
అచ్ఛే దిన్ ఆయేగా, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అమృత్ కాల్... ఇలా మోడీ సర్కారు నినాదాలకు కొదవ లేదు. మంచిరోజులన్నీ అదానీ, అంబానీలకే వచ్చాయని ఇప్పటికే జనం నిర్ణయానికి వచ్చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సంగతి సరే!, ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులైనా భర్తీ చేయండి మహాప్రభో అని యువత ఘోషిస్తున్నది.
దేశంలో నిరుద్యోగ రేటు 7.5 శాతానికి పెరిగిపోయింది. పట్టణాల్లో 8.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7 శాతం ఉందని సిఎంఐఇ నివేదిక తాజాగా వెల్లడించింది. దేశంలో నిరుద్యోగులకు ఆశాకిరణంలా ఉండే రైల్వే ఖాళీలను భర్తీ చేయకుండా తొక్కిపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మూడు లక్షల 15 వేల 780 ఖాళీలున్నట్లు భారత రైల్వే మంత్రిత్వశాఖ తాజా గణాంకాలే చెబుతున్నాయి. గత మూడేళ్లలో 1,41,886 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కేటగిరీల్లో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు సైతం 18,670 ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది మార్చి 1 నాటికి దేశంలో 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తెలిపింది. గత ఏడాది చివరి నాటికి రైల్వే, హోం వ్యవహారాల్లో 1.4 లక్షల ఉద్యోగాలు, సివిల్ డిఫెన్స్‌లో 2.6 లక్షల ఉద్యోగాలు, తపాలా శాఖలో 90 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అగ్నివీర్ నియామకాల పేరుతో ఆర్మీ ఉద్యోగాలను సైతం నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతికి దిగజార్చారు. నయా ఉదారవాద విధానాలు అనుసరిస్తూ అదానీ, అంబానీలలాంటి దేశ, విదేశీ కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ సర్కారుకు దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగిత గురించి ఏమాత్రం ఫికర్ లేదు.
దేశంలో వినియోగవ్యయం తదితర అంశాలపై గణాంకాలు 2011-12 నుంచి అందుబాట్లో లేవు. 2017-18లో సేకరించిన వివరాలను సైతం విడుదల చేయకుండా కేంద్రం తొక్కిపట్టింది. ఉపాధికి సంబంధించిన గణాంకాల సేకరణకు అనుసరించే పద్ధతికి తిలోదకాలు ఇచ్చేసింది. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) అందించిన వివరాల ప్రకారం 2011-12 నుంచి 2017-18 మధ్య గ్రామీణ భారతదేశంలో తలసరి వాస్తవ నెలవారీ వ్యయంలో తొమ్మిది శాతం క్షీణత నెలకొంది. మన ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న, ప్రముఖ ఆర్థిక నిపుణులతో కూడిన ప్రయివేటు సంస్థ సిఎంఐఇ నివేదికలే ఆధారం. ఆ సంస్థ గొంతునొక్కేందుకు కేంద్రం యత్నిస్తోంది. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత నాలుగేళ్లలో 10.25 లక్షల కొత్త ఉద్యోగాలే లభించాయి. అంటే ఏటా 0.3 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. ఇది జనాభా పెరుగుదల రేటుతో పోలిస్తే చాలా తక్కువ. నిరుద్యోగుల సంఖ్య ఏటా 1.2 కోట్ల మేర పెరుగుతుందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 2019 మార్చిలో 42.7 శాతంగా ఉన్న కార్మిక భాగస్వామ్య రేటు గత నెల నాటికి 39.8 శాతానికి దిగజారింది. వేతనాలు తక్కువ, ఉద్యోగ భద్రత లేకుండా పోవడంతో మహిళలు ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కోవడం తగ్గించారు. నిర్మాణ రంగంలో లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. రిటైల్ వ్యాపారంలోనూ ఇదే పరిస్థితి. ఫిబ్రవరి, మార్చి మధ్య 80 లక్షల మంది రోడ్డునపడ్డారు. కాయకష్టం చేసే వారి పరిస్థితి గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చినప్పుడు బడ్జెట్‌లో నాలుగుశాతం నిధులు కేటాయిస్తే, మోడీ ఏలుబడిలో ఈ ఏడాది కేటాయింపులు 1.3 శాతానికి పడిపోయాయి. గత ఏడాది బడ్జెట్‌లో రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.1.97 లక్షల కోట్లకు నిధులు తగ్గించారు. అంటే ఏడాదిలోనే రూ.90 వేల కోట్లు తెగ్గోశారు. కీలకమైన ప్రజా సమస్యలను పక్కదారిపట్టించేందుకు మతతత్వ అజెండాను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు తెస్తున్నాయి.
మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక, జాతి వ్యతిరేక విధానాలపై గత వారం ఢిల్లీలో జరిగిన కిసాన్, మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీ స్పష్టమైన హెచ్చరిక చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి రైల్వేల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ఆ దిశగా ఒత్తిడి పెంచేందుకు ప్రజాపోరాటాలను ఉధృతం చేయడమొక్కటే మార్గం.