Apr 16,2023 08:18

తేనెలూరే తీయని తొనలతో నోరూరించే పనస పండ్లు. ఆర్టో కార్పస్‌ హెటిరో పిల్లస్‌ దీని శాస్త్రీయ నామం. మోరేసి కుటుంబానికి చెందిన ఈ చెట్టు జన్మస్థలం తూర్పు ఆసియా. మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు ఇది. వీటిలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి కూర పనస. దీని కాయలు చిన్నవిగాను ఆకులు కత్తిరించినట్లుగా ఉంటాయి. రెండవది పండు పనస. అంటే తినేది. కాయలు పెద్ద పరిమాణంలోనూ, ఆకులు కాస్త చిన్నగాద మందంగా ఏకరీతిగా ఉంటాయి. ఇటీవల కాలంలో వీటిలో అనేక రకాలు వచ్చాయి. కుండీల్లో కాపునిచ్చే రకాలెన్నో అందుబాట్లోకి వస్తున్నాయి. వేసవి సీజన్లో పండ్లు కాస్తాయి. ఈ వారం వాటి గురించి తెలుసుకుందాం.

  • బోనసాయ్..
1

రెండడుగుల ఎత్తులో చిన్నపాటి కుండీలో నిమ్మపండు లాంటి పనస పళ్ళు కాస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది కదా! అలాంటిది నేరుగా చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అదే థాయిలాండ్‌ బోనసారు పనస. థాయి లాండ్‌ దేశానికి చెందిన ఈ మొక్క ధర అక్షరాలా లక్ష.

  • బ్లాక్‌గోల్డ్‌ ..
2

కాయలు పసుపు రంగులో ఉండి, ముగ్గిన తర్వాత నల్లని మచ్చల కింద మారిపోతాయి. పండులోని తొనలు చాలా తియ్యగా ఉంటాయి. ఇది భారతదేశ దేశవాళి రకం. నాటిన ఐదవ ఏట నుంచి కాపు మొదలవుతుంది. 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పండిన వెంటనే కాయలు ఉపయోగించుకోవాలి. నిల్వ ఉండవు.

  • ఎర్ర పనస..
2

ఇప్పుడిప్పుడే మార్కెట్లో అడుగుపెడుతున్న పనస మొక్క ఎర్ర పనస. ఇదీ థాయిలాండ్‌ రకం. కాయలు ఎర్రగాను, చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. లోపల గుజ్జు గోల్డ్‌స్పాట్‌ రంగులో ఉండి, చాలా తియ్యగా ఉంటుంది. మొక్క నాటిన మూడేళ్లకే కాపు కాస్తుంది. ఐదారు అడుగుల ఎత్తులోనే మంచిగా కాయలు కాస్తాయి. కాకపోతే కాపు కొంచెం తక్కువే.

  • చీనా..
2

చిన్న చిన్న పనసకాయలు వంకరిటింకరగా కాస్తూ ఉంటాయి. అందులో తొనలు కూడా చిన్నగా ఉంటాయి. రుచి మాత్రం అమోఘం. మొక్క నాటిన మూడేళ్ల నుంచే కాపు కాస్తుంది. నల్లరేగడి, ఎర్ర రేగడి, ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. ఇళ్లల్లో పెంచుకునే రకాల్లో ఇదొకటి.

  • కొచ్చిన్‌..
10

ఇది కుండీలో కూడా పెంచుకునే వెసులుబాటు ఉండే పనస మొక్క. కాయలు గుండ్రంగా, కోలగా ఉండి, చిన్నగా కాస్తుంటాయి. రెండు రకాలుగా ఉపయోగపడటం దీని ప్రత్యేకత. లేతగా ఉన్నప్పుడు కూర చేసుకోవచ్చు. ముగ్గిన తర్వాత పండులా ఆరగించవచ్చు. నాటిన ఏడాదికే కాపు కాస్తుంది. వర్షం తగలకుండా ఉంటే ఆరు నెలల వరకూ కాపు వస్తుంది. ఇది ఆధునిక రకం పనస మొక్క.

  • డ్యాంగ్‌ రస్మి ..
2

కాయలు లావుగా, పొడవుగా కుంచాకారంలో ఉంటాయి. ఒక్కొక్క దానిలో 100 పైనే తొనలు ఉంటాయి. వాణిజ్యపరంగా లాభసాటైన పంట. మొక్కలు నాటిన నాలుగైదు సంవత్సరాల్లో కాపు మొదలవుతుంది. చెట్టు ఎంత పెద్దది పెరిగితే అన్ని ఎక్కువ కాయలు కాస్తుంది.

  • గోల్డెన్‌ నెగ్గేట్‌..
2

కాయలు బంగారుఛాయలో నిగనిగలాడుతూ కనిపిస్తాయి. తొనల రుచి మధురంగా ఉంటుంది. నాటిన రెండున్నర ఏళ్లకే కాపు మొదలవుతుంది. మొక్క ఐదారడుగులు పెరుగుతుంది.

  • సదా..
2

కూర పనసలో ఒక రకం సదా పనస. కాయలు కాస్త చిన్నవిగా ఉంటాయి. ఈ కాయల ఉపరితలం మీద ఉండే పొట్టును, లోపల గుజ్జు భాగాన్ని కూడా కూర చేసుకుంటారు. మొక్క మూడో ఏట నుండి కాపు కాస్తుంది. చాలా ఎత్తు పెరుగుతుంది.

  • బాహుబలి..
3

ఒక్కొక్కటి వంద కిలోల వరకూ బరువున్న కాయలు కాసే అరుదైన పనస చెట్టు ఇది. ఎక్కువగా శ్రీలంక దేశంలో ఉంటాయి. చెట్టు కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. చెట్టు నాటిన పదేళ్ల తర్వాత కాపు కాస్తుంది.

- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506