Nov 20,2022 08:15

రాత్రి కురిసిన వర్షంలో తడిచిన గులాబీ పూలమొక్కలన్నీ రోజూ కన్నా మరింత అందంగా కనిపిస్తున్నాయి. నిన్నటి నుండీ తుమ్మెదొకటి అలుపు లేకుండా చిన్ని చిన్ని మట్టి ముద్దలు తెస్తూ మామిడిచెట్టు కొమ్మకి గూడు కడుతూనే ఉంది. చూస్తున్న కొద్దీ అంత చిన్నప్రాణి కూడా తన సొంత గూటి కోసం ఎంతో శ్రమిస్తోంది కదా అనిపిస్తుంది. అక్కడక్కడా పక్షుల కోసం చల్లిన గింజల్లో కొన్ని మిగిలిపోయి, తిరిగి మొలకెత్తాయి. మందులు లేకుండా సహజ సిద్ధంగా ఏపుగా పెరిగి, విరగ్గాసిన రాగి, సజ్జ కంకుల మీద వాలిన పిట్టలు కువకువలాడుతూ అపురూపంగా ఒక్కో గింజా తింటున్నాయి. ఆకుల మాటున దాగుడుమూతలాడే జామపండ్లను రామచిలకలు మాత్రం ఇట్టే పట్టేస్తున్నాయి.
పూల కుండీలన్నిటిపైన పెయింట్తో ఒక్కో కుండీకి ఒక్కో డిజైన్‌ వేసింది మా అమ్మాయి. ఎంతసేపు కూర్చున్నా, రోజూ చూస్తున్నా కొత్తగానే ఉంటుంది నాకు.
ఈ గార్డెన్ని పిల్లలు ఎంతో పద్ధతిగా, అందంగా మలచిన తీరు ప్రతి మొక్కలోనూ కనిపిస్తోంది. ప్రకృతి ఒడిలో బ్రతకాలన్న నా ఆరాటం అర్థం చేసుకుని, ఈ ఇంటిని తీసుకున్నారు. టీ తెచ్చుకుని బాల్కనీలో కూర్చున్నాను. అల్లం, యాలకులు దంచి చేసిన చిక్కటి టీ ని ఒక్కసారి సిప్‌ చేస్తూ 'దేవతలు తాగిన అమృతం ఇదే అయ్యుంటుంది' అని అనుకుని, నాలో నేను నవ్వుకున్నాను.
నాకు నేనుగా సృష్టించుకున్న నా ఈ స్వర్గమంటే నాకు విపరీతమైన ఇష్టం. ఒక వయసొచ్చాక హాయిగా కృష్ణా, రామా అనుకుంటూ మనవడు, మనవరాళ్లతో ఆడుకుంటూ బతకాలని అంటారు. కానీ నేను స్వయంగా అన్ని బంధాల నుండి 'కాస్త' దూరం జరిగాను. అవును నిజమే!
నా యాభై ఐదేళ్ల జీవితంలో ఇంటికోసం, పిల్లల భవిష్యత్‌ కోసం క్షణం కూడా తీరిక లేకుండా బతికాను. ఇది అందరూ చేసేపనే అయినప్పటికీ నన్ను నేను ఎప్పటికపుడు అలసిపోకుండా, ఆగిపోకుండా ప్రోత్సహించుకున్నదీ, ఎదురుచూసిందీ మాత్రం ఈ రోజు ఇలా బతకడం కోసమే! నా జీవితపు మాధుర్యాన్ని కొన్నాళ్లయినా ఆస్వాదించాలి అనిపించేది. అందుకే నా ఈ ఇంటిని స్వర్గంతో పోల్చుకుంటాను.
ఇపుడు అచ్చంగా నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. ఉన్నత పదవుల్లో రాణించిన నా పిల్లలే నేను సంపాదించుకున్న విలువైన ఆస్తులు. వారికి నేనేంటో తెలుసు. నేను ఈ దశలో కోరుకునేదేమిటో తెలుసు. నాకంటూ కాస్త ప్రైవసీ కావాలని పిల్లలను అడగడమే ఆలస్యం. నేను ఎంచుకున్న ఈ స్వచ్ఛమైన పల్లెటూరులో ఏ లోటూ లేకుండా అన్నీ సమకూర్చి పెట్టారు. ప్రత్యేకంగా నాకంటూ జీవితాన్ని అనుభవించే అవకాశం కల్పించారు. అందమైన పొదరింట్లో పూలమొక్కలు నాటి, నాకిష్టమైన పుస్తకాలూ ఇంకా నేను చదవాలనుకున్నవీ ఇలా అన్నీ శ్రద్ధగా వెతికి వెతికి మరీ సమకూర్చారు. చుట్టూ పిలిస్తే పలికే మనుషుల మధ్య, కలుపుగోలుగా కబుర్లు చెప్తూ పనిచేసుకుంటూ తిరిగే ఇద్దరు పనివాళ్లతో ముచ్చట్లు పెట్టినా.. ఇది ఎవరూ నన్ను డిస్ట్రబ్‌ చేయని, నేను కోరుకున్న ప్రశాంతమైన ఏకాంతం.
బిడ్డలు వెళ్తూ వెళ్తూ 'మా! మేము వస్తుంటాము. నువ్వు ఎపుడు చూడాలంటే అప్పుడు నీ ఎదుట వాలిపోతాం. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వెంటనే వచ్చేరు!' అని చెప్పి మరీ వెళ్లారు.

గార్డెన్‌లో విరజాజి తీగను ట్రిమ్‌ చేస్తుండగా కాంపౌండ్‌ వాల్‌ బయట ఎవరివో అస్పష్టంగా ఏడుపుతో కలగలసిన మాటలు వినిపిస్తున్నాయి. గేటు బయటకు వచ్చి చూశాను. ప్రహరీగోడను ఆనుకుని పెద్ద వేప చెట్టు వుంది. అందుకే గేటుకు అటు ఇటూ పెద్ద అరుగులు కట్టించాము. వాటి మీద కూర్చుని, ఒక పండు ముసలమ్మ మరో మనిషికి తన కష్టం చెప్పుకుని ఏడుస్తుంది. ముసలమ్మ ఇపుడా, రేపా.. అన్నట్లు కొండెక్కబోయే దీపం వత్తిలా వుంది. ఒంట్లోని రక్తమంతా చేదతో తోడేసినట్టూ తెల్లగా, పాలిపోయి ఉంది. కాసేపు వారి సంభాషణ విన్న తరవాత విషయం అర్థమయింది.
గేటుకు ఆనుకుని నిల్చున్న నన్ను ఓసారి తలెత్తి, తేరిపారా చూసి నాతో ఏ ఇబ్బందీ లేదనుకుంది కావచ్చు. మాట్లాడడం తిరిగి మొదలు పెట్టింది.
'ఆ అవ్వది పక్కన పల్లె అంట. కోట్ల ఆస్తి పంచి ఇచ్చిందట, బిడ్డల కన్నా ఎక్కువగా చూసిన కోడళ్లు కూడా ఇంట్లోకి రానివ్వరనీ, బాత్రూమ్‌ కూడా లేని ఒక చిన్నగది మాత్రం తనకు ఇచ్చారనీ చెప్తుంది. కరెంటు బిల్లు కూడా ముసలామె బాధ్యతనే అంట. కొడుకులు ఆమె ముఖం కూడా చూడరట. తన మీద చెప్పుతో, చీపురుతో దాడి చేస్తారనీ, అనరాని మాటలంటారనీ, ఎవరు ఆమెకు సపోర్ట్‌ చేసినా వారిని కూడా ఎలా పడితే అలా మాటలు అంటారని చెప్పుకుని ఏడుస్తుంది. చివరికి కూతుర్లు తన ఇంటికి వస్తే వారు కూడా ఎన్నో అవమానాలు పొందినవారేనట. వచ్చే పెన్షన్లోనే తన మందులు, కూరగాయలు, పై ఖర్చులు.. ఇలా అన్నీ అందులోనే సరిపెట్టుకోవాలని చెప్పుకుని, ఏడుస్తుంది.
ముసలామె గద్గద స్వరంతో చెప్పుకుపోతుంది. అయినా మాటలు ఆ దుఃఖంలో పెగలట్లేదు. బహుశా చాలా రోజుల తరువాత తన కష్టం వినే మనిషి దొరికిందేమో! ఓదార్పు మాటలు కూడా ఆశించకుండా చెప్పుకుపోతుంది పాపం. చెప్పడం ఆపితే పక్కనామె లేచి వెళ్ళిపోతుందని బెంగ కూడా కాబోలు. ఏకధాటిగా కష్టం చెప్పుకుని, కన్నీరు మున్నీరవుతుంది.
'కాదే! కుక్క కాపలాలాగా ఇంటి ముంగిటనే కూసుంట గాదె. ''అమ్మ తిన్నావానే'' అంటే ఏమవుతుంది వానికి? దర్వాజా తానకొచ్చీ ''అవ్వా జర గాందాక బోయ్యస్తనే పని ఉన్నదని'' జెప్తే ఏం బోవుగానికి? ''చెప్తే పని గాదట''గానికి. నాకు జెప్పిపోతేనే పని గాదానే? నాకర్థం కాదు. అన్నీ తెలిసినా తెలియనట్లే ఉంటది వాని పెండ్లాం. నేనొక్కదాన్నే నాయే పరాయిదాన్ని?'.
'ఇగో మొన్న అంటడు బిడ్డా! నువ్వేమిచ్చావే నాకు? మంది సాయం జేసిండ్రు పది, పాతిక గందుకే ఈదినం నిలబడ్డా అంటడే. గా ఇచ్చినోళ్లు ఎవర్ని జూసి ఇచ్చిండ్రే? మా ఇల్లు, వాకిలి జూసి గాదానే? గాని అప్పులన్నీ ఎవడు కట్టిండ్రే? గా పైసలకు మిత్తి ఎవలు కట్టిండ్రే? వాడున్న బంగళా, వాడుదిరిగే కారు గవ్వన్నీ ఎవరిచ్చినయే?' ఆయాసంతో, కోపంతో రొప్పుతూ ఆగింది కాసేపు.
'మేము గట్టిన ఇంటిని, మా కష్టాన్ని శీపురు పుల్ల లెక్క తీసేస్తడు. మరి వాడు గొన్న జానెడు భూమి మీద, వాడు సంపాదించిన రూపాయి మీద, వాని పెండ్లాం బిడ్డల మీదా గంత పాణం ఎందుకో?'
'మేం మన్ను, మషాణం బెట్టి సాదినం. వాడు, వాని పెండ్లాం గాళ్ళ పిల్లలని బంగారం తినవెట్టి సాదిండ్రానే?'
ఆ పక్కనే కూర్చొని ఉన్నామె ముసలమ్మకి ఊరడింపు మాటలు చెప్తూ 'ఈడ గింత బాధ పడేబదులు సక్కగపోరు నీ ఆడబిడ్డలతాన ఉందరాదే అక్కా! గాడనే బుక్కెడు దిని నిమ్మళంగా ఉండరాదే' అంది.
'ఎట్లుంటనే అట్లా? నా రెక్కల్లో మన్నువడా!.. నా కొడుకులూ నా కోడళ్ళనుకుని ఇంటెడు శాకిరి జేసినా, నా రెక్కలు మూలబడ్డారు. నన్ను పక్కకు లాగి, పడేసిండ్రు. పైసలన్నీ వీని కోసం ఖర్చు జేసినం, ఇల్లు వాకిలి వీడికిచ్చినం. ముసలాయన పేరు మీద గూడా రూపాయి లేకుంట ఇచ్చినం. మా బ్యాంకిల సుత పైసలు ఒడజేశిండ్రు. ఎన్నడన్నా వొకనాడు బిడ్డలులొచ్చి పోదాం రమ్మన్నా గూడా నా కొడుకు కోడలు దందా (వ్యాపారం) లో పడి, తీరిక లేకుంటా ఉంటరు. పిల్లలని పట్టుకుని గీన్నే వుంటనని పోకపొయ్యే దాన్ని. ఆడపిల్లలు నల్లమోగం బెట్టుకుని, బొయ్యేటోల్లు. గిన్ని జేసి శివారు గాల్లదగ్గరికి ఎందుకు బోతనే? కొడుకే కొరివైండు, ఇగ అల్లుడు కొడుకయితడానే?' అంటుంది ముసలామె.
'మరయితే నీకీ ముచ్చట ఎరికేనో లేదోనో గనీ.. పంచిన ఆస్తి సుత వెనక్కి తీసుకోవచ్చటగదానే పెద్దాయి. కొత్తగా కోర్టులో ఏదో తీర్పచ్చిందట మొన్న మా పెద్దోడు పేపర్ల సదివి సెప్పిండు. ఆస్తిదీస్కొని గూడా అవ్వయ్యలని సూడకపోయినా, తిట్లతో అవమానాలు జేసినా సుత ఆస్తి వెనక్కి తీస్కోవచ్చటనే. వాళ్ళ రేషన్‌ కారట సుత తీసేస్తరట. (రేషన్‌ కార్డు) గిసుంటోళ్ళని గిప్పుడు సర్కారు మంచిగ తిక్క కుదురుస్తది. సక్కగ బోరు పోలీసుస్టేషన్ల కేసు పెట్టుపో!' అని సలహా ఇచ్చింది.
ముసలామె చప్పున తలెత్తి 'అట్లెట్ల జేస్త బిడ్డా? ఎపుడు పోతనో తెల్వదు. నేను పట్టకపోతనా? మింగుతనా గా ఆస్తినీ.. నలుగుర్ల తిరిగేటోడు నా కొడుకు. కేసు వెట్టి ముఖం చెల్లకుండ వాని ఇజ్జత్‌ దీస్తనానే?' ఎదురు ప్రశ్నించింది ముసలామె.
ఈ సమాధానం ఊహించక పోవటంతో పక్కన కూర్చున్నామెతో పాటూ నేనూ కూడా ఉలికిపడి, ఒక్కసారిగా అవాక్కయ్యాను.
'ఓసిని గిట్ల అనుకునే దానవు' వానింట్లో పీనిగెల్లా' అని గూడా మస్తు తిట్లు తిడితివి గదానే పెద్దాయి. అయినా వాడు నిన్ను బాజర్ల శెప్పుతో కొడితే పోని వాని ఇజ్జత్‌, పోలీసుస్టేషన్కి బోతేనే బోతదానే? ఏదేమైనా గింత మంచితనం పనికిరాదే' ఓపిక నశించింది కాబోలు మండిపడ్డది పక్కనామే.
'రాలే పండుటాకునే నేనూ.. వానింట్లో గా పీనుగా నేనే గావాలే. గట్లన్నా వాడు నన్ను భుజాల మీదుగా ఊరేగిస్తడు. పిండరూపమైన పిడికెడు మెతుకులు బెడతడు, ఊరంతా నా పేర్న అన్నదానం జేస్తడు, పెద్దకర్మకి అచ్చినోళ్లకి నా పేరు కొట్టిచ్చిన గిన్నెలు, గిలసలూ, ఇగ నాఅసుంటి బీదలకి శద్దర్లు (బెడ్‌ షీట్స్‌) గూడా పంచి పెడతడు' చెప్తూ ఇక ఆపుకోలేక బోరున కన్నీరు పెట్టింది ముసలామె. ఇదంతా చూస్తున్న నా కంటి నుండి కూడా జల జలా కన్నీటిబొట్లు రాలాయి.
ఆమె ఏ సాయమూ ఆశించడం లేదు. కొడుకునీ వొక్క మాట అననివ్వడం లేదు.
'కొడుకు పున్నామ నరకము నుండీ తప్పిస్తాడన్న పిచ్చి కోరికలో, ఏ రోజుకైనా కొడుకు తనను చేెరదీస్తాడనీ, అర్థం చేసుకుంటాడనే మిణుకు మిణుకుమనే చిరు ఆశ వెలుగులో.. కన్నీటిలో తడిచి, తెరిపిన పడిన అవ్వ ముఖం మాత్రం మెరిసిపోతోంది.
మనసారా ఏడ్చిందేమో తేలికపడ్డ మనసుతో పైకి లేచింది. 'పోయ్యోస్త బిడ్డా!' అంటూ కొంగుతో ముఖం తుడుచుకుంటూ ఏదో గొణుక్కుంటూ చెప్పులు లేని పాదాలతో పసిపిల్లల తప్పటడుగుల మాదిరిగా ఒక్కో అడుగు వేస్తూ నడచి వెళ్తుంది. కదిలే ఎముకల గూడులా వుందవ్వ.
కన్నీటితో నిండిన నా కళ్లకు మాత్రం అవ్వ 'కాటికి స్వయంగా నడచి వెళ్లే కట్టె' లాగా అనిపించింది.

పోరాల శారద
sharadad46@gmail.com