Aug 27,2023 08:31

కుండపోతగా దిమ్మరిస్తే
మొక్క వేళ్ళు ఎక్కడ బయటపడి
మట్టికొట్టుకు పోతాయోనని
అరచేతిని అడ్డంపెట్టి
చిలకరింపుగా నీళ్ళుపోస్తే సున్నితత్వంలా
ఆబగా, గబగబా గుటకలేస్తే
చంటి బిడ్డకు ఎక్కడ
మెడబడుతుందోనన్న
భీతితో ఆపి, ఆపి తాపిస్తూ
తల నిమిరే తల్లితనంలా..
అనుకోని రీతిన చుట్టుముట్టిన
అపార్థాల చిక్కుముడుల్ని
ఎలాబడితే అలా తెగతెంపుగా
తెంచేయకుండా
తొందరపాటు ఆతృతల్ని
మదిగదిలో నిర్బంధించి
నేర్పుగా ఓర్పుగా సరాసరిగా
సరిచేసే సహనత్వంలా...
ముళ్ళమీద పడ్డ గుడ్డ బతుకుని
మరింత గాయాలమయం కాకుండా
గట్టెంక్కించేలా ఉండాలి కవిత్వమంటే..

మోకా రత్నరాజు
9989014767