Jun 18,2023 07:54

బడులు మళ్లీ ప్రారంభమయ్యాయి.. తెల్లవారు జామునే చిన్నారులకు లంచ్‌ రెడీ చేయాలి. లంచ్‌.. టిఫిన్‌.. బాక్స్‌లంటే ఊరుకోరండోరు. స్నాక్స్‌.. స్నాక్స్‌ బాక్స్‌ అంటేగానీ వారికి వినసొంపుగా ఉండదు. పిల్లలకు పెట్టేవి ఆరోగ్యాన్ని, ఆనందాన్నిస్తూ.. ఆస్వాదించేవిగా ఉండాలని ప్రతి తల్లీ తపన పడుతుంది. లేకపోతే పెట్టినవి పెట్టినట్టు భద్రంగా ఇంటికి వచ్చేస్తాయి మరి. అంతేనా..! లంచ్‌బాక్స్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు ఎంతో అవసరం. అవేమిటంటే.. బాక్స్‌, దానిలోని ఆహారం ఆకర్షణీయంగా ఉండాలి. బాక్సును ఈజీగా వారే ఓపెన్‌ చేసేటట్లు ఉండాలి. పుస్తకాలు, బట్టలు కరాబు కాకూడదు. వారు ఇష్టంగా తినేవి, వయసుకు తగిన పోషకాలు అందేటటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. మరి అలా ఇవ్వాలంటే ఈజీగా, టేస్టీగా తయారయ్యే పదార్థాలను మనం ప్లాన్‌ చేసుకోవాలి. మరి అలాంటి వాటిలో కొన్నింటిని తెలుసుకుందామా..!

లడ్డు..

laddu

కావలసినవి : వేరుశనగ గుళ్ళు - 1/4 కేజీ, నువ్వులు - 1/4 కేజీ, పండు ఖర్జూరాలు - 1/2 కేజీ, నెయ్యి - 2 స్పూన్లు
తయారీ : ముందుగా వేరుశనగ గుళ్ళు, నువ్వులు దోరగా వేయించి పక్కనుంచాలి. ఖర్జూరాలు గింజలు తీసి మెత్తగా మిక్సీ పట్టాలి. వేరుశనగ గుళ్ళు పొట్టుతీసినవి, నువ్వులు కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. బాండీలో నెయ్యి వేడిచేసి ఖర్జూర ముద్దని మూడు నిమిషాలు వేయించాలి. తర్వాత మిక్సీ పట్టిన నువ్వుల మిశ్రమాన్ని దీనిలో వేసి బాగా కలపాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇవి నెల రోజుల వరకూ నిల్వ ఉంటాయి. రోజుకు ఒక లడ్డు స్నాక్‌గా పెడితే పిల్లలకు కావలసిన పోషకాలు అందుతాయి.

బ్రెడ్‌ ఆమ్లెట్‌..

egg


కావలసినవి : బ్రెడ్‌ స్లైసెస్‌ - 6, గుడ్లు - 7, కొత్తిమీర సన్నని తరుగు - 2 స్పూన్లు, పసుపు - 1/2స్పూను, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - 1/2 టీ స్పూను, కారం - స్పూను, వెన్న - తగినంత
తయారీ : పెద్ద గిన్నెలో గుడ్ల సొన, సన్నగా కట్‌ చేసుకున్న కొత్తిమీర, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి, బాగా కలపాలి. పాన్‌ మీద స్పూను వెన్నను కరిగించాలి. వెంటనే బ్రెడ్‌ స్లైస్‌నొక దానిని ఈ మిశ్రమంలో ముంచి, వేయాలి. దీన్ని రెండోవైపు తిప్పి, అవసరమైతే మరికొద్దిగా వెన్న వేసుకోవాలి. ఇవి బంగారు వర్ణంలో వేగాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ బ్రెడ్‌ స్లైస్‌ను పిల్లలు ఇష్టపడేలా డైమండ్‌, రౌండు, స్క్వేర్‌, ఆకు ఆకారాలలో కట్‌చేసి, వేయించాలి. వీటిని బాక్స్‌లో పెట్టి, మరో చిన్న బాక్స్‌లో టమాటా సాస్‌ వేసి ఇవ్వాలి.
వీటినే ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేయకుండా చక్కెర వేసి చేస్తే, కేక్‌ బ్రెడ్‌ తయారవుతుంది. అవీ ఇలాగే షేప్స్‌ ముందే కట్‌ చేసుకుని వేయించుకోవాలి.

పావ్‌బాజీ..

3

కావలసినవి : పావ్‌లు (బన్నులు) - 3, బంగాళా దుంపలు - 3, కాప్సికమ్‌, టమాటా, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 2, పచ్చి బఠానీ - 1/4 కప్పు, కొత్తిమీర - కొంచెం, పావ్‌బాజీ మసాలా - స్పూను, ఉప్పు, కారం - తగినంత, పసుపు - 1/4 స్పూను, ధనియాల పొడి- 1/2 స్పూను, గరం మసాలా -1/2 స్పూను
తయారీ : ముందుగా బంగాళా దుంపలను ఉడికించి మెత్తగా మెదుపుకోవాలి. బాండీలో రెండు స్పూన్ల వెన్నను కరిగించాలి. సన్నగా తరిగిన బఠానీ, కాప్సికమ్‌ ముక్కలను మూడు నిమిషాలు వేయించి, టమాటా ముక్కలు వేయాలి. వీటిని బాగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. తర్వాత వాటిని మెత్తగా మెదుపుకుని ముందుగా రెడీగా ఉంచుకున్న బంగాళాదుంప స్మాష్‌, కారం, ఉప్పు, పావ్‌బాజీ మసాలా, పసుపు, కొత్తిమీర వేసి, బాగా కలుపుకోవాలి.
మరో పాన్‌లో రెండు స్పూన్ల వెన్న వేడి చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను మూడు నిమిషాలు వేయించి ఉప్పు, కారం, ధనియాల ొడి, గరం మసాలా వేసి బాగా కలిపి పైన తయారుచేసుకున్న బాజీ ముద్దకు, అరకప్పు నీటిని చేర్చాలి. దీన్ని బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర తరుగు చల్లుకుని పక్కనుంచుకోవాలి.
పెనంపై రెండు స్పూన్ల వెన్న వేడి చేసి పావ్‌లను మధ్యకు చీల్చినట్లు కట్‌ చేసి వేయించాలి. దీనిమధ్యలో ముందుగా తయారుచేసిన మిశ్రమాన్ని ఉంచాలి. వీటిని బాక్స్‌లో పెడుతూ, ఉల్లిపాయ ముక్కలపై నిమ్మరసం పిండి వేరే చిన్న బాక్స్‌లో పెడితే పిల్లలు ఈ కాంబినేషన్‌ను ఎంజారు చేస్తూ తింటారు.