ఎన్నో దివ్య ఔషధాల గని కాకరకాయ. రుచి చేదుగా ఉన్నా కాకర చేసే మేలు ఇంతా అంతా కాదు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకర పంటకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు కాకరను కూరలు మాత్రమే చేసుకునేవారు. నేడు అనేక రకాల ఆహార పదార్థాలుగా దీన్ని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకర పంటకు డిమాండ్ పెరుగుతోంది.
నాటిన రెండు నెలల్లో కాపునిచ్చే స్వల్పకాలిక పంట కాకర. పాదుగా పెరిగే కాయలు కాసే కాకరను పొలాల్లో భారీ ఎత్తున పంటలుగా వేసుకోవచ్చు. ఇళ్ల దగ్గర జాగాల్లో, మిద్దె తోటలుగానూ కాకర పాదులు పెంచొచ్చు. కాస్తంత జాగా ఉంటే చాలు పెరట్లోనో, కుండీలోనో పాదులేసుకుని, ఎంచక్కా కాకరకాయలు సొంతంగా పండించుకుని కూర చేసుకోవచ్చు.
పెద్ద పెద్ద పరిమాణంలో కాయలు కాస్తూ, సత్వరం కాపునిచ్చే సరికొత్త హైబ్రీడ్ విత్తనాలూ అందుబాటులోకి వస్తున్నాయి. దీని శాస్త్రీయ నామం మొమోన్షియా కరెన్సీయా, కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన మొక్క ఇది.
కాకర రకాలు..
కోయంబత్తూర్, గ్రీన్, మహికో గ్రీన్, హర్మ హరిత, నల్ల కాకర తెల్ల కాకర, పొట్టి కాకర, బారామాసి, బోడకాకర వంటి రకాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నల్ల కాకర, తెల్ల కాకర సేద్యం చేస్తుంటారు. సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా కాకర పాదులను విత్తుకోవచ్చు. కాకపోతే వర్షాకాలం సీజన్లో విత్తులు నాటిన పాదు బాగా పెరిగి, మెండుగా కాయలు కాస్తుంది. అన్ని నేలల్లో కాకర పాదులు పెరిగినప్పటికీ, ఇసుక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలల్లో కాకర పాదులు బాగా పెరుగుతాయి. మట్టిలో ఉదజని సూచిక 6.0 నుంచి 6.7 వరకూ ఉంటే కాకర పంట బాగా పండుతుంది. క్షార స్వభావ నేలల్లో, మురుగు నీరు నిల్వ ఉండే నేలలోనూ కాకర పంట అంత సరిగా పండదు. ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండే వాతావరణం కాకర పంటకు అనుకూలం. తేమతో కూడిన వేడి వాతావరణం ఈ పాదులకు మరింత అనువుగా ఉంటుంది. నాటిన ఐదు నెలల వరకూ కాకర పాదు బతికి ఉంటుంది.
సాగు ఇలా..
మార్కెట్లో తెచ్చుకున్న విత్తులు గానీ, మనం కాకరపళ్ల నుంచి సేకరించి, ఎండబెట్టి తయారుచేసుకున్న విత్తనాలు గానీ నాటుకోవచ్చు. విత్తులు నాటిన తర్వాత పూర్తిగా నీటితడి అవసరం. వారం నుంచి పది రోజుల్లోపు అంకురం బయలుదేరుతుంది. కాకర పాదు రోజుకొక తీరుగా చకచకా పెరిగిపోతుంది. కుండీల్లో గానీ నేల మీద గానీ పొడవాటి కర్రలు పైన పందిరి సిద్ధం చేసుకోవాలి. 45 రోజుల్లో పాదు ఎగబాకి, అంతా విచ్చుకుని తెలుపు లేదా పసుపు రంగు పూలను పూస్తుంది. మరో పదిహేను రోజుల్లో మొదటి దశ పిందెలు క్రమక్రమంగా కాయలవుతాయి. ఇలా 150 రోజుల పాటు కాకర పాదు కాయలు కాస్తూనే ఉంటుంది. పొలాల్లో కాకర తోటలు వేస్తే, బిందు సేద్యంతో నీరు అందిస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది. కుండీల్లో మిద్దెతోటగా గానీ, ఇళ్ల జాగాలో గానీ పెంచితే కనీసం నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి.
సస్యరక్షణ చర్యలు..
పండు ఈగ అనే రెక్కల పురుగు కాకర పాదులను పూత దశలో, పిందె దశలో ఆశ్రయించి, పిల్లల్ని పెట్టి విపరీతంగా నాశనం చేస్తుంది. ఒక ఎకరా కాకర తోటకి 600 మి.లీ మలాథియాన్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అప్పుడప్పుడు రసం పీల్చే పురుగు కూడా కాకర పాదులను ఆశ్రయించి, ఆకులు తిని పాడుచేస్తాయి. థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు, వేపనూనె ఐదు మిల్లీలీటర్లు చొప్పున లీటరు నీళ్లల్లో కలిపి, పిచికారీ చేయాలి. పాదు మొదటిభాగంలో నీళ్లు ఎక్కువగా ఉంటే, వేరు కుళ్లు తెగులు లేదా ఎండు తెగులు వచ్చి, మొత్తం చనిపోతుంది. దీని నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ లాక్సీక్లోరైడ్ కలిపి, తయారైన మిశ్రమ ద్రావణాన్ని పాదు మొదలుకు కొంత దూరంలో పోయాలి.
ఉపయోగాలు..
కాకరకాయను కూరలు, పచ్చళ్లు, బజ్జీలు, పకోడీ వంటి ఆహారంలో వాడుతున్నారు. మధుమేహం ఉన్నవాళ్లు కాకర రసాన్ని తాగుతున్నారు. కొన్ని ఆయుర్వేద ఔషధాల్లో కాకరకాయలతోపాటు తీగలను, ఆకులను కూడా ఉపయోగిస్తున్నారు. వెజిటబుల్ సలాడ్‌లో కూడా కాకర ముక్కలను వాడుతున్నారు.
కుండీల్లో.. మిద్దె పాదులుగా...
కుండీల్లో మిద్దె పాదుగానీ, పెరట్లో నేలమీద గానీ కాకర పాదు పెంచితే.. ఐదు నెలల సీజన్లో ఐదు నుంచి అరవై కాయలు కాస్తాయి. పొలంలో అయితే ఎకరా పాదు తోటకు 10 నుంచి 12 టన్నుల కాకరకాయల పంట వస్తుంది.
పోషకాలు..
ఇందులో క్యాల్షియం, ప్రొటీన్, పొటాషియం, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, మినరల్స్ లాంటి పోషక ఔషధాలు ఉన్నాయి.