
సదాశివంతో పదినిముషాలు గడిపితే చాలు ఎవరికైనా అతనిపై జాలి, సానుభూతి వంటివి కలుగుతాయి. అతను కోపాన్ని ప్రదర్శించటంగానీ, గట్టిగా విసుక్కోవటంగానీ చూసినవాళ్లెవరూ లేరు. అతను తక్కువ మాట్లాడతాడు. అన్నింటికీ పొడిపొడిగా సమాధానాలు చెబుతాడు.
సదాశివాన్ని చిన్నతనంలో వాళ్ల బామ్మ 'వీడు నోరులేని పీనుగ' అనేది. తన భర్త పేరుతో ఉన్న మనవడంటే ఆమెకి వల్లమాలిన ప్రేమ. తెగ గారం చేసేది. అతని మీద ఈగ కూడా వాలనిచ్చేది కాదు. అన్నింటికీ మనవడ్ని వెనకేసుకొచ్చేది. అమ్మానాన్నలైనా సరే వాడిని ఒక్క మాట అనటానికి లేదు. టీచర్లు తప్పు పట్టడానికి లేదు. అతనితో ఆడుకోవటానికి వచ్చినవాళ్లు ఏ రకమైన చిన్న ఫిర్యాదు చేసినా ఆమె కొట్టిపారేసేది. 'మీరంతా కలిసి నా మనవడ్ని మోసం చేస్తున్నార్రా' అని గట్టిగా గదమాయించేది. అన్ని వ్యవహారాలూ నాయనమ్మే చక్కపెట్టేస్తూండటంతో సదాశివానికి తను సొంతంగా మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు. దానికి తగ్గట్టే అతని వ్యవహారసరళి మారిపోయింది.
వాడు నా పినతల్లి కొడుకు. ఈ మధ్య వాడి అమ్మ కాలం చేసిందని తెలిసి పరామర్శించటానికి వచ్చాను. రెండు చేతుల్ని దగ్గరకు తీసుకుని, వాడిని పలకరించాను.
'ఊరుకో శివా, పిన్ని పూర్ణాయుష్షుతో జీవించింది. మంచం మీద తీసుకోకుండా పోయినందుకు మనం సంతోషించాలి' అన్నాను ఊరడిస్తున్నట్టు. ఇంకేదో చెప్పాలనుకున్నాను. అతను నా మాటలు వినిపించుకున్నట్టు లేదు. నా చేతులు విదిలించుకుని, గేటు ముందు ఆగిన కారు దగ్గరకు పరుగుతీశాడు.
ఓ కుటుంబం.. నలుగురు వ్యక్తులు అందులో నుంచి దిగారు. వాళ్లు ధరించిన ఖరీదైన దుస్తులు, మేకప్ అవీ చూస్తే బాగా డబ్బున్న వాళ్లని అనిపించింది. కుటుంబసభ్యులు చనిపోయినవారి ఇంటికి అలా రావటం నాకు ఎబ్బెట్టుగా అనిపించింది.
గబగబా లోపల నుంచి కుర్చీలు తెచ్చి పోర్టికోలో వేశాడు సదాశివం. అతని భార్య కూడా పరుగున వచ్చింది. ఆఘమేఘాల మీద టీలు కూడా వచ్చాయి. వాళ్లతో పాటు నాకు కూడా ఓ కప్పు అందించింది వంటమ్మాయి.
అప్పుడుగానీ నేను అక్కడిక వచ్చి చాలా సేపయిన విషయం, నన్ను ఎవరూ పట్టించుకోలేదన్న విషయం గుర్తుకురాలేదు.
అవతలవాళ్లు ఏదో చెబుతుంటే, సదాశివం బుద్ధిమంతుడయిన విద్యార్థిలా వింటున్నాడు. అతని భార్య కూడా 'డూ డూ బసవన్న'లా తలూపుతోంది.
ఖాళీ కప్పులు తీద్దామని దగ్గరకు వెళ్లాను. వాళ్ల మాటలు స్పష్టంగా నా చెవిలో పడ్డాయి.
'గేటెడ్ కమ్యూనిటీ కోటిన్నర. అదీ ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తే. ఒకప్పుడు అక్కడ రూ. 70 లక్షలు పలికేది. మూడు నెలల్లో ఒక్కసారే పెరిగిపోయింది. సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్లు ఎవరో ప్రయత్నిస్తున్నారట. ఆ తర్వాత రేటు మనకు అందుబాటులో ఉండదు.'
'అలాగలాగే. డబ్బు సర్దుతాను' ఎప్పటిలానే పొడిపొడిగా మాట్లాడాడు సదాశివం.
కాసేపటికి వాళ్లు వెళ్లిపోయారు.
రాత్రంతా ప్రయాణం చేసి రావటం వల్ల ఒళ్లంతా పులిసిపోయింది.. స్నానం చేస్తేగానీ బడలిక తీరదనిపించి, లోపలకు వెళ్లాను.
నేను తిరిగొచ్చేసరికి గదిలో నుంచి గట్టిగా మాటలు వినబడుతున్నాయి. ఆ సమయంలో వెళ్లటం మర్యాద కాదని తెలిసినా నా బ్యాగు అక్కడే ఉండటంతో వెళ్లక తప్పింది కాదు.
'నాలుగేళ్ల నుంచి బాధ్యతలన్నీ నేనే చూస్తున్నా. అమ్మ తాలూకు డబ్బు, పొలం అయివేజు మొత్తం నాకే' అన్నాడు సదాశివ. పక్కనే అతని భార్య నిలబడి ఉంది. ఆమె దర్శకత్వ పర్యవేక్షణలోనే ఇదంతా సాగుతోందని నాకు అర్థమైంది.
'అది ఎలా కుదురుతుంది?' అన్నాడు అతని కంటే పైవాడు.
'నువ్వు అమ్మని చూసింది నీ డబ్బులు ఖర్చు పెట్టి కాదుగా. ఆమెగా నీకు డబ్బులు సర్దింది. ఇల్లు అమ్మినప్పుడు అందరూ సమంగా పంచుకున్నాం. అలాగే ఇప్పుడు మిగిలినవి కూడా..' ఆయన పెద్దరికంతో ఏదో చెప్పటానికి సిద్ధపడ్డాడు.
'ఆ విషయం తెలిసినవాడివి, ఒక్కరోజు కూడా నువ్వు ఆవిడని తీసికెళ్లి ఉంచుకోలేదుగా?' ఎదురుప్రశ్న వేశాడు సదాశివం.
వాడు ఇంత సూటిగా మాట్లాడతాడని నేను ఎరగను.
మిగిలినవాళ్లు కూడా నిశ్చేష్టులై చూస్తున్నారు.
'అది కాదన్నయ్యా?' తమ్ముడు ఏదో చెప్పబోయాడు.
'మాట్లాడకు.. నువ్వు నోర్మురు ..' సదాశివం గట్టిగా హుంకరించాడు.
'చిన్నప్పట్నుంచి ఇంట్లో పడి, దోచుకుతింటున్నావు.'
బిక్కచచ్చిపోయి ఊరుకున్నాడతను.
'నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి. పిల్లలు సెటిలయ్యారు. నేనింకా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేయాలి' ఇంకో తమ్ముడు చెప్పుకోబోయాడు.
అదేమంత పెద్ద విషయం కానట్టుగా సదాశివం ప్రవర్తించాడు.
'ఆ సంగతి నువ్వే చూసుకోవాలి' అన్నాడు కరాఖండీగా.
చివర్లో.. 'మన అప్పచెల్లెళ్లకు మళ్లీ వాటాలంటారేమో? వాళ్లకు బోలెడు కట్నాలిచ్చి పెళ్లి చేశాం, మీరెవరూ నోరెత్తకండి. మీ పని మీరు చేసుకోండి!' అని హుకుం జారీ చేశాడు.
ఆ తర్వాత నెమ్మదిగా అయినా గంభీరంగానే చెప్పాడు.
'అసలు నాకు హైదరాబాద్ రావలసిన అవసరమేమీ లేదు. అమెరికాలో పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నా. ఏదో ముసలావిడ ఇక్కడ ఉందని ఏడాదిలో కొన్ని నెలలు వచ్చిపోతున్నా. రేపో మాపో గ్రీన్‌కార్డు వస్తుంది. మళ్ళీ ఈ దరిద్రమొహాలేవీ చూడవలసిన పనిలేదు.'
ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి సదాశివం అన్నాడో అక్కడున్న వారికి ఎవరికీ అర్థంకాలేదు. మాటల మధ్యలో పోలీసులు, లాయర్లు అంటూ బెదిరింపులు కూడా చేశాడు.
అందరి నోళ్లూ మూతపడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.
మూడంతస్తుల ఇల్లు, లోపల వాతావరణం, ఇంటి ముందున్న ఖరీదైన కారు.. ఇవన్నీ చూస్తుంటే.. వాడు డబ్బుతో తులతూగుతున్నాడని నాకు అర్థమవుతోంది. మరెందుకు అతనిలో ఇంత ఆశ. ఇతరులను గడ్డిపోచలా తీసిపారేయటం నాకెందుకో మింగుడు పడటం లేదు.
వాడి గతం అంతా నాకు తెలుసు. ఓ పది, పన్నెండేళ్లు ఉద్యోగం చేశాడేమో.. ఆ తర్వాత ఉద్యోగం మానేశాడు.
తను పనిచేస్తున్న ప్రయివేటు బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పినప్పుడు అందరూ మద్దతు పలికారు.
'ఉద్యోగం పోయేటంత లేదా మానేసేటంత తప్పు అతనేం చేసి ఉంటాడు?' అన్న ఆలోచన కుటుంబంలో ఎవరికీ కలగలేదు. ప్రశ్నలతో ఎవరూ వేధించలేదు. అన్నదమ్ములంతా ఒక్కటై అతనికి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత కూడా వాడు ఉద్యోగాలు చేసింది లేదు. పెద్దగా సంపాదించింది లేదు.
'పాపం నోట్లో నాలిక లేనివాడు, మెతక మనిషి. ఎవరు అన్యాయం చేశారో' అని అంతా సానుభూతి చూపించేవారు. సాయం చేయటానికి ఎగబడ్డారు. అన్నదమ్ముల్లో ఒకరు నెల సరుకులు తీసుకొచ్చి ఇంటిలో పడేస్తే, మరొకరు పిల్లల ఫీజులు కట్టేవారు. పండగలకు, పబ్బాలకు వచ్చి ఇంటిల్లిపాదికీ బట్టలు కొనిచ్చి వెళ్లేవాళ్లు. సినిమాలకని, పార్కులకని పిల్లల్ని బయటకు తీసికెళ్లటం, అడిగినవి కొనివ్వటం వంటివి చేసేవాళ్లు. ఒకాయనయితే కొత్తగా ఇల్లు కట్టి, అద్దె లేకుండా ఉండే అవకాశం ఇచ్చాడు. నేనూ ఎన్నిసార్లు ''చేబదులు'' పేరుతో డబ్బులు వాడికి ఇచ్చానో.. తీసుకున్న సందర్భాలు చూసుకుంటే బాగా తక్కువే. వాడి ముగ్గురు పిల్లలు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో స్థిరపడ్డారు. అప్పటివరకూ అన్నదమ్ములు తలో చెయ్యి అందించారు. వాళ్లే దన్ను ఇవ్వకపోతే ఎప్పుడో అతను రాలిపోయేవాడు.
ఇప్పుడు విలాసవంతమైన జీవితం తన అనుభవంలోకి రాగానే, తను మిగతావాళ్ల కంటే చాలా అధికుడినని అనుకుంటున్నాడు. ఇతరులంటే లెక్కలేనట్టు వ్యవహరిస్తున్నాడు. 'వారసత్వ ఆస్తి అందరికీ సమానంగా చెందాలి' అన్న నైతికతను .. తనకు అన్నివిధాలా అండగా నిలిచిన అన్నదమ్ముల కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉండాలన్న కనీస మర్యాదను ఎక్కడా ప్రదర్శించటం లేదు. 'ఏరు దాటి , తెడ్డు తగలేసిన వాడి' చందంలా ఉంది వ్యవహారమంతా.
అసలు ఇదే అతని అసలు స్వభావమా? కష్టాలు ఎదుర్కోవలసి రావటం వల్ల మంచితనం, నెమ్మదితనం ముసుగు వేసుకుని ప్రపంచం ముందు నిలబడ్డాడా? అన్న అనుమానం నాకు ఆ నిముషంలో కలిగింది. ఆ తర్వాత అక్కడ ఉండాలనిపించ లేదు.
భోజనం కూడా చెయ్యకుండా స్నేహితులను కలవాలని చెప్పి, బయటకొచ్చేశాను.
కొన్ని నెలల తర్వాత ఓ రోజున ..
'ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చేర్చాం. త్వరగా రండి!' అని సదాశివం భార్య నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
'అయ్యో' అనిపించింది. అలాగని వెళ్లటానికి మనస్కరించలేదు. సానుభూతిగా నాలుగు మాటలు చెప్పాలని కూడా అనిపించలేదు.
కాసేపటికి ఫోన్ వచ్చింది. సదాశివం భార్య.
'ఈయన ఐసీయూలో ఉన్నారు. 24 గంటలయితేగానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. నాకు కాళ్లూచేతులు ఆడటం లేదు. ఈయన అన్నదమ్ములకి మెసేజ్ పెట్టినా ఒక్కరూ రాలేదు. పిల్లలు రావాలంటే ఎంత లేదన్నా రెండు రోజులు పడుతుంది' వెక్కిళ్లు పెడుతూ చెబుతోంది. నాకు జాలేసింది.
'కష్టం చెప్పుకోటానికి ఒక్క మనిషి కూడా కనిపించటం లేదు. కనీసం మీరయినా..' ఇంకా ఏదో చెప్పబోతోంది.
'నేను బయలుదేరుతున్నా. మీరు ధైర్యంగా ఉండండి' అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
సదాశివం రూపం కళ్ల ముందు మెదిలింది.
ఈ పరిణామం వాడిలో మార్పు తెస్తుందా?
సాటి మనిషి విలువను గ్రహిస్తాడా?
డబ్బే సర్వస్వం కాదనే సత్యం అవగతమవుతుందా? ఆలోచిస్తూ వడివడిగా ఆస్పత్రి మెట్లెక్కాను.
నన్ను చూడగానే సదాశివం భార్య మొహంలో రిలీఫ్ కనిపించింది.
ఒంటరిగా సతమతమవుతున్న ఆమెకు అన్నివిధాలా అండగా నిలబడ్డాను. ఆస్పత్రికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవటంతో పాటు రాత్రి సమయంలో అక్కడే ఉండటం వరకూ..
తను సాయంత్రం దాకా ఉండి, ఇంటికి వెళ్లిపోయింది. మధ్యాహ్నం మళ్లీ వచ్చి రెండు పూటలకు క్యారేజీ తెచ్చేది.
ప్రాణాపాయం లేదని తెలిసిన పిల్లలు అమెరికా నుంచి బయలుదేరలేదు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల డబ్బుల కోసం వెతుక్కోవలసిన అవసరం కూడా లేకపోయింది.
మరికొన్ని రోజులు గడిచాయి. సదాశివం తేరుకున్నాడు.
ఆ రోజు ఐసీయూ నుంచి గదిలోకి మార్చారు.
'వాడేమిటి ఇక్కడీ'
భార్యను అడుగుతున్నాడు సదాశివం.
లోపలకు వెళుతున్న వాడిని కాస్తా ఠక్కున ఆగిపోయాను.
'నేనే పిలిచాను. ఈ పదిరోజులు ఆయన ఒక్కరే నా తోడుగా ఉన్నారు. ఆయన గనక లేకపోతే..' ఆమె చెప్పటం పూర్తికాలేదు.
'పంపించెరు. ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది కదా?'
'అది కాదు. ఆయన చేసిన సాయానికి..'
ఇంకేదో ఆమె చెప్పబోయినా మధ్యలోనే అడ్డుకున్నాడు.
'ఊరికే సాయం చేస్తున్నాడనుకుంటున్నావా? దీన్ని అడ్డం పెట్టుకుని, రేపేదో అడుగుతాడు. మన పిల్లలు అమెరికాలో ఉన్నారు కదా.. తన కూతురు వెళ్లటానికి మార్గం చూడమనచ్చు. లేకపోతే డబ్బు రూపంలోనైనా..'
నాకు అసహ్యం వేసింది.
కొందరంతే.
ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా జీవిత పరమార్థాన్ని గ్రహించలేరు.
రెప్పపాటులో అక్కడ నుంచి మాయమయ్యాను.
డాక్టర్ సి.పార్థసారథి
99088 92065