Aug 14,2022 13:31

నా దేశం జెండాకి
కులం మతం అంటుకుని
నీరసంగా
రెపరెపలాడుతోంది.
అచ్చంగా
బేరాలు కుదుర్చుకుని
విలువల కుదుళ్లను తృంచి
భాగాలు తేలక
ఐదేళ్లకోసారి
గర్భస్రావం జరుపుతోంది.
పురిటి వాసన ప్లేస్‌లో
నా దేశమంతా
ఓ రంగుకే భజన జరుగుతోంది.
ష్‌... ష్‌...,
అదంతా దేశభక్తి ముసుగే.
వీళ్లకీ వాళ్లకీ
ఉన్న ఊరూ, రాష్ట్రం అక్కర్లేదు.
పదవులకు గదములు ముడేసి
అవినీతి పారిస్తున్నారు.
నిన్నటి రంగు వెలిసినా
నేటి రంగులో
కేసుల నెత్తురు కలిసి
తళతళలాడినా..
రేపటి నవజాత వర్ణం గురించే
దుఃఖాల మూటలతో
ఎగిరే త్రివర్ణ పతాకం బరువెక్కుతోంది.
ఇది గురివిందల రాజ్యం
డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతం.

కొత్తపల్లి మణీత్రినాథరాజు
79978 26662