
నలభై మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడిలో ఇప్పటికీ నివృత్తికాని అనేక సందేహాలను ఇటీవల ప్రముఖులు పలువురు ప్రశ్నించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రశ్నించిన వారు సాధారణ వ్యక్తులు కాదు ! వారిలో ఒకరు ఘటన జరిగిన సమయంలో జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్, మరొకరు సైనిక వ్యవహారాలపై పూర్తి పట్టున్న రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ రారు చౌదరి. వారి ప్రశ్నతోనే దేశం యావత్తూ సందేహంలో మునిగిపోయింది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన పూల్వామాలో సైనికుల వాహనాలు వెళుతున్న సమయంలో అనూహ్యంగా వారి వాహనాల మధ్యలోకి వచ్చిన కారు పేలిపోయింది. దేశం యావత్తూ ఆందోళనకు గురిచేసిన ఆ ఘటనలో 40 మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం నిరంతరం పరితపించే సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆ ఘటనపై ఇప్పటికీ అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి సైనికులను తరలించేందుకు విమానం ఇవ్వాలని కోరితే రక్షణశాఖ అంగీకరించలేదనేది సత్యపాల్ మాలిక్ చేసిన అత్యంత విలువైన విమర్శ. దేశంలో విమర్శలు అనేకం చేస్తుంటారు. కానీ విలువైన విమర్శలు కొన్నే ఉంటాయి. వాటిలో సత్యపాల్ చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు యావత్ దేశాన్ని ఒకింత ఆందోళనకు గురిచేశాయనడంతో సందేహం లేదు.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రంపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ మొత్తం మీడియాను పక్కదారి పట్టించే ఘటనలు జరుగుతున్నాయి. అదీ బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లోనే కావడం విశేషం. వరుసగా జరుగుతున్న అనేక అంశాల్లో ఒకే రీతిలో జరుగుతున్న ఘటనలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం పుల్వామాపై మాజీ గవర్నర్ లేవనెత్తిన అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో బహిరంగంగా ఒక డాన్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో మీడియా ఆలోచనంతా పుల్వామా నుండి ఎన్‌కౌంటర్ వైపు మళ్లింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికంటాయని ప్రజలు ఘోషిస్తున్న సమయంలో నేపాల్ వైపు చైనా చొచ్చుకొస్తోందని ఒక రకమైన తీవ్ర ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. కరోనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉగ్రదాడులను ప్రచారం చేశారు. రైతాంగ పోరాటం సాగుతున్న సమయంలో దాన్ని పక్కదారి పట్టించేందుకు పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. రైతాంగ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో మంత్రి కుమారుడు కారుతో రైతులను గుద్దించి చంపారు. దీనిపై చర్చ జరుగుతున్న తరుణంలోనే బుల్డోజర్ వ్యవహారాన్ని నడిపారు. ఆ తర్వాత ఎర్రకోట ఘటన. ఇలా ఒకదాని వెంట ఒకటి నేరపూరిత ఘటనలను ముందుకు తేవడం ద్వారా యావత్ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి ఆలోచనను పక్కదారి పట్టించే చర్యలకు దిగుతున్నారు. పుల్వామాపై పలువురు లేవనెత్తిన సందేహాలను ఇలాగే ఎన్‌కౌంటర్‌తో పక్కదారి పట్టించారు.
ఆ ఘటనపై సందేహాలెన్నో....
పుల్వామాలో ప్రమాదకరమైన రోడ్డుమార్గంలో వందల మంది సైనికులను తరలించడం. నిఘా వైఫల్యం. ఇక్కడ పుల్వామా రహదారి దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డని రికార్డుల్లోనే ఉంది. అటువంటి రోడ్డుపై 2500 మంది సైనికులతో కూడిన 78 వాహనాలను పంపడం. ఒకవేళ సైనికులను పంపాలి అనుకుంటే పూర్తి భద్రత కల్పించాల్సి ఉంది. కానీ సుమారు 250 కిలోలకు పైగా ఆర్‌డిఎక్స్‌ను తీసుకుని ఒక వాహనం దేశంలోకి చొరబడ టం, అది 10 నుండి 15 గ్రామాలను దాటుకుని రావడం నిఘా వ్యవస్థ పనితీరును ప్రశ్నిస్తోంది. నిజంగా నిఘా లేదా? ఆ సమయంలో పని చేయలేదా? అనే సందేహాలను రారు చౌదరి ప్రశ్నించారు. ఒక పథకం ప్రకారం వారిని ఆ మార్గంలో వెళ్లేలా చేశారనే అనుమానాలనూ వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన సమయంలో తాను మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడవద్దని ప్రధాన కార్యాలయం ఆదేశించిందని సత్యపాల్ మాలిక్ చెప్పడం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఈ రెండు ప్రశ్నలూ ప్రభుత్వ ఆలోచనా తీరును బయట పెడుతున్నాయి.
ఎన్నికల సమయంలోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంపై దాడి చేయడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చిన సమయంలో వాటిని పక్కదారి పట్టించే ఎన్‌కౌంటర్లు జరగడం అదీ ఉత్తరప్రదేశ్ లోనే కావడం కీలకం. విమానం అడిగితే ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని సత్యపాల్ మాలిక్ అడిగిన ప్రశ్నతో కేంద్రం పూర్తిగా ఇరుకున పడింది.
- వి. గీతావాణి