అవును. మీరు చదివింది నిజమే. వీటి పేరు కాసరకాయలు. దీనిని కాకరకాయకు మీనియేచర్ అని చెప్పవచ్చు. వీటి శాస్త్రీయ నామం మోమార్డికా సైంబలేరియా. ఇవి కాకర కుటుంబానికి చెందినవే. వీటిని చిన్న కాకర, సన్న కాకర అని కూడా పిలుస్తారు. వీటి మనుగడ చాలా మందికి తెలియదు. కానీ ఇవి వర్షాకాలంలో పొలం గట్ల వెంట సహజసిద్ధంగా పెరుగుతాయి. అంతే సహజంగా నేచురల్ ఇన్సులిన్‌గా పనిచేసే లక్షణం ఈ కాసరలో ఉంది. అనేక వ్యాధులను నివారించే ఔషధ గుణాలను, పోషకాలను కలిగి ఉన్న ఈ కాసర కాయలు నల్లరేగడి భూముల్లో, వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. మరి ఈ పోషక గనిని ఏఏ రుచుల్లో మనం ఆస్వాదించొచ్చో చూద్దామా..
వేపుడు..
కావలసిన పదార్థాలు : కాసర కాయలు-1/2 కేజీ, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-2, నూనె-1/4 కప్పు, కరివేపాకు-2 రెబ్బలు, పసుపు-1/4 స్పూను కారపుపొడి కోసం: ఉప్పు-తగినంత, కారం-స్పూను, జీరా-స్పూను, కొబ్బరిపొడి-2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు-12 (అన్నింటిని మిక్సీ పట్టుకోవాలి)
తయారీ : బాండీలో నూనె వేడయ్యాక పోపు పెట్టి, ఉల్లి తరుగు, కరివేపాకు వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత కాసరకాయలు వెయ్యాలి. ఇవి వేగి రంగు మారిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేయాలి. చివరిగా ముందుగా తయారుచేసుకున్న కారపుపొడి వేసి, రెండు నిమిషాలు వేగనిచ్చి దింపేయాలి.
కూర..
కావలసిన పదార్థాలు : కాసర కాయలు-1/2 కేజీ, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-2, నూనె-1/4 కప్పు, కరివేపాకు-2 రెబ్బలు, ఉప్పు-తగినంత, కారం-స్పూను, పసుపు-1/4 స్పూను, మసాలా ముద్ద.
మసాలా ముద్దకు : ధనియాలు-2 స్పూన్లు, జీర-స్పూను, ఉప్పు, కారం - తగినంత, ఎండుకొబ్బరి- చిప్ప, చింతపండు గుజ్జు - 1/2 కప్పు (వీటన్నింటిని మిక్సీ పట్టుకొని ముద్దగా చేసుకోవాలి)
తయారీ : బాండీలో నూనె వేడిచేసి జీలకర్ర, ఉల్లి తరుగు, కరివేపాకు వేసి నిమిషం పాటు వేయించాలి. చివరలు తీసివేసి,మధ్యలో గాటు పెట్టిన కాసర కాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఉప్పు, కారం, పసుపు వేసి మధ్య మధ్యలో తిప్పుతూ మూతపెట్టి ఉడికించాలి. అంతే కాసరకాయ గుజ్జుకూర రెడీ.
వెల్లుల్లికారం..
కావలసిన పదార్థాలు : కాసర కాయలు-1/2 కేజీ, నూనె-1/4 కేజీ, తాలింపు దినుసులు - తగినన్ని.
పొడి కోసం : చింతపండు- నిమ్మకాయ సైజంత, జీర- 2 స్పూన్లు, ధనియాలు- 4 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు-1/4 కప్పు, కరివేపాకు-2 రెబ్బలు, కారం-1/4 కప్పు, ఉప్పు-1/4 కప్పు, (అన్నింటినీ మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి)
తయారీ : బాండీలో నూనె తీసుకొని వేడయ్యాక కాసర కాయలను మూడొంతుల వరకు వేయించాలి. కాయలను వేరే బౌల్‌లోకి తీసుకొని, అదే నూనెలో ఆవాలు, జీర, ఎండుమిర్చి, చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి, పోపుపెట్టుకోవాలి. బాగా వేగాక వేయించి పక్కన ఉంచిన కాసరకాయలను వేయాలి. వీటిని నిమిషం పాటు వేపాలి. తర్వాత తయారు చేసి పెట్టుకున్న పొడి, ఎండు కొబ్బరిపొడిని చల్లి రెండు నిమిషాలు వేయించి, దించేయాలి.
(రాయలసీమలో కాసర కాయలను నూనెలో వేయించి ఉప్పు, కారం, వెల్లుల్లి మాత్రమే పొడిలా కొట్టి ఫ్రై చేసుకొని, జొన్నరొట్టెకు కాంబినేషన్‌గా చాలా ఇష్టంగా తింటారు.)
నిల్వ పచ్చడి..
కావలసిన పదార్థాలు : కాసర కాయలు-1/2 కేజీ, నూనె-1/4 కేజీ, చింతపండు గుజ్జు-కప్పు, ఉప్పు, కారం-తగినంత, వెల్లుల్లి రెబ్బలు-6, ఆవాలు, మెంతుల పొడి - 3 స్పూన్లు (ఆవాలు-2 స్పూన్లు, మెంతులు-1/2 స్పూను)
తయారీ : బాండీలో నూనె తీసుకొని వేడయ్యాక కాసర కాయలు వేసి దోరగా వేపాలి. కాయలను వేరే బౌల్‌లోకి తీసుకొని, అదే నూనెలో ఆవాలు, జీర, ఎండుమిర్చి, చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి, పోపుపెట్టుకోవాలి. బాగా వేగాక చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి తిప్పుతూ ఉడికించాలి. నూనె తేలేటప్పుడు వేయించి పెట్టుకున్న కాసర కాయలు వేసి, బాగా కలిపి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన కాసరకాయ నిల్వపచ్చడి రెడీ.