Jul 31,2022 18:17

అమ్మాయీ!! కొంచెం పైలం బిడ్డా!
కాళ్ళు కనబడనీయకుండా నడువు
పాదాలు చూసి సొల్లు కార్సుకుంటారమ్మా
పక్క మీద పడుకున్నా కాళ్ళు ముడుచుకో

కాళ్ళు వూపినా కనబడినా
శృంగార కోణ వీక్షక
నిలువు బొట్లు.. కీర్తననో.. పద్యమో
ఓ దృశ్యం కళ్ల ముందుకు
భావుకతకీ శృంగారానికీ బూతుకీ
వ్యత్యాస మెరుగని పామరులు
వాళ్ళే పాడుకోవాలవి
నీలాంటోళ్లు పాడితే సహించని పురుషాధిక్యత

నిండు చీరలో
నడుస్తున్నా పాదాలకు తొడుగులు వేసుకో
తన్మయత్వంతో కాళ్ళు వూపాలనుకుంటే దుప్పటి కప్పుకో
పట్టీలకి గజ్జెలుంటే తీసేరు

చాటుమాటుగా ఏమైనా చేసే కళ్ళు
గర్భగుడిలో రసికత హృదయాలు
నీలో ఏం కనబడినా అక్కడికే వెళ్ళే మనుషులు
వాళ్ళకవి బూతు పద్యాలే
వాళ్ళకవి కామోద్రేక ప్రేరేపిత కీర్తనలు
నీవేమో పద్ధతిగా చిత్రీకరిస్తివి
ఎవడు ఎవడికి వారసులు
ఓ పద్యం కాగితంపై జనంలోకి వచ్చాక
జనం నాలుకలపై నాట్యం
రంగస్థలంపై తెరంగేట్రం
ఓ చలనచిత్రం నిండా
పడరాని చోటల్లా ఆపిల్‌ ద్రాక్షలు పడుతుంటే
లొట్టలేసుకుంటూ చూసిన కళ్ళు
నీపై అక్కసుతో
నిలువెత్తు పితృస్వామ్య వ్యవస్థ నిదర్శనమే!
గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201