
సంప్రదాయమో...వ్యసనమో కానీ...కోస్తా జిల్లాల్లో కోడిపందేలనూ సంక్రాంతి పండుగనూ వీడదీసి చూడలేం. గ్రామీణ జీవనానికి కోడిపుంజుకు అనుబంధం వుంది. 'తెల్లారింది లెగండో కొక్కొరోక్కో/ మంచాలింక దిగండో కొక్కొరోక్కో' అంటాడో సినీకవి. కొక్కొరోక్కో అనే కోడికూత మనిషిలోని మత్తును వదలగొట్టి... మేల్కొలుపుతుంది. పల్లెను నిదుర లేపుతుంది. సంక్రాంతి రోజుల్లో కోడి కూసిందంటే... పౌరుషంతో బరిలోకి దిగడానికి సిద్ధమని మీసాలు మెలేస్తాడు ఆసామి. పల్లె సంస్కృతితో పెనవేసుకుపోయిన ఈ సంప్రదాయానికి వందల ఏళ్ల చరిత్రే ఉందంటారు. 15వ శతాబ్దపు సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే పద్య కావ్యం 'హంసవింశతి'లో అప్పట్లో కోడిపందేలు ఎలా జరిగేవో సోదాహరణంగా వివరిస్తాడు అయ్యలరాజు నారాయణ కవి. 'కోడిపుంజును యుద్ధానికి సన్నద్ధం చేస్తూ... దాని కాళ్లకు పాతలు చుట్టారు. కత్తులు కట్టారు. రెండు వైపులవారు తమ పుంజులను పొదివి పట్టుకుని, ఎదురెదురుగా నిల్చున్నారు. అంతే! ఆ పుంజులు చేతిలో వుండగానే జూలు విదిలించాయి. కయ్యానికి ముక్కులు దువ్వాయి!...' అంటూ వర్ణిస్తాడు అయ్యలరాజు కవి. కోడి కాలు దువ్వినా, కూత కూసినా కోడి పందెం అనగానే చప్పున గుర్తొచ్చేది పల్నాటి యుద్ధం. బ్రహ్మ నాయుడి చిట్టిమల్లు... నాగమ్మ సివంగిల పోరు, యుద్ధానికి దారితీసిన తీరు... కథలు కథలు తెలుగునాట సుప్రసిద్ధమే. ఈ కోడి పందేలు సంక్రాంతితో ఎలా ముడిపడ్డాయో స్పష్టంగా చెప్పలేము కాని, సంప్రదాయం పేరుతో... వినోదం మాటున క్రమంగా జూద క్రీడగా మాత్రం మారింది.
'కాయ్ రాజా కాయ్ / కాస్తే వుంది చూస్తే లేదు / ఒకటికి మూడు రెట్లు/ స్వర్గానికివే మెట్లు/ క్షణంలో సగంలో కుబేరుడివి/ కనురెప్పపాటులో కుచేలుడివి' అంటాడు తిలక్. కోడిపందేలు...వినోదం, సంస్కృతి అని చెబుతున్నప్పటికీ సంక్రాంతి ముందునుంచే లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటిపై నిషేధం వుండటంతో...ఆన్‌లైన్ కోడిపందేలు ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది. రూ.500 నుంచి లక్షల్లో బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఒకప్పుడు పండుగ సమయంలోనే కోడిపందేలు నిర్వహించేవారు. ఆన్‌లైన్‌లో ఏడాది పొడవునా పందేలు నడుపుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఆన్‌లైన్ గ్రూపుల ద్వారా పందేలు వేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి యాప్‌లు వర్చువల్ బరిగా మారుతున్నాయి. వందలు, వేలు దాటి, లక్షల్లో బెట్టింగ్‌లు కడుతున్నారు. పందేనికి ముందుగానే బెట్టింగ్ డబ్బు కూడా పేమెంట్ యాప్‌ల ద్వారా కట్టించుకుంటున్నారు. వాట్సప్ నుంచి వీడియో కాల్స్ ద్వారా ఈ పందేలు చూస్తున్నారు. ఈ బెట్టింగ్‌లు కట్టేవారిలో ఎక్కువగా విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, రాజకీయ నాయకులతో పాటు కొంతమంది మహిళలు, సినీ సెలబ్రిటీలు సైతం వుంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు...ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రముఖంగా వున్న బిట్ కాయిన్స్, రమ్మీ, రెబల్‌కాక్ ఫైట్స్ వంటి పేర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవే గ్రూపుల్లో కోడిపుంజుల ఫొటోలు, పోరాట దృశ్యాల వీడియోలు పెట్టడం ద్వారా కోడి పేరు, రంగును బట్టి పెద్దఎత్తున బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా... సాంకేతికతను వాడుకుంటూ కథ నడిపిస్తున్నారు.
ఆడేవాళ్లకు డబ్బులు పోతున్నా.. జీవితాలు రోడ్డున పడుతున్నా... వినోదం పేరుతో ఒక్కరి సరదా కోసం కుటుంబమంతటినీ విచారంలోకి నెట్టేస్తుంటారు. బహిరంగంగా నిర్వహించే కోడిపందేలు, పేకాటలపై నిషేధం వుండటంతో... ఆన్‌లైన్ జూదం ఇప్పుడు మూడు పువ్వులు, 36 కాయలుగా మారుతోంది. నిర్వాహకులు రెండింతలు, మూడింతలు డబ్బు వస్తుందంటూ ఆశ చూపి.. వేలు, లక్షలు కాజేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టినా...వారు తెలుసుకునేలోపు ఫోన్లు, సిమ్‌కార్డులు మారిపోతున్నాయంటున్నారు. 'చినిగిన స్వప్నపు సంచీలో/ చితికిన బాష్పం నిలవదు/ అందుకే నేస్తం జీవితమే ఒక జూదం/ ఖేదానికి మోదానికి లేదసలే భేదం' అంటాడు తిలక్ 'కారు రాజా కారు' కవితలో. వినోదపు చలువ జోళ్లద్దాల నుంచి అంతా ఆనందంగానే కనిపిస్తుంది. ఆ జోడు తీసి చూస్తేనే వాస్తవం అవగతమౌతుంది.