
- నీచత్వపు ఆనవాళ్లు మరికొన్ని...
కాటూరు-ఎలమర్రులో క్రూరుడు పళని యప్పన్ సాగించిన దమనకాండ గురించి ఇటీవల (జులై 19) ప్రజాశక్తిలో చెరుకూరి సత్యనారాయణ రాసిన వ్యాసం నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసింది. మా స్వగ్రామం కాటూరు. ఆ రోజున ఉదయాన్నే నాలుగేళ్ల వయస్సున్న నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని నాన్న పళ్లు తోముకుంటున్నాడు. ఎటునుంచో దూసుకువచ్చిన పోలీసులు నా ఎడమ భుజం పట్టి లేపి, విసిరికొట్టి నాన్నను తీసుకెళ్లారు. వెనకాల మా నాయనమ్మ పోలీసుల్ని తిడుతూ వెంటబడింది.
తరువాత 10 గంటలకు మళ్లీ మునసపు గారి కొడుకుతో పాటు పోలీసులు వచ్చి, మా ఇంట్లోని పప్పులు, బియ్యం, పచ్చడి జాడీలు బయట కుప్పగా పోసి నిప్పు పెట్టారు. మా అమ్మ ఏడుస్తున్నది. నాయనమ్మ మాత్రం చాలా ధైర్యంగా వారిని వెంబడిస్తూ రోడ్డెక్కింది. ఆమె ఆ సాయంత్రానికి తిరిగి వచ్చింది.
జులై 16, 1949 పోలీసు దుశ్చర్యల గురించిన మరిన్ని వివరాలు నేను అనేక మంది ద్వారా విన్నాను. కడియాల సుందరమ్మ అనే 30 ఏళ్ల లోపు మహిళ చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది, పాటలు బాగా పాడేది. పొడుగ్గా, తెల్లగా బాగుండేది. ఆరోజు ఆమెను పోలీసులు వీపు మీద లాఠీలతో కొడితే జాకెట్ నిలువుగా బద్దలై వీపు నగంగా అయింది. భుజాల మీద నుండి పైట తీసి కప్పుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా పోలీసులు ఆమె చేతులపై తీవ్రంగా బాదారు.
మా ఇంటి పక్కన వుండే వేమూరు కుటుంబయ్య, ఆయన భార్య శ్రీవాణమ్మ పార్టీలో పనిచేసేవాళ్లు. వారి కోడళ్ళు శ్రీకృష్ణ లీలావతి, దమయంతి, మా అమ్మ లక్ష్మి తులసి బాగా స్నేహంగా వుండేవారు. పిల్లలందరం ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి వుండేవాళ్లం.
కుటంబయ్య తాతయ్య ఆరున్నర అడుగుల ఎత్తుతో, బలంగా ఉండేవాడు. పొలం పనుల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఆరోజు పళనియప్పన్ సైన్యం కొట్టిన దెబ్బలకు ఆయన కాళ్లు, చేతులు, నడుము, వీపు మొత్తం ఎముకలన్ని నుజ్జు నుజ్జయ్యాయి. ఆయన జీవితాంతం ఆ నొప్పుల్ని భరించవలసి వచ్చింది. శ్రీవాణమ్మ నాయనమ్మ తరువాత ఐదారేళ్లకే మరణించింది.
తెలంగాణ రైతాంగ విప్లవ పోరాటానికి కాటూరు-ఎలమర్రు అందించిన సహాయ సహ కారాలు మాటలకందనివి. కాటూరుకు చెందిన కామ్రేడ్లు కడియాల నారాయణరావు, నార్ల తాతారావు, ఈడ్పుగంటి సుబ్బారావు, చీలి రత్నం పోలీసు కాల్పులకు బలయ్యారు. అందరూ యుక్త వయస్సులో వున్నారు. వారి భార్యలు అప్పటికి గర్భవతులు గానో, పసిబిడ్డ తల్లులు గానో వున్నారు. తరువాత వారు చదువులు కొనసాగించి, ఉద్యోగాల్లో చేరి తమ బిడ్డల బాగోగుల బాధ్యత చేపట్టారు.
ఎలమర్రుకు చెందిన పర్వతనేని తిరుమల రావు పోలీసుల చేతిలో అసువులు బాశాడు. ఆయనకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ బిడ్డ. ఆ బాబు కిషోర్. సి.పి.ఐ. రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించాడు.
సుందరయ్య గారు, మానికొండ సూర్యావతి అమరుల కుటుంబాలను సందర్శించినపుడల్లా... వారు అప్పుడే మరణించినట్లుగా కళ్ల నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను.
పళనియప్పన్ దమనకాండ కలిగించిన భయోత్పాతం, గాలిలోకి విసిరిన బంతి అంతే బలంతో మీదకి ఎగిసినట్లు, యువతలో మరింత పట్టుదలను పెంచింది. కాటూరు 'ఆంధ్ర మాస్కో'' గా పేరుగాంచింది.
- వి.సుమతి,
సెల్ : 9490098900