Feb 19,2023 08:48

తెలుగు భాష వ్యాప్తికి, మనుగడకు సంబంధించి ఏళ్ల తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఇప్పటివరకూ ఐదు ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరిగాయి. ప్రాంతాలను బట్టి యాస, మాండలిక సొగసూ ఎలా ఉన్నా రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల భాష తెలుగే. ఇదే, ఇలాగే వర్థిల్లాలన్న ఆకాంక్ష అందరిలో అభివ్యక్తం కావటంతో మాత్రమే తెలుగు వర్థిల్లదు. అది వెలుగులీనే వ్యవస్థకు అంకురార్పణ చేయాల్సిందీ, అమలు చేయాల్సిందీ కచ్చితంగా పాలకులే! ఈ నెల 21న 'ప్రపంచ మాతృభాషా దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం..
మన అమ్మభాష తెలుగు. మన భాషకు వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. విస్తారమైన సాహిత్యం ఉంది. అనేక సాహిత్య ప్రక్రియలు శాఖోపశాఖలై వర్థిల్లాయి. జనజీవన స్రవంతిలోకి సజీవ పాయలుగా ప్రవహించాయి. పద్యాలూ పాటలూ, కథలూ కావ్యాలూ, నాటకాలూ నాటికలూ, ప్రబంధాలూ మహా గ్రంథాలూ.. ఆయా కాలాలను, జనజీవనాన్ని చిత్రించాయి. అన్నిటా తీయతీయని తెలుగు పలుకు వేకువల వెల్లువలా ప్రవహించింది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగూ ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ; దేశంలోనూ, దేశం బయటా దాదాపు 16 కోట్ల మంది తెలుగు మాట్లాడతారని ఒక అంచనా. దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగే అంటారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా కూడా ఉంది. ఇవన్నీ మనం ఘనంగా చెప్పుకోవటానికి దోహదపడే సంగతులు. కానీ, తెలుగు వాడుక, వేడుక రోజురోజుకూ తరిగిపోతుందన్నది ఒక వాస్తవం. వెంటనే పెను ప్రమాదం లేకపోయినా- కొన్నేళ్లకు ప్రాభవం కోల్పోయే భాషల్లో తెలుగు కూడా ఉందనేది యునిసెఫ్‌ హెచ్చరిక. ఎందుకంటే- ఇప్పుడు చాలామంది అక్షరాస్యులకు తెలుగు మాట్లాడ్డం వచ్చుగానీ, చదవడం, రాయడం రాదు. తెలుగును తెలుగులో కాక ఇంగ్లీషు లిపిలో రాస్తున్న తరం రోజురోజుకూ పెరుగుతోంది. మాట్లాడ్డానికే పరిమితమయ్యే భాష.. క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భాషా అధ్యయనకర్తల ఆందోళన.
ఏ భాష అయినా ఎందుకు అవసరమవుతుంది? అంటే- 'మన అవసరాలు తీర్చుకోవటానికి..' అనేది జవాబు. ఒక సమూహపు ప్రజల అవసరాలు, జీవనం ఆ సమూహానికే పరిమితం అయినప్పుడు- ఆ సమూహాపు అమ్మభాషకు ఢోకా ఉండదు. ఇతర సమూహాలతో, ప్రాంతాలతో కలిసినప్పుడూ భాషకు ప్రమాదం వాటిల్లదు. మాటలను ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా రెండు భాషలూ పరిపుష్టమవుతాయి. ఇది భాష పుట్టినప్పటి నుంచీ అనుభవంలో ఉన్నదే! కానీ, మన భాషకు మించి మరొక భాషకు ఆధిపత్య స్థానం ఇవ్వటం ప్రమాదకరం. అది క్రమేణా అమ్మభాష చెల్లుబాటును హరించేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఇదే!

  • ఆకాంక్షలు వేరు.. ఆచరణ వేరు..

తెలుగును వెలుగులీనే విధంగా చేయాలని చాలామంది ఆకాంక్షిస్తారు. తెలుగు భాష గత వైభవాన్ని గానం చేస్తారు. ఏఏ అంశాల్లో తెలుగు గొప్పో చరిత్రనీ, సాహిత్యాన్నీ ఉటంకిస్తారు. కానీ, ఆచరణ కూడా అదే స్థాయిలో ఉందా? అంటే - లేదు. ఈ శతాబ్దిలో 2012, 2017ల్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తెలుగు ప్రాభవం పెంచటానికి పలు తీర్మానాలూ జరిగాయి. కానీ, అమల్లోకి వచ్చింది ఒక్కటీ లేదు. ఆ సందర్భంలో తెలుగుకు ప్రాచీనహోదా గురించిన చర్చలు, ఆ హోదా రావటం వల్ల తెలుగు ఎంతగా వికసిస్తుందో, ఎన్నెన్ని విస్తృత కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుందో భాషావేత్తలు, సాహిత్య అభిమానులూ ఆశావహంగా చర్చించారు. కానీ, ఇన్నేళ్లలో ఏం ఒరిగిందీ అంటే- జరిగింది లేశ మాత్రమే! పైగా మాతృభాష వికసించి, పరిమళించాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సైతం ఆంగ్లమాధ్యమం ప్రవేశించింది. తెలుగులో కోర్టు తీర్పులు, పాలనలో తెలుగు వాడుక వంటివి అక్కడక్కడ అప్పుడప్పుడు తప్ప, సమూలమైన మార్పు సాధ్యం కాలేదు. తెలుగు కేవలం సాహిత్య భాషగా ఉంటే- అది పుస్తకాలకే పరిమితం అవుతుంది. పాఠశాల మాధ్యమంలో, పాలనా వ్యవహారాల్లో నిండుగా మాతృభాషకు స్థానం ఇస్తేనే అది ఒక అవసరంగా, ఒక వ్యవహార సాధనంగా మారుతుంది. మాటల్లో ఉన్న తెలుగు ఘనత పనులకు ఉపయోగపడనప్పుడు పెద్దగా ఫలితం ఉండదు. అవసరానికి అక్కర రానిది క్రమంగా పక్కకు వెళ్లిపోవడం ప్రకృతి సహజం.

1
  • బోధన ఏ భాషలో?

'ప్రజల భాషలో రాష్ట్ర పరిపాలన జరగటం ప్రజాస్వామ్యానికి అవసరం' అనే ఆదర్శంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ మొదటి రాష్ట్రం తెలుగువారిదే! అంటే- మాతృభాష, సంస్కృతుల ఆవశ్యకత, ఆకాంక్షలను చాటిన తొలి గొంతు మనదే! భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక దేశభాషలకు సముచిత స్థానం ఇవ్వటానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన భాషలను అధికార భాషలుగా గుర్తించటం, విద్యా విధానంలో పట్టభద్ర స్థాయి దాకా రాష్ట్ర భాషా మాధ్యమం ప్రవేశపెట్టటం జరిగింది. తెలుగులో 1957లో సాహిత్య అకాడమీ, 1968లో తెలుగు అకాడమీ వచ్చాయి. 1969-1974కి తెలుగు మాధ్యమం పియుసి నుంచి బిఏ, బికాం, బిఎస్సీ స్థాయిదాకా వ్యాపించింది. కానీ, ఆ తరువాత తెలుగుకు క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాధాన్యం తగ్గి, ప్రయివేటు ప్రాబల్యం పెరగటంతో ఈ జాడ్యం మొదలైంది. ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవాళ్ళకు ఉద్యోగావకాశాలు పెరగటం, తెలుగు మాధ్యమం నిరుపయోగం అనే భావన విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో గట్టిగా స్థిరపడడం దీనికి ప్రధానకారణం. అది ఇప్పటికీ తారాస్థాయికి చేరుకుంది. ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీషులో చదువు నేర్పటం అవసరమనే భావన బలంగా పెరిగింది.

1
  • అమ్మభాషతోనే అభివృద్ధి..

అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ మాతృభాషలో తప్ప అన్యభాషలో పాఠశాల విద్య నేర్పటం లేదు. ఫిన్లాండు, నార్వే, స్వీడన్‌ వంటి చిన్న దేశాలూ; జర్మనీ, ఇంగ్లాండు, జర్మన్‌, జపాన్‌, చైనా వంటి ప్రసిద్ధ దేశాలూ తమ మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నాయి. మంచి ఫలితాలూ సాధిస్తున్నాయి. మన దేశంలోనూ 1968లో పార్లమెంటు సమ్మతించిన జాతీయ విద్యావిధానం ఇదే! కానీ, తరువాతి కాలంలో దానికి పూర్తిగా గండి పడింది. తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఆ హవా మరీ ఎక్కువ. ప్రయివేటు విద్యాసంస్థలు తామరతంపరగా మొదలై, తరువాత కార్పొరేట్‌ సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి ఒత్తిడి, ప్రభావం మొత్తం విద్యావ్యవస్థనే తలకిందులు చేసింది. తెలుగులో విద్యాబోధన అనేది ఒక పనికిరాని ప్రక్రియ అయిపోయింది. తెలుగు మాట్లాడడం తప్ప.. రాయడం, చదవడం రాని కొత్త తరాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే- కొంతకాలానికి తెలుగు భాష వినిపిస్తూ ఉండొచ్చు కానీ, తెలుగు అక్షరం అదృశ్యం అయిపోతుందని భాషా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మన రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల అవగాహనా స్థాయి మీద ప్రథమ్‌ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో తేలిన విషయాలు చాలా ఆశ్చర్యగొలిపేలా ఉన్నాయి. అత్యధిక శాతం పిల్లలు తమ తరగతి స్థాయిలో లేరు. 83 శాతం మంది ఎనిమిదో తరగతి పిల్లలు ఒకటో తరగతి స్థాయి తెలుగు వాక్యాలను చదవలేకపోయారట! క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ, ఫ్యాన్‌, బస్‌ వంటి ఇంగ్లీషు పదాలను 3వ తరగతి చదువుతున్న 24.3 శాతం పిల్లలు గుర్తించలేకపోయారట! 'బాలబాలికల్లారా, రారండి! ఆటలు పాటలు పాడండి.. పలకా బలపం తీసుకురారండి.. అఆఇఈ రాయండి' .. ఒకటో తరగతిలో ఉండే ఈ తెలుగు గేయాన్ని 3వ తరగతిలో 83 శాతం మంది, ఐదో తరగతిలో 72 శాతం మంది, ఎనిమిదో తరగతిలో 82 శాతం మంది చదవలేకపోయారట! అటు అమ్మభాషలోనూ, ఇటు ఆంగ్ల భాషలోనూ మన రేపటి తరాల దుస్థితి ఇది. నికరమైన చిత్తశుద్ధి, కచ్చితమైన కార్యాచరణ ఉంటేనే- ఈ పరిస్థితిలో మార్పు సాధించగలం.

1
  • ఇతర రాష్ట్రాల్లో తెలుగు పలుకు

తెలుగు రెండు రాష్ట్రాలకే పరిమితం కాదు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువే! తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. బెంగళూరులో 30 శాతం మంది తెలుగు మాట్లాడతారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో; ఒడిశాలోని రాయగడలో అత్యధికులు తెలుగు మాట్లాడతారు. బెంగాల్‌ జ్యూట్‌మిల్లు ప్రాంతాల్లో, మహారాష్ట్ర, గుజరాత్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో చాలామేరకు తెలుగు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇదికాక వందల ఏళ్ల క్రితం శ్రీలంక, బర్మా, మలేషియా వంటి ప్రాంతాలకు తరలివెళ్లిన తెలుగువారు నేటికీ ఇళ్లల్లో తెలుగులోనే మాట్లాడుకుంటారు.

  • పాలకుల శ్రద్ధ కరువు

ప్రపంచ తెలుగు మహాసభలను మన ప్రభుత్వాలు ఇప్పటివరకూ తెలుగునేలపై మూడుసార్లు నిర్వహించాయి. తొలిగా 1975లో, తర్వాత 2012లో సమైక్య రాష్ట్రంలో, 2017లో తెలంగాణ రాష్ట్రంలో. తొలి రెండు సభలనూ సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోవడం అనే రాజకీయ అవసరాన్ని ఆధారంగా చేసుకొని, నాటి నాయకులు నిర్వహించారు. ఒక తెలుగు రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకతను చాటుకోవడమనే రాజకీయ అవసరం కెసిఆర్‌ మహాసభలను జరిపించారు.
ఒక భాషగా తెలుగును ఎలా పెంపొందించుకోవాలి, దానిని ఒక ఆధునిక భాషగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే అంశాలపై నాటి పాలకులకు సరైన చూపు లేదు. 1975 సభల్లో చేసిన అనేక తీర్మానాలు ఆచరణలో నీరుగారి పోయాయి. తెలుగు భాష కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలనే భాషోద్యమ సంస్థల డిమాండును 2012 సభల్లో ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత 2013 డిసెంబరు 31న జిఓ నెం.909 ద్వారా మంత్రిత్వశాఖను ఏర్పర్చేటప్పుడే ఒక తప్పు నిర్ణయం చేసింది. సాంస్కృతికశాఖతో దీనిని కలిపి భాషా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసింది. మంత్రిత్వ శాఖతోపాటు, దానికింద తెలుగు అభివృద్ధి ప్రాధికార సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండును విస్మరించింది. తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో జరిగిన ప్రపంచ సభల్లోనూ - తెలుగు అభివృద్ధి కోసం ఏమేమి చేయాలనే కీలకాంశంపై ఏమాత్రం చూపు పెట్టలేదు. 1 - 12 వరకూ ఒక సబ్జెక్టుగా మాత్రమే తెలుగు బోధించడమనే చర్య ప్రకటించారు. 11, 12 తరగతుల్లో (ఇంటర్మీడియట్‌) తెలుగుకు ఒక భాషగా తప్పని సరిచేయడం అంటే సంస్కృతం అడ్డును తొలగించాలి. కానీ, ఆ పని జరగలేదు.

1
  • భాష వేరు.. మాధ్యమం వేరు!

మనం చిన్నప్పటి నుంచీ ఏ భాషా వాతావరణంలో పెరిగామో, ఏ భాష ఇంటి భాషగా ఉందో అదే మాధ్యమభాష అవుతుంది. మన ఆలోచనలన్నీ ఆ భాషలోనే స్ఫురిస్తాయి. ప్రాథమిక దశలో పిల్లలు ఏ నేర్చుకున్నా ఆ భాషలోనే నేర్చుకుంటారు. కాబట్టి- అమ్మభాషను మాధ్యమంగా ఉంచాలనేది ఒక శాస్త్రీయ అవగాహన. ఈ అంశంలో ఏ దేశంలోనూ వేరే చర్చ లేదు. మన దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఆంగ్లభాషా మాధ్యమం ప్రాథమిక విద్యలోనూ విస్తారంగా ప్రవేశించింది. నేర్పడం, నేర్చుకోవడంలో ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇటీవల ప్రథమ్‌ సంస్థ నిర్వహించిన సర్వే తేటతెల్లం చేసింది.
ప్రాథమిక విద్య స్థాయిని దాటాక - అవసరాలరీత్యా ఒక విద్యార్థి ఎన్ని భాషలైనా నేర్చుకోవొచ్చు. వారు ఎన్నుకునే వృత్తిని బట్టి, నివసించే ప్రాంతాన్ని బట్టి భాషలను అనుసరించొచ్చు. కానీ, భాష కోసం ప్రాథమిక బోధనా మాధ్యమాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఆంగ్ల భాషా ప్రావీణ్యం కొన్ని వృత్తుల్లో, దేశాల్లో రాణించటానికి ఉపయోగపడొచ్చు. కానీ, అది ఉద్యోగాలను సృష్టించదు. ఆంగ్లం ఒక భాషే తప్ప- ప్రత్యేక వృత్తి నైపుణ్యం కాదు. కొద్దికాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రఖ్యాత కార్పొరేట్‌ సంస్థలు వేలాది ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. దానికి కారణం ఆర్థిక రంగంలో ఏర్పడ్డ సంక్షోభం తప్ప, భాష కాదు. ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉపాధి అవకాశాలు, లేకుంటే లేదన్నది పూర్తి వాస్తవం కాదు. శాస్త్ర సాంకేతిక విద్య, ఉన్నతవిద్యల బోధన ఎలాగూ ఆంగ్ల మాధ్యమంలోనే నడుస్తోంది. హైస్కూలు దశలోనూ ఆంగ్లం, హిందీ సబ్జెక్టులుగా ఉన్నాయి. సైన్సు, గణితం, సోషలు వంటి సబ్జెక్టులనూ ఇంగ్లీషులో నేర్పడం విద్యార్థుల అవగాహనకు గండి కొడుతుందని భాషా పరిశీలకులు అంటున్నారు.

1
  • చెల్లుబాటు ఉంటే - తెలుగు వెలుగు

ఇంగ్లీషులో మాట్లాడితేనే, ఇంగ్లీషు తెలిస్తేనే పనులు జరుగుతాయి అన్న భావన బలంగా స్థిరపడేలా మన పాలనా యంత్రాంగం ఉంది. ఇది బ్రిటీషు పాలన మిగిల్చిన అవశేషం. ఏ భాష మనుగడ సాగించాలన్నా అది పరిపాలనా భాషగా ఉండాలి. మాతృభాష ప్రజల అన్ని అవసరాలనూ తీర్చగలగాలి. అప్పుడే దానికి మనుగడ. అన్ని కార్యాలయాల్లో ప్రజలు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, సంభాషణలు తెలుగులోనే జరపడం వల్ల భాష పట్ల గౌరవం పెరుగుతుంది. తెలుగు మొత్తం సమాజపు భాషగా వికసిస్తుంది. తెలుగు కలకాలం వినపడాలన్నా, కనపడాలన్నా- అది అధికారిక హోదా పొందాలి. అన్నింటా చెల్లుబాటు కావాలి. చెల్లుబాటు జరిగినప్పుడు, జరుగుబాటు కుదిరినప్పుడు- భాషే కాదు; ఏదన్నా వర్థిల్లుతుంది. వెయ్యేళ్లు బతుకుతుంది.

1

 

  • తెలుగు భాషా చరిత్ర

భాష ఒక నిత్య ప్రవాహిని. పాయలు పాయలుగా మారి, అనేక క్ష్షేత్రాల్లోకి చేరి, అక్కడి స్థానిక భాషాప్రవాహాల్లో సంగమించి, కొంత ఇచ్చి, కొంత తీసుకొని, కొంగొత్తగా అవతరించి.. ఆ క్రమంలో కొంత అంతరించి, కొంత కొత్తగా ఆవిర్భవించి.. నిర్విరామంగా సాగుతూ ఉంటుంది. ఇలా వందల ఏళ్ల నుంచి పరిణామం చెందుతూ ప్రవహిస్తున్న భాష జన్మస్థానం ఎక్కడీ అంటే ఆనవాళ్లను కచ్చితంగా కనుక్కోవడం కష్టమే! ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండింటా తెలుగు మాతృభాషగా ఉన్న వారి సంఖ్య దాదాపు తొమ్మిది కోట్లు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగు మాట్లాడేవారు మరో ఏడు కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. ఈ విధంగా ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగుది 13వ స్థానం. రెండున్నర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు ప్రపంచ ప్రాచీన భాషల్లో ఒకటి. వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి మనదేశంలో పర్యటిస్తూ- తెలుగును చూసి, విని తెలుగును 'ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌'గా అభివర్ణించాడు. ఎందుకంటే ఇటాలియన్‌ కూడా మన తెలుగు వలే అజంతా భాష.

1
  • తెలుగు ఎక్కడ పుట్టింది?

తెలుగును ద్రావిడ భాషా వర్గానికి చెందినదిగా భాషా శాస్త్రకారులు వర్గీకరించారు. తమిళం, కన్నడం, మలయాళం, తోడ, తుళ, బ్రహ్మి తదితర భాషలు ద్రావిడం. ఇవి హిందీ, ఇతర దేశీయ భాషల వలె ఇండో ఆర్యన్‌ భాషలు కావు. ఈ భాషలు వర్థిల్లే సమాజాల సంస్కృతి కూడా భిన్నమైనది. తెలుగు వారి భాషా సంస్కృతులు చాలా లోతైన పునాదుల మీద నిర్మితమై ఉన్నాయి. కావ్యాలు, గేయాలు, పద్యాలు, పాటలు, జానపదాలు, నృత్యాలు, వినోదాలు, విహారాలు, ఆచార వ్యవహారాలు అన్నిటా ప్రత్యేకత, వైవిధ్యమూ గల చరిత్ర తెలుగు వారిది. ఆర్యభాషలు ప్రవేశించకముందు ద్రావిడ భాషలు మనదేశమంతా విస్తరించి ఉండేవని.. కొంతమంది భాషా చరిత్రకారుల అభిప్రాయం. తెలుగు మూల మధ్య ద్రావిడ భాష నుంచి పుట్టింది. ఈ కుటుంబంలో తెలుగుతో పాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి.
క్రీ.శ మొదటి శతాబ్దంలో శాతవాహనులు సృష్టించిన 'గాథాసప్తశతి' ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు కనిపించాయి. తెలుగుభాష మాట్లాడేవారు శాతవాహన కాలానికి ముందే కృష్ణా, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివసించేవారని ఒక అంచనా. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దికి చెందినది. శాసనాల్లో మనకు లభించిన తొలి తెలుగు పదం 'నాగబు'. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణం (రుగ్వేదంలో భాగం)లో మొదటిసారిగా 'ఆంధ్ర' అనే పదం జాతిపరంగా వాడారని భాషావేత్తలు చెబుతారు. మనకు తెలిసినంతలో ఇదే ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాల్లోనూ, అశోకుని శాసనాల్లోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది.
క్రీ.శ.1000కి ముందు శాసనాల్లోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దం ఆరంభం నుంచి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెయ' వంటి పదాలు శాసనాల్లో వాడారు. 11వ శతాబ్దంలో నన్నయ్య కాలంనాటికి తెలుగు రూపాంతరంగా 'తెనుగు' అనే పదం వచ్చింది. 13వ శతాబ్దంలో మహమ్మదీయ చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని 'త్రిలింగ' అని వ్యవహరించారు. 15వ శతాబ్దం పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకార చూడామణిలోనూ ఈ ప్రస్తావన చేశాడు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్యభాగం త్రిలింగదేశమని, 'త్రిలింగ' పదం 'తెలుగు'గా పరిణామం పొందిందని ఒక సమర్థన. ఇది సంస్కృతీకరింపబడిన పదమే తప్ప మరోటి కాదని; వాస్తవానికి తెలుగు అనేదే ప్రాచీన రూపమని చరిత్రకారుల అభిప్రాయం. 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాథుడు 'నవలక్ష తెలుంగు' అని వాడాడు. తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణం గలిగిన దేశమని వర్ణించాడు.
నన్నయ్యకు పూర్వం నుంచి గ్రాంథిక భాష, వ్యావహారిక భాష స్వతంత్రంగా పరిణామం చెందుతూ వచ్చాయి. 20వ శతాబ్దం తొలినాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికం ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చకూడదని గ్రాంథిక భాషావాదులు భీష్మించారు. ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషావాదులు వాదించారు. ఆఖరికి ప్రజల భాషే పైచేయి సాధించింది. గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటివారు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. దీనికన్నా ముందే పోతన, సోమన, వేమన వంటివారు సరళమైన తెలుగులో సారస్వతం సృష్టించారు.