Oct 30,2023 22:12

- ఇరుపక్షాల వాదనలు పూర్తి
ప్రజాశక్తి-అమరావతి:స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. దీనిపై మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్‌ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు ప్రకటించారు. మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై వెలువరించే ఆదేశాలకు అనుగుణంగా ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. తన కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వుందని, మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలనే అనుబంధ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిఐడి అధికారులు చంద్రబాబు వైద్య నివేదికలను నివేదించింది. సిఐడి తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వివేకానంద.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను అందజేశారు.
రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. ప్రధాన బెయిలు పిటిషన్‌ తరఫున వాదనలు వినిపించారు. సిఐడి తరఫున అదనపు ఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలకు గడువు కావాలని కోరారు. ఇందుకు అనుమతించిన హైకోర్టు.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించాలని కోరింది. దీంతో మధ్యాహ్నం అదనపు ఎజి వాదించారు. కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ అత్యవసరం కాదన్నారు. మధ్యంతర బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వాదనల తర్వాత మధ్యంతర బెయిల్‌పై తీర్పును మంగళవారం వెలువరిస్తామని హైకోర్టు రిజర్వు చేసింది.