May 29,2023 14:37

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : జర్నలిస్టుల పెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం విశాఖలో పాత్రికేయులు కదంతొక్కారు. ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టుల (ప్రభుత్వ గుర్తింపు పొందిన) అసోసియేషన్‌ల రాష్ట్ర కార్యవర్గాలు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో తొలుత జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీ గా వెళ్లి జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున్‌కు సంయుక్తంగా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్భన్‌ అధ్యక్షుడు పి.నారాయణలు మాట్లాడుతూ జర్నలిస్టుల డిమాండ్స్‌డేను పురస్కరించుకుని రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతిపత్రం కలెక్టర్‌కు అందజేశామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు, వెంటనే కేటాయించాలని, జీవో నెంబర్‌38లో మార్పులు చేసి అర్హులైన వారందరీకీ అక్రిడేషన్‌ సదుపాయం కల్పించాలని, సీనియర్‌ జర్నలిస్టులకు ఫెన్షన్‌ సదుపాయం మంజూరు చేయాలని, ప్రమాదబీమా కార్డులు పునరుద్దరించాలని, జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు అటాక్స్‌ కమిటీలు పునరుద్దరించాలని, కార్మిక బీమా వర్తింపజేయాలని, జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్నీ కమిటీల్లో ఏబీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీబీజేఏ కు ప్రాతినిద్యం కల్పించాలని, మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల అవార్డులు ఇవ్వాలని జర్నలిస్టుల ఆరోగ్య బీమా అమలుపై సమీక్షకు కమిటీని నియమించాలని, తాము వినతిపత్రం ద్వారా కోరామన్నారు. ఆయా అంశాలపై జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని తన పరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించి మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగర అధ్యక్ష పి నారాయణ్‌, ఏపీబీజేఏ విశాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావులు, జి. శ్రీనివాస్‌, ఇతర నేతలు ఎ. సాంబశివరావు, బి. సీతారామమూర్తి, మధు,వై. రామకృష్ణ, ఎన్‌. రామకఅష్ణ మురళీకృష్ణ, కామన్న, సుజాత మూర్తి, రమణమ్మ, చింతా ప్రాన్ప్రభాకరరావు, శివరాం, గోడబ రాంబాబు, సత్యనారాయణ, నాయుడు, రంగధామం కృష్ణమూర్తి నాయుడు, నగేష్‌, పండా ప్రకాష్‌,ఆనంద్‌, కె. వి. శర్మ, రవి శంకర్‌,అంబటి శేషు తదితరులు పాల్గొన్నారు .