Feb 05,2023 07:59

కన్నీటి చుక్కల శబ్దం నిద్రలోను వినిపిస్తుంది
ప్రక్కన చేరిన బాధను భరించలేక ఏడుస్తూ
ఆశల రెక్కలు నరుకుతూ కాలం విహరిస్తుంటే
పిడికెడు గుండె మోయలేని భారముతో రోదిస్తుంది..

నింగిని చూస్తూ వెలుగులు పంచాలని వేస్తుంటే
అవినీతి మబ్బులు వెలుగును కమ్మేస్తుంటే
స్వేచ్ఛగా విహరించే తనువుకు ఖరీదు కడుతుంటే
బ్రతుకు తెరువు కోసం చెమట కురుస్తూనే ఉంది..

నేలలో కప్పిన విత్తనం విశ్వరూపం చూపిస్తుంది
చిన్న ఆశ విశ్వశోధనలో నిజాన్ని నిరూపిస్తుంది
విజ్ఞానపు విత్తనాన్ని కొనాలని చూస్తుంది ధనం
నచ్చిన ఆకృతిలో తయారు చేసుకునేందుకు...

ఆకలి కడుపు చేసిన ప్రయోగం వెలుగుచూడదు
కర్ణుడి చావుల కారణాలు చూపుతుంది
నింగిలో జరిగే ప్రయోగంలో కర్షకుడి శ్రమ కనిపించదు
భుజాలపై మోసిన రాకెట్‌ శకలాల గుర్తులు తప్ప..

విశ్వ నాగరికతలో విలువైన వజ్రం నేలపై కప్పబడి
మెరుగులు దిద్దిన సామాన్యుడి కళ ఎక్కడ ఉంది
బండరాయి మహోన్నత శిల్పంగా నిలబడితే
శిల్పి చెక్కిన రచన చాతుర్య మహిమలో పేరేది..

కాలపు మైలురాళ్లలో ఈదిన సామాన్యుని సాహసం
రచించబడిన ఒక కావ్యపు నామధేయం ఏది?
చరిత్రగతిలో అన్యాయంపై ఎదురుతిరిగిన సాహసవీరుని
సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ శాసనరూపం కావాలి..

పరదేశి పరిపాలనలో విదేశీ విలువలు చూపాలి
కప్పబడ్డ చరిత్రలో మానవత్వపు కోణం ఎంత?
దోచిన విదేశీ రాజుల మనిషి బ్రతుకు ఎలాంటిదో
మన జాతికి అన్యాయం చేసే ప్రబుద్ధులకు చూపండి..

కొప్పుల ప్రసాద్‌
98850 66235