చదువంటే సకల జీవితమని..
విద్యలేని వాడు వింత పశువని..
పేదరికాన్ని పెన్నుతో జయించాలని..
సరస్వతిని మెప్పించి ఒప్పించి..
ఉత్తమశ్రేణిలో విద్యనభ్యసించి..
ఉద్యోగపర్వంలో అడుగిడా గర్వంగా !
ప్రభుత్వ బడిపంతులైన నాకు..
తరగతి గది ఆహ్వానం పలుక..
విద్యార్థుల కరువే నన్ను వెక్కిరించి..
నోరు మెదపక జీతం తీసుకొని..
అక్కరకురాని మేధావి కమ్మంది !
ప్రయాసతో ప్రభుత్వ ఉద్యోగినై..
విలువలతో విధుల్ని నిర్వహిస్తే..
తెలివేలేని దద్దమ్మంది లోకం..
బతకడమే తెలియని మూర్ఖుడంటూ..
నా జ్ఞానమే నన్ను చులకనగా చూసే !
దేశసేవ చేద్దామని సవాలు విసిరి..
శ్రమించి సివిల్ సర్వీసును సాధించి..
రాక్షస రాజకీయ మేతావులకు తలవంచి..
విజ్ఞానాన్ని అటకెక్కించి తలూపుతూ..
సలాం చేస్తూ సరే అంటూ సర్దుకున్నా !
ధనం మూలం మిధం జగత్తంటూ..
లక్ష్మిని చూసి సరస్వతి జడిసి..
ధనాన్ని చూసి విలువలు తోకముడిచే..
పదునైన కత్తిని చూసి కలం వణికే..
కండబలమే మేథోశక్తి మెడపై కత్తి నిలిపె !
నైతిక విలువలే నిత్య ఇంధనాలుగా..
సువిద్యకు పట్టాభిషేకం చేస్తూ..
జాతి జనుల్ని సన్మార్గాన జాగృతపరుస్తూ..
రాజ్యాంగ పున్నమివెన్నెల చల్లని నీడన..
భరతమాత భాగ్యవిధాతగుట తథ్యం !
బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037