూశాను ఎక్కడా కనిపించలేదు.. 'పాపం ఏమయ్యారో వాళ్లు?' అని ఆలోచిస్తూ నడుస్తున్న నాకు 'ఏమండోయి బావున్నారా? ఫీవర్ తగ్గిందా?' అని అడుగుతూనే జేబులో ఉన్న మాస్కు పెట్టుకుంటూ 'ముందస్తు జాగ్రత్త, నాకు తెలుసు మీది వట్టి జ్వరమే కానీ.. అయినా ఏదో భయం..' సంజాయషీగా అన్నారు మొదటాయన.
'ఇప్పుడు అంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది. పర్వాలేదు లెండి ప్రతిచోటా ఈ భయం, అనుమానం బాగా ఎక్కువయ్యాయి.'
'అవునూ, అప్పుడు రోజూ ఇద్దరమ్మాయిలు వచ్చేవారు వాళ్లు రావటం లేదా?'
'ఓV్‌ా వాళ్లా? అబ్బో! ఆ ఆడపిల్లలిద్దరూ ఏదో కథలు చెప్పారులే, ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా అన్నింటినీ ఇంటికి డెలివరీ చేసేస్తామని, మీలాంటి పెద్దవాళ్లు అసలు కాలు బయట పెట్టకుండా అన్నీ గుమ్మంలోకే తెచ్చి ఇస్తామని అంటూ బోలెడు కబుర్లు చెప్పారు.
మన సిటీలో ఉండే ఒక డెలివరీ యాప్‌లో పనిచేస్తున్నాము అన్నారు. 'చదువుకుంటూ మా ఖర్చులు మేము సంపాదించుకోవచ్చని, కాకపోతే మా ఇళ్లలో ఆడపిల్లలమని అసలు పంపించటం లేదు. అందుకే కాలేజీ కోసం తొందరగా బయలుదేరి, ఇలా పార్క్‌లో కూర్చుని ఆర్డర్స్ తీసుకుని ఈ చుట్టుపక్కల సర్వీస్ చేస్తాం!' అని చెప్పారు.
అయితే మీ ముసుగులు తీసి మొహాలు చూపించమని అడిగాము, మేము చూపించం అన్నారు. దాంతో మా అనుమానం బలపడింది ఆడపిల్లలయినా వీళ్లని నమ్మకూడదు. ఎందుకొచ్చింది, అందుకే మన కాలనీ సొసైటీ వాళ్లకి కంప్లైంట్ చేశాము. అంతేకాదు ముందు జాగ్రత్తగా వాళ్లని పార్కులోకి ఎట్టి పరిస్థితులలో రానివ్వద్దని చెప్పేశాము' ఓ పెద్ద ఘనకార్యం చేసినట్లు చెప్పారు.
అంతలో రెండో ఆయన అందుకుంటూ 'అదికాదండీ, ఆ పెద్ద పెద్ద బ్యాగ్‌లు వేసుకుని రావడం, వాటిల్లో ఏమున్నాయో తెలియదు, ఇద్దరూ ఆడపిల్లలు అని తెలుసు. కానీ వాళ్ల ఆనుపాను తెలియదాయే? ముఖాలు అయితే అసలే కనిపించవు. పైగా వాళ్లు నిజం చెబుతున్నారని నమ్మకం ఏముంది? ఏమో ? మన అనుమానాలు మనవి.
నిజం చెప్పొద్దూ.. నాకదే అనుమానం సుమండీ! పోనీలెండి పీడా పోయింది. హాయిగా మనం భయం లేకుండా వాకింగ్ చేసుకుందాం' నేనేమంటానో అన్నట్లు నా వైపు ఓరగా చూశారు.
కొంతమంది అంతే ..
'ఛీ ..ఛీ..' చిన్న జలదరింపు కుదిపేసింది.
అప్పుడే మా ముందు నుంచి వెళుతున్న ఒక చిన్న పాప 'థూ.. థూ..' అని ఉమ్మేసింది.
లిప్త పాటు వాళ్లిద్దరి మొహాలు పాలిపోయాయి. 'పాపా! తప్పు పార్కులో అలా చేయకూడదు!' వాళ్లమ్మ మందలించింది.
'నిజానికి మా మాటలకి ఆ పాప చీత్కారానికీ సంబంధం లేదు. కానీ అది సూటిగా మా ముఖాల మీద వేసినట్లే అనిపించింది నాకయితే!'
రోజూలాగే పార్కులో.. అంతా మాములే !
మణి వడ్లమాని
9652067891