Aug 14,2022 14:41

చల్లని నీడనిచ్చే వృక్షజాతి మొక్క కదంబం. అందమైన పూలను పూసే ఔషధాల గని ఈ మొక్క. నియోలామార్కియా కదంబ దీని శాస్త్రీయ నామం. రూబీయేసీ కుటుంబానికి చెందింది. ఆకులు అండాకారంగా సరళంగా ఉంటాయి. చెట్టు 45 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. చెట్టు చుట్టూతా విస్తృతంగా కొమ్మలు కమ్ముతుంది. వందల సంవత్సరాలు బతుకుతుంది ఈ చెట్టు. సారవంతమైన నేల్లలో మాత్రమే ఈ చెట్టు బాగా పెరుగుతుంది. గండ్ర నేలలు, రాతి నేలలు, జిగురు మట్టి నేలల్లో ఇవి సరిగా పెరగవు. ఇవి పెరగడానికి చుట్టూ విశాలమైన స్థలం కావాలి.
చూడచక్కని పువ్వు
ఆషాడం, శ్రావణ మాసాల్లో కదంబం చెట్లు పూలు పూస్తాయి. ఈ చెట్టుకి పూలే ప్రధాన ఆకర్షణ. మొగ్గగా బయలుదేరిన పువ్వు నిమ్మకాయ పరిమాణంలో ఆకుపచ్చని బంతిలా ఏర్పడుతుంది. ఈ దశలో పువ్వు పచ్చగా నిగనిగలాతూ భలే అందంగా ఉంటుంది. నాలుగైదు రోజుల్లో పసుపు పచ్చగా టెన్నిస్‌ బంతిలా మారుతుంది. మరో వారానికి పువ్వు పూర్తిస్థాయిలో విడుస్తుంది. పూబంతి నిండుగా చిన్నచిన్న తెల్లని కేశరాలు రేకల మాదిరిగా విచ్చుకుంటాయి. పువ్వు చూడ్డానికి అచ్చంగా టెన్నిస్‌బాల్‌లా కనిపిస్తుంది. పువ్వు వడలిపోయే ముందు పండు నారింజ రంగులోకి మారుతుంది. చెట్టు కొమ్మ చివర గుత్తులు గుత్తులుగా పూలు విచ్చుకుంటాయి. ఈ పూలు కోసిన రెండు మూడురోజులు వరకూ వాడిపోకుండా, నిగారింపుగా ఉంటాయి. కదంబ మొక్క చాలా పురాతనమైనది. తెలుగు సాహితీ చరిత్రలో కూడా కదంబ ప్రస్తావన మెండుగానే ఉంది. ఈ మొక్కను నాటిన నాలుగేళ్లకి పూలు పూయడం మొదలవుతుంది. ఈ పూలు తీయటి వాసనలు కమ్ముతాయి. అందువల్లే అనేక రకాల కీటకాలు ఈ పూల సీజన్‌లో చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి.
ఉపయోగాలు..

d


కదంబ చెట్టు ఉపయోగాలు అన్ని ఇన్నీ కావు. వీటి ఆకులను పశువులు బాగా తింటాయి. ఈ చెట్టు కలపను తేలికపాటి కలపగా ఉపయోగిస్తారు. పేపరు, అట్టల తయారీకి ఉపయోగిస్తారు. ప్లైవుడ్‌ తయారీలోనూ ఉపయోగిస్తారు. తేలికపాటి ఫర్నిచర్‌ తయారు చేయడానికి కదంబ కలప ఎంతో శ్రేష్టము. వీటి పూలు అత్తరు తయారీలో ఒక కారకం. రంగుల తయారీలో కదంబ మొక్క ఎక్స్‌ట్రాక్ట్స్‌ను ఉపయోగిస్తారు. రహదారికి ఇరువైపులా నీడ కోసం ఈ చెట్లను పెంచుతున్నారు. వీటి పూలల్లో ఉండే కాయలను ఆయుర్వేదంలో ఔషధాలుగా వాడతారు. జ్వరం, దగ్గు, విరేచనాలు తగ్గడానికి కలబంద చెట్టు అవశేషము మంచి ఔషధము.
అటవీ సమీప ప్రాంతాల్లో నివాసులు కదంబం చెట్టు పుల్లలను పళ్లు తోమడానికి ఉపయోగిస్తారు. నిండుగా కొమ్మలు, ఆకులు కలిగి.. ఎత్తుగా విస్తరించి ఉండే కదంబం చెట్టు చక్కని నీడనే కాదు, చల్లని గాలిని కూడా విస్తారంగా ఇస్తుంది. ఈ మొక్క నాటిన ఏడాది వరకూ నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. రెండేళ్ల తర్వాత భూమి లోపలకి వేళ్లు విస్తరించుకుని, నీళ్లు పోయకపోయినా దానికదే నీటిని సంపాదించుకుంటుంది.
కొత్త రకాలు..
ఇటీవల కాలంలో కదంబం మొక్కల్లో సరికొత్త హైబ్రీడ్‌ రకాలు అందుబాటులోకి వచ్చాయి. నాలుగైదు అడుగుల ఎత్తులో కుండీల్లో కూడా ఈ మొక్కలు పూలు పూస్తున్నాయి. ఎరుపు రంగు పూలు పూసే మొక్కలు కూడా అంటుకట్టడం ద్వారా తయారుచేస్తున్నారు. శ్వేత వయ్యారాలు ఒలకబోసే పొట్టి రకానికి చెందిన తెలుపు కదంబం మొక్కలు కడియం నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. పెద్ద జాగాలు ఉన్న కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, కళాశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు తదితర ప్రదేశాల్లోనూ రహదారికి ఇరువైపులా నీడ కోసం ఈ మొక్కలను నాటుకోవచ్చు. జలాశయాల నుంచి మట్టి కోతకు గురి కాకుండా గట్ల మీద ఈ మొక్కలను నాటుతారు. ఈ చెట్ల కొమ్మల మీద పక్షులు ఎక్కువగా గూడులు అల్లుకుంటాయి. కొమ్మలు గట్టిగా ఉంటాయి. అందుకే వీటికి ఉయ్యాలలు కట్టుకొని ఊగుతుంటారు.
 

చిలుకూరి శ్రీనివాసరావు,
89859 45506