Nov 02,2023 22:24

తిరువనంతపురం :   బిల్లుల వివాదంపై కేరళ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సకాలంలో క్లియర్‌ చేసేలా గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. మొత్తం ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో మూడు బిల్లులు రెండేళ్లకు పైగా ఆయన డెస్క్‌లోనే ఉన్నాయి. మరో మూడు 12 నెలలకు పైడా పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్శిటీ ఛాన్సలర్‌గా తొలగించడం పెండింగ్‌ బిల్లుల్లో ఒకటి. గవర్నర్‌ బిల్లులను పరిష్కరించకపోవడం ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ బాధ్యతల ఉల్లంఘనతో సమానమని ప్రభుత్వం వాదించింది.

గవర్నర్‌కు సమర్పించిన ప్రతి బిల్లును నిర్దిష్ట సమయంలో పరిష్కరించాల్సి వుంటుంది. ప్రజాస్వామ్యప్రక్రియను పరిగణనలోకి తీసుకుని ప్రజల సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇతర చట్టాలను అనుసరించి రూపొందించిన బిల్లులు, ప్రజా సంక్షేమం కోసం రూపొందించిన బిల్లులను సకాలంలో పరిష్కరించేలా గవర్నర్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలు, విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని కేరళ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది.

తమిళనాడులో కూడా ఇదేవిధమైన వివాదం కొనసాగుతోంది. క్లియరెన్స్‌ కోసం తనకు పంపిన బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని స్టాలిన్‌ ప్రభుత్వం వాదిస్తోంది. గవర్నర్‌ రాజకీయ ప్రత్యర్థిలా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.