
పేదలకు పని కల్పించి గౌరవంగా జీవించడానికి ఉపకరించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పీకనులిమేందుకు మోడీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. ఈ దశలో ఆ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయడం ద్వారా కేరళలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం 'ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ నిధి బోర్డు'ను కూడా ఏర్పాటు చేసి ఉపాధి హామీ పట్ల తన తిరుగులేని నిబద్ధతతను చాటుకుంది.
వామపక్షాల ఒత్తిడితో ఊపిరిపోసుకున్న జాతీయ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఒక వరంగా నిలిచింది. పనులు బాగా కల్పించిన చోట వలసలు తగ్గాయి. చెరువు పూడికతీతల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ చట్టం ప్రారంభంలో 90 శాతం కార్మికుల ద్వారా, 10 శాతం మెటీరియల్ ద్వారా చేయాలని నిర్ణయించింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక పథకం ప్రకారం దీనిపై దాడి చేస్తోంది. నిధుల కేటాయింపులు, పనిదినాల్లో కోత పెట్టి ఈ చట్టాన్నే నిర్వీర్యం చేయాలని చూస్తోంది. కార్మికుల పనులకు కేటాయించే నిధులను భారీగా తగ్గించి, మెటీరియల్ వర్క్‌ను 40 శాతానికి పెంచడంతో పనిదినాలు భారీగా తగ్గిపోయాయి. 2021-22లో రూ.98,467 కోట్లు వ్యయం చేస్తే, 2022-23లో రూ.73 వేల కోట్లకు కుదించింది. 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లే కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపుల్లో 33 శాతం కోత పెట్టారు. పథకంలో మోసాలను అరికట్టే పేరుతో హైటెక్ చర్యలను కార్మికులపై బలవంతంగా రుద్దుతోంది.
ఉపాధి కల్పన నుంచి చెల్లింపుల వరకూ కొత్త పద్ధతులు అమలు చేస్తోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) నిర్వహిస్తున్న ఉపాధి హామీ పోర్టల్ పరిధిలోకి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకొచ్చింది. రాష్ట్రాలు నేరుగా ఈ పోర్టల్‌లోనే అప్‌లోడ్ చేయాలి. కార్మికుల హాజరుకు సంబంధించి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో (ఎన్‌ఎంఎంఎస్) హాజరు నమోదుకు ఈ ఏడాది జనవరి నుంచి యాప్ ప్రవేశపెట్టింది. పని ప్రదేశంలో కార్మికుల ఫొటోలను రెండుసార్లు తీసి జియో ట్యాగింగ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. వీటిని సంబంధిత ఉద్యోగులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఈ యాప్‌లో హాజరు నమోదు చేసుకోవడం కోసం కార్మికులు గంటల తరబడి ప్రయాసపడాల్సి వస్తోంది. ఈ పద్ధతి గత ఐదునెలలుగా రాష్ట్రంలో అమలవుతోంది. ఆధార్ ఆధారంగా చెల్లించే పద్ధతి (ఎబిపిఎస్) ప్రవేశపెట్టింది. దీంతో... ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించడం లేదు. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ చెల్లించే సమ్మర్ అలవెన్స్‌ను రద్దు చేసింది. చేసిన పనికి నెలల తరబడి వేతనాలివ్వడం లేదు. ఇళ్ల నుంచి బయటకు రాలేని మండుటెండలు కాస్తున్న ఈ కాలంలో కూడా రెండుపూటలా పనిచేయించడం వల్ల రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. వంద రోజులు పని కల్పించాల్సి ఉండగా, మన రాష్ట్రంలో సగటున 50 పనిదినాలకు మించి కల్పించడం లేదు. గతంలో పనిచేసే చోట ఎండ తీవ్రత నుంచి రక్షించడానికి టెంట్లు, మంచినీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించేవారు. అవేవీ అమలుకు నోచడం లేదు.
ఉపాధి హామీ చట్టం కోసం ఒత్తిడి చేసిన వామపక్షాలు తాము అధికారంలో ఉన్న సమయంలో పట్టణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తూ, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో అమలు చేశాయి. వీటికి కేంద్రం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలుసైతం అమలు చేసినా... బిజెపి పాలిత రాష్ట్రాలకు పట్టలేదెందుకో! కేరళ మోడల్‌గా దేశానికి విద్య, వైద్యం, ఉపాధి... ఇలా అనేక అంశాల్లో దిశానిర్దేశం చేస్తోన్న పినరయి విజయన్ ప్రభుత్వం తాజాగా ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ నిధి బోర్డును అమలులోకి తీసుకొచ్చింది. వారి కుటుంబాలకు పెన్షన్, వివాహ సమయంలో, చదువుకు ఆర్థిక సహాయం... ఇలా సంక్షేమాన్ని అమలు చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ, అయ్యంకాళి ఉపాధి హామీ పథకాల్లో భాగమైన 1.5 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నాయి. ఇప్పటికైనా కేంద్రం నిరుపేదలకు కూడుపెట్టే ఉపాధి హామీని చిత్తశుద్ధితో అమలుచేయాలి. సంక్షేమాన్ని విస్మరించి, మతోన్మాదాన్ని, మత విభజనను నమ్ముకోవడంతో కన్నడ నాట జనం ఇచ్చిన తాజా తీర్పు పాలకులకు కనువిప్పు కావాలి.