మన పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ తిండే వారి ఆరోగ్యానికి కారణం అనుకుంటూ ఉంటాం. అదీ నిజమే. వారు తినే ఆహారంలో శరీరానికి కావలసిన పోషకాలుండేవి. సరిపోయినంత శారీరక శ్రమ, తినే సమయం అన్నీ క్రమ పద్ధతిలో ఉండేవి. మనమూ పాటిద్దాం అనుకునేసరికి సమయం లేకనో, చేసుకోవడం రాకనో, అసలా పదార్థాలేమిటో తెలియకనో ఇలా అనేక కారణాలు మన ముందు. రోజువారీగా కాకపోయినా అప్పుడప్పుడన్నా అలాంటివి చేసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ముఖ్యంగా కట్టెపొయ్యి మీద మట్టిపాత్రల్లో చేసుకుంటే ఫలితం ఎక్కువ. మరి వాటిలో కొన్నింటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
సర్వ పిండి..
కావలసినవి : బియ్యప్పిండి - 3 కప్పులు, వేయించిన వేరుశనగపప్పుల నూక - 1/4 కప్పు, జీలకర్ర - స్పూను, కారం - స్పూను, పచ్చిమిర్చి తరుగు - స్పూను, నువ్వులు - స్పూను, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తరుగు - స్పూను చొప్పున, ఉప్పు - తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, గంటసేపు నానబెట్టిన శనగపప్పు - 2 స్పూన్లు
తయారీ : పైన చెప్పిన పదార్థాలన్నీ కొంచెం కొంచెం నీరు చల్లుకుంటూ కలుపుతూ మరీ పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా ముద్దగా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న బాండీపై స్పూను నూనె వేసి, అంతా రాయాలి. దానిపై ముందుగా తయారుచేసుకున్న పిండిముద్దను పలుచగా రొట్టెలా తట్టుకోవాలి. మధ్యలో అక్కడక్కడా చూపుడు వేలితో చిన్న గుంటలు చేయాలి. ఆ గుంటల్లో కొంచెం కొంచెం నూనె వేసి, మూతపెట్టి పొయ్యి మీద ఉంచాలి. దీన్ని సన్న సెగమీద పది నిమిషాల పాటు కాల్చాలి. అంతే సర్వపిండి రెడీ అయినట్లే.
కలి అన్నం..
కావలసినవి : బియ్యం, నీళ్లు
తయారీ : బియ్యం మూడోసారి కడిగిన నీటిని ఒక గిన్నెలో (మట్టి పాత్ర అయితే మంచిది) పోసుకొని, అన్నం ఉడికిన తర్వాత గంజి ఆ నీటిలో వంచాలి. మూతపెట్టి ఉంచి ఆ తర్వాత రోజు అడుగున పేరుకున్న నీటిని గిన్నెలో ఉంచేసి, పై నీటిని వంచి, ఎసరుగా పెట్టి అన్నం వండుకోవాలి. ఈ అన్నమే కలి అన్నం. ప్రతిరోజూ ఈ కలి అన్నాన్ని తింటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. దీనిలోకి రోటి పచ్చళ్ళు మంచి కాంబినేషన్.
ఉలవ కట్టు..
కావలసినవి : ఉలవలు - కప్పు, టమాటాలు - 2, ఉల్లిపాయ, ధనియాల పొడి - స్పూను, ఉప్పు - తగినంత, చింతపండు - 75 గ్రా. కారం - 2 స్పూన్లు, పసుపు, నూనె - 2 స్పూన్లు, జీలకర్ర - స్పూను, ఆవాలు - స్పూను, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు
తయారీ : ఉలవలను రాళ్ళు, ఇసుక లేకుండా శుభ్రం చేసుకోవాలి. వీటిని మట్టిపాత్రలో వేసి, రెండు లీటర్ల నీటిని పోసి ఉడికించి, వడకట్టాలి. వడకట్టిన ఉలవనీళ్లను మరో మట్టిపాత్రలో పోసుకుని, దానిలో ఉల్లిపాయ, టమాటా ముక్కలు, చింతపండు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి, మరగనివ్వాలి. మరిగాక, కొంచెం నీటిలో కలిపిన రెండు స్పూన్ల బియ్యప్పిండిని పోస్తూ కలుపుకోవాలి. ఈ చారు పావుగంట మరగనిచ్చి, దించేయాలి. ఇప్పుడు స్టౌ పై చిన్న గిన్నె పెట్టుకుని నూనె వేసి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసి, చారులో వేయాలి. అంతే ఘుమఘుమలాడే ఉలవకట్టు రెడీ.