Jan 13,2023 07:36

గతంలో పదే పదే హెచ్చరికలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే తమ పట్టణం ఇంతలా విధ్వంసానికి గురవుతోందంటూ జోషీమఠ్‌ బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. దెబ్బతిన్న భవనాల నుండి తక్షణమే తమను తాత్కాలిక షెల్టర్లకు తరలించాలని, నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమను కూడా దేశంలోని 'అభివృద్ధి శరణార్ధుల' జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. ఒకపక్క ప్రజలు తమ ఇళ్ళను, ఆదాయాలను, జీవనోపాధులను కోల్పోతుంటే...మరోపక్క కాంట్రాక్టర్లు, కమర్షియల్‌ ప్రాజెక్టులు మాత్రం విధ్వంసకర అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారు.

ర్యావరణ లేదా సామాజిక సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా చేపట్టే అభివృద్ధి పనులు ప్రగతికి దారి తీయవని... అధికారులను ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోని అధికార యంత్రాంగాన్ని ఒప్పించాలంటే పూర్తిగా విపత్తు జరిగితే కాని వారికి అర్ధమవనట్లు కనిపిస్తోంది. బద్రీనాథ్‌కు ముఖద్వారంలా భావించే పవిత్ర పట్టణమైన జోషీమఠ్‌లో చోటు చేసుకుంటున్న విషాదం, ఉత్తరాఖండ్‌ హిమాలయాల్లో వరుసగా జరుగుతూ వస్తున్న విషాదాలు, విపత్తుల్లో తాజాది. అడ్డూ అదుపులేని నిర్మాణాలు, మౌలిక వసతులు, పట్టణీకరణ వంటి చర్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ లోని పశ్చిమ హిమాలయాల్లో ఇలా మానవ తప్పిదాల కారణంగా సంభవిస్తున్న విపత్తులు ఇటీవల కాలంలో బాగా ఎక్కువవుతున్నాయి. మానవ ప్రేరిత వాతావరణ మార్పులు-భారీగా వర్షాలు పడడం ఫలితంగా వరదలు సంభవించడం, కొండ చరియలు విరిగిపడడం వంటివి-ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
            ఆరు వేల అడుగుల ఎత్తులో వున్న జోషీమఠ్‌లో చాలా చోట్ల నేల కుంగుతుండడంతో పెద్దగా పగుళ్ళు ఏర్పడి ఇళ్ళు, భవనాలు, రోడ్లు బీటలు వారుతున్నాయి. పట్టణంలో దాదాపు నాలుగో వంతు ఇలాగే దెబ్బ తింది. ఇప్పటి వరకు బాగా ప్రభావితమైన నాలుగు జోన్‌లలో 720కి పైగా ఇళ్ళు తీవ్రంగా దెబ్బ తిన్నాయని అంచనా వేశారు. 89 భవనాలను తక్షణమే కూల్చివేసేందుకు గుర్తించారు. ఇవి నివాసయోగ్యతకు అనువుగా లేవని, పైగా వీటివల్ల సమీప భవనాలు కూడా ప్రమాదంలో పడతాయని భావించారు. ఆ 89 భవనాల్లో నివాస భవంతులు, హోటళ్ళు వున్నాయి. వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలినవారు ఈ తరలింపు ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుండగా, గతంలో పదే పదే హెచ్చరికలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే తమ పట్టణం ఇంతలా విధ్వంసానికి గురవుతోందంటూ జోషీమఠ్‌ బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. దెబ్బతిన్న భవనాల నుండి తక్షణమే తమను తాత్కాలిక షెల్టర్లకు తరలించాలని, నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమను కూడా దేశంలోని 'అభివృద్ధి శరణార్ధుల' జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. ఒకపక్క ప్రజలు తమ ఇళ్ళను, ఆదాయాలను, జీవనోపాధులను కోల్పోతుంటే...మరోపక్క కాంట్రాక్టర్లు, కమర్షియల్‌ ప్రాజెక్టులు మాత్రం విధ్వంసకర అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారు. జోషీమఠ్‌ విపత్తు వల్ల దెబ్బతిన్న వారికి, ప్రభుత్వ ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యానికి బాధితులైన వారందరికీ పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలి. తమకు రావాల్సిన వాటి కోసం నిరవధికంగా వేచి వుండే పరిస్థితి లేకుండా తక్షణమే వారికి అందాల్సిన నష్టపరిహారం అందచేయాలి.
            అయితే, సున్నితంగా వుండే పర్వత పర్యావరణ వ్యవస్థను, దాని దుర్బలత్వాలను పరిగణన లోకి తీసుకోకుండా ప్రమాదకరమైన పట్టణీకరణ చర్యలు చేపట్టడం, రహదారులు, జల విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తున్న సమస్యను తప్పనిసరిగా పరిష్కరించాల్సి వుంది. జోషీమఠ్‌ విపత్తు తర్వాత తక్షణ స్పందన చర్యలకు సంబంధించిన నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల సమావేశంలో తీసుకున్నారు. జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ, భారత జియాలాజికల్‌ సర్వే, జాతీయ జల విద్యుత్‌ సంస్థలు గతంలో ఇచ్చిన నివేదికలు, వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియా లజీ పెంచిన ప్రమాద సూచి ఓకలను పట్టించుకోలేదు. దాదాపు 50 ఏళ్ళ క్రితం నాటి ప్రఖ్యాత ఎం.సి.మిశ్రా కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదికతో సహా ఈ సంస్థలు ఇచ్చిన అధ్యయనాల నివేదికలు, ఇతర నిపుణులు ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని, భూకంపాల పరంగా ఈ ప్రాంత దుర్బలత్వాన్ని, ప్రధాన నిర్మాణ కార్యకలాపాల పర్యవసాన ప్రమాదాలను నొక్కి చెప్పాయి. చాలా బలహీనమైన, అస్థిరమైన నేలపై...గతంలో కొండ చరియలు విరిగిపడడం, హిమనదీ ప్రవాహాల వల్ల వదులైన నేలతో కూడిన రాతి ఉపరితలంపై... జోషీమఠ్‌, ఈ ప్రాంతంలోని పలు ఇతర పట్టణాలు నిర్మించబడ్డాయని ఈ నిపుణులు తెలిపారు. దీనివల్ల నివాసితులు, పర్యాటకుల పరంగా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న భారాలను మోసే సామర్ధ్యం పరిమితమవుతోంది. భూకంపాలు వచ్చే జోన్‌-5గా ఈ ప్రాంతాన్ని వర్గీకరించారు. అంటే భూకంపాలు ప్రకంపనలు రావడానికి అత్యధికంగా అవకాశమున్న ప్రాంతంగా గుర్తించారు. దీనికి తోడు, ఈ ప్రాంతంలో బ్లాస్టింగ్‌లు జరపడం, సొరంగాలు తవ్వడం వంటి భారీ నిర్మాణ కార్యకలాపాలతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. పేలవమైన నిర్మాణ ప్రణాళికల కారణంగా సహజసిద్ధమైన నీటి పారుదలకు ఆటంకం ఏర్పడి స్తంభించిపోవడం కూడా ఈ ప్రాంత అస్థిరతకు, కొండచరియలు ఎక్కువగా విరిగి పడేందుకు కారణమైంది. ఫలితంగా, జోషీమఠ్‌ ప్రాంతం ఏడాదికి 6.5 సెంటీమీటర్లు చొప్పున కుంగుతోందని ఉపగ్రహ డేటా వెల్లడిస్తోంది.
            ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి దీన్ని ప్రకృతి విపత్తుగా అభివర్ణిస్తూ, తప్పుదారి పట్టిస్తున్నారు. కాగా మరోవైపు, ఎన్‌టిపిసి చేపట్టిన తపో వన్‌-విష్ణుగఢ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాల్లో భాగంగా చేపట్టిన సొరంగం పట్టణానికి, జోషీమఠ్‌-బద్రీనాథ్‌ హైవే కి దగ్గరగా వుంది. అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దీన్ని నిలిపివేశారు. ఈ ప్రాంతంలో పేలుళ్ళను నిషేధించారు. కానీ వివిధ నిర్మాణ ప్రాంతాల్లో బ్లాస్టింగ్‌ షెడ్యూళ్ళను ప్రకటించే సైన్‌ బోర్డులను స్థానికులు ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పటికీ, నిర్మాణాలపై నిషేధం వున్నప్పటికీ, ఎలాంటి పర్యవేక్షణ లేకపోతే, ఏదో కొంత నిర్మాణ కార్యకలాపాలు ఆ ఏరియాలో కొనసాగుతూనే వుంటాయని టి.వి చానెళ్లు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా నియంత్రణ లేకపోవడం, నిబంధనల అమలు లేకపోవడం అనేది ఈ ప్రాంతంలోని మౌలిక నిర్మాణ కార్యకలాపాలన్నిట్లో కనిపిస్తుంది. ప్రధాన పుణ్యక్షేత్రాలతో కలిపే ప్రసిద్ధ చార్‌ధామ్‌ హైవేను విస్తరించడానికి సుప్రీం కోర్టు అనుమతించింది. దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. ఆ కార్యకలాపాలపై ఎలాంటి నియంత్రణలు విధించలేదు. 'ఎలాంటి మూల్యాన్ని చెల్లించైనా అభివృద్ధిని సాధించాలనే' ఈ వైఖరికి జోషీమఠ్‌ ఈనాడు మూల్యాన్ని చెల్లిస్తోంది.
         జోషీమఠ్‌ లోని ఇతర ప్రాంతాల్లో కూడా రాబోయే నెలలు, సంవత్సరాల్లో ఇలా నేల కుంగుబాటుకు గురయ్యే అవకాశం వుంది. ఈ ప్రాంతంలోని ఇతర పట్టణాలు, ప్రాంతాలు కూడా ఇలాగే దుర్బలంగా వున్నాయి. రుద్రప్రయాగ్‌ లోయలో కూడా ఇప్పటికే ఇళ్ళకు, ఇతర భవనాలకు పెద్ద పెద్ద పగుళ్లు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
         ప్రస్తుతం జోషీమఠ్‌ విపత్తును ఎదుర్కొనడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నా దానికన్నా ముందుగా దుర్బలమైన పశ్చిమ హిమాలయాల పర్వత సానువుల్లో మౌలిక వసతులు, ఇతర నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమీక్ష జరగాల్సి వుంది. స్థానికులకు, పర్యాటకులకు జరిగే ప్రమాదాన్ని కనీస స్థాయికి తగ్గిస్తూ పర్యావరణపరంగా సున్నితమైన అభివృద్ధిని సాధించే దిశగా బాగా ఆలోచించిన మార్గాన్ని అనుసరించాల్సి వుంది.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)