Sep 04,2022 10:46

దర్శకుడు కరుణకుమార్‌ అంటే ప్రేక్షకులకు ఓ అంచనా ఉంటుంది. 'పలాస, శ్రీదేవీ సోడా సెంటర్‌' వంటి సీరియస్‌ స్టోరీలు, ఎంతో రియలిస్టిక్‌గా తీసి, ఆడియెన్స్‌ను మెప్పించాడు. మధ్యలో పలు చిత్రాల్లో ఆర్టిస్టుగానూ కనిపించాడు. ఇక మూడో సినిమాతో ఆయన రూట్‌ మార్చారు. గ్రామీణ వాతావరణం, చిత్రసీమ నేపథ్యంలో వినోదాత్మక సినిమా తీశారు. 'కళాపురం' అంటూ వినూత్న ప్రయోగం చేశాడు. 'అందరూ కళాకారులే...' అనేది ఉపశీర్షిక. సత్యం రాజేష్‌ను ప్రధానపాత్రలో పెట్టిన కళాపురం అంటూ తీసిన దర్శకుడు.. టైటిల్‌తోనే ఎంతో ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

kalapuram


కథలోకి వెళ్తే.. కుమార్‌ (సత్యం రాజేష్‌) దర్శకుడు అవ్వాలని సినీ ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. అతని ఫ్రెండ్‌ ప్రవీణ్‌ (ప్రవీణ్‌ యండమూరి) కూడా సినిమాలో ట్రై చేస్తుంటాడు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. ఇక కుమార్‌ ప్రేయసి ఇందు (కాశిమా రఫి) కూడా హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే ఆమె అవకాశాలు, లగ్జరీ లైఫ్‌ కోసం పక్కదారి పట్టి కుమార్‌ను మోసం చేస్తుంది. దీంతో కుమార్‌ బ్రేకప్‌ బాధలో ఉంటాడు. సినిమా ప్రయత్నాలు ఆపి బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుందామని అనుకుంటాడు. ఇరానీ ఛారు కేఫ్‌లో తన రూమ్మేట్‌, హీరోగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న స్నేహితుడు ప్రవీణ్‌కి విషయం చెబుతాడు. అప్పుడు వెనుక కుర్చీలో ఉన్న అప్పారావు (జనార్ధన్‌) తమ ఊరు కళాపురంలో సినిమా తీయమని, డబ్బులు తాను పెడతానని చెబుతాడు. అతని మాట నమ్మి, కళాపురం వెళ్లిన కుమార్‌కు పెద్ద షాక్‌ తగులుతుంది. ఆ ఊరు ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే మరణించడంతో ఉప ఎన్నిక వస్తుంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో కుమార్‌ దగ్గర ఉన్న డబ్బులకు లెక్కలు చూపించమని పోలీసులు కోరతారు. అప్పారావుకు ఫోన్‌ చేస్తే అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలుస్తుంది. రాత్రిళ్ళు హైదరాబాద్‌ పార్కుల్లో నిద్రపోయే అప్పారావుకు సినిమా ప్రొడ్యూస్‌ చేసేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? కుమార్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? శారద (సంచిత) తో పరిచయం ఎటు తిరుగుతుంది? అసలు కుమార్‌ సినిమా తీస్తాడా? సినిమా వెనుకున్న ఉద్దేశ్యం ఏంటి? చివరకు కుమార్‌ స్థాయి ఎలా పెరుగుతుంది? అనేది మిగతా కథ.
దర్శకుడు కరుణకుమార్‌ ఇప్పటి వరకూ తీసిన రెండు సినిమాలు సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కినవి. కానీ 'కళాపురం' వాటికి భిన్నంగా పొలిటికల్‌ సెటైరిక్‌ మూవీగా తెరకెక్కించారు. సినిమా నేపథ్యంలో ఈ సినిమా తీసినా, రాజకీయ క్రీడలో ఓ చిత్ర దర్శకుడు ఎలా పావుగా మారాడన్నది మెయిన్‌ పాయింట్‌. అవకాశాల కోసం కుమార్‌ ప్రయత్నించడం, ఈజీ మనీ సంపాదించిన అప్పారావు ప్రొడ్యూసర్‌ అయిపోవడం, కళాపురం వెళ్లి, గ్రామీణుల సహకారంతో సినిమాను చుట్టేయడం.. ఆ తర్వాత తన సినిమా తనకే నచ్చక డైరెక్టర్‌ డీలా పడటం.. ఒకదాని తర్వాత ఒకటి చకచకా సాగిపోతుంటాయి. కాకపోతే అంతర్లీనంగా చెప్పిన కథ, చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌తో అందరూ ఒక్కసారిగా అవాక్కు అవుతారు. అంతవరకు మనం చూసినదానికి, చివర్లో ట్విస్ట్‌ విప్పిన తరువాత చూసిన దానికి చాలా మార్పు ఉంటుంది. కరుణకుమార్‌ ఈ చిత్రాన్ని ఎంతో లైటర్‌ వేలో తెరకెక్కించాడు. ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా చక్కని వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలోనే కథ మీద మరీ అంత ఫోకస్‌ పెట్టనట్టు అనిపించింది. చాలాచోట్ల సీన్స్‌ సిల్లీగా అనిపిస్తాయి. అయితే లాజిక్స్‌ వెతక్కుండా సినిమాను అలా చూస్తే ఎంజారు చేసేయొచ్చు. పల్లెటూరి వాతావరణాన్ని మరోసారి స్క్రీన్‌ మీద చక్కగా చూపించారు దర్శకుడు.
కుమార్‌ పాత్రలో సత్యం రాజేష్‌ మెప్పించాడు. మరీ ఎక్కువగా నవ్వించకుండా.. ఎమోషనల్‌ అవ్వకుండా సెటిల్డ్‌గా చేసినట్టు అనిపిస్తుంది. ప్రవీణ్‌ కూడా తన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక కాశిమా రఫి ఉన్నంతలో ఆకట్టుకుంది. శారద కారెక్టర్‌లో సంచిత అందంగా కనిపించడమే కాదు.. చక్కగా నటించింది. ఇక మిగిలిన పాత్రలో చిత్రం శ్రీను, మిగతా నటీనటులు అందరూ తమ పరిధి మేరకు నటించారు.
'కళాపురం' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారంటే నమ్మడం కొంచం కష్టమే. పాటల్లో ఆయన మార్క్‌ కనిపించలేదు. కానీ, కథకు తగ్గట్టు పాటలు అందించారు. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ బావుంది.
టైటిల్‌ : కళాపురం
నటీనటులు : 'సత్యం' రాజేష్‌, సంచిత పూనాచా, 'చిత్రం' శీను, జనార్ధన్‌, ప్రవీణ్‌ యండమూరి, రుద్ర ప్రతాప్‌, కాషిమా రఫీ, సనా, 'జబర్దస్త్‌' అప్పారావు, ఫైమా, తదితరులు
సినిమాటోగ్రఫీ : ప్రసాద్‌ జీకే
సంగీతం: మణిశర్మ
నిర్మాణ సంస్థలు : జీ స్టూడియోస్‌, ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత : రజనీ తాళ్లూరి
రచన, దర్శకత్వం : కరుణకుమార్‌