Jul 13,2022 07:00

      దేశంలో 2047 నాటికి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉండకూడదని నీతి ఆయోగ్‌ చెపుతోంది. అంటే 75 ఏళ్ల నుంచీ దేశాన్ని నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ వచ్చే 25 ఏళ్లలో కార్పొరేట్లకు అప్పచెప్పబోతున్నారని అర్థం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం నిరుద్యోగం, పేదరికం లేదా దివాలా కారణంగా 2019లో ప్రతి గంటకు ఒక భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. 2018-2020 మధ్య దాదాపు 25,000 మంది భారతీయులు ఆత్మహత్యలతో మరణించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది.
     ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీలేదు. కరోనా మహమ్మారి సమయంలో నియమించబడిన 2,000 మంది కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తల (నర్సులు, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, పారామెడికల్‌ సిబ్బంది) సేవలను, హర్యానా ప్రభుత్వం 2022 మే నెలలో రద్దు చేసింది. ఢిల్లీలో సైతం వందలాది మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లను యాజమాన్యాలు ఉద్యోగాల నుండి తొలగించాయి. ఒకరకంగా చెప్పాలంటే... వారి సేవలకు కృతజ్ఞతగా అవసరం తీరిపోగానే వారిని ఆయా ఉద్యోగాల నుండి తొలగించారు.
     దీనికి తోడు అస్సాం రాష్ట్రంలో 8,300 మందికి పైగా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి కాంట్రాక్టు సిబ్బంది ఫిబ్రవరి 2022లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గడచిన 12 నుండి 14 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నామని, తమకు ఎటువంటి బోనస్‌లు, అలవెన్స్‌లు, పెన్షన్‌ లేదా పే రివిజన్లు ఇవ్వలేదని తెలియజేశారు. ఏప్రిల్‌ 2022లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర విద్యుత్‌శాఖకు చెందిన దాదాపు 200 మంది కాంట్రాక్టు కార్మికుల నిరసనలపై దాడి చేసి...లాఠీలతో చితక బాది అరెస్టులు చేశారు. వారంతా ప్రజా సేవకులనే (పబ్లిక్‌ సర్వెంట్‌) ఇంగిత జ్ఞానాన్ని కూడా ప్రభుత్వాలు మరచిపోయాయి.
     ప్రభుత్వంలో ఏర్పడుతున్న ఖాళీలను తగినంత వేగంతో భర్తీ చేయడంలేదు. జులై 2021 నాటికి వివిధ స్థాయిల్లో ప్రభుత్వంలో 60 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 9.1 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వంలో ఉండగా, దాదాపు 2 లక్షల ఖాళీలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. అదనంగా రాష్ట్రాల పోలీసు శాఖలలో 5.3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 8.3 లక్షల ఖాళీలు ఉండగా మిగతాది ఇతర శాఖల్లో ఉన్నాయనేది ఒక అంచనా.
    ఇందులో అప్పుడప్పుడూ భర్తీ చేస్తున్న ఖాళీలు కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే చేయబడుతున్నాయి. 2014లో జరిపిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు దాదాపు 43 శాతం (సుమారు ఒక కోటి ఇరవైమూడు లక్షలమంది) తాత్కాలిక లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన జరిపినవే. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఇండిస్టీ రీసెర్చ్‌ - 2014 రిపోర్ట్‌ ప్రకారం దాదాపు 69 లక్షల మంది, ఎటువంటి సామాజిక భద్రత లేకుండా, కీలకమైన ముఖ్య సంక్షేమ పథకాలలో (ఉదాహరణకు అంగన్‌వాడీ వర్కర్లు) తక్కువ వేతనాలతో (కొన్ని సందర్భాల్లో కనీస వేతనం కంటే తక్కువ వేతనాలతో) పనిచేస్తున్నారు. 2018 నాటికి ఈ కేటగిరిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 59శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో పనిజేస్తున్న కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల వాటా 19 శాతం నుండి 37 శాతానికి పెరిగింది. పెర్మినెంట్‌ ఉద్యోగుల వాటా 25 శాతానికి తగ్గిపోయింది. ఉదాహరణకు ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)లో మార్చి 2020 నాటికి దాని సిబ్బందిలో 81 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులే. కొన్ని రాష్ట్రాలు దీనిని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాయి. 2020లో సంభవించిన కోవిడ్‌ మహమ్మారి పెద్ద ఎత్తున నిరుద్యోగానికి దారితీసింది. 2013లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన జడ్జిమెంట్‌ ప్రకారం... ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ప్రభుత్వ సర్వెంట్‌ (గవర్నమెంట్‌ సర్వెంట్‌) కాదు.
     భారతీయ ప్రభుత్వ రంగం కూడా చైనా లోని ప్రభుత్వరంగ సంస్థలకు మించి లేదా వాటికంటే గొప్పగా, సమర్థవంతంగా పనిచేయగలదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు రానురాను గత వైభవాన్ని కోల్పోతున్నాయి. ప్రతిభావంతులను, మేధావులను, ప్రభుత్వరంగంవైపు ఆకర్షించాలి. మన ప్రభుత్వరంగంలో ఎక్కువ మంది వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవసరం.
     రెండవ పంచవర్ష ప్రణాళికలో (1956-61), పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా, ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేశారు. రోడ్డు, రవాణా, విద్యుత్‌, ఉక్కు, స్టీల్‌ కర్మాగారాలు, బొగ్గు గనులు, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం, పోర్టులు, ఇలా అనేకం ప్రభుత్వ రంగంలో ఏర్పడ్డాయి. ఇది మన దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. అంతేకాదు...దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు తోడ్పడింది. దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసింది. కానీ 1990 తర్వాత, నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా, సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాల వలన... ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను, కార్పొరేట్ల చేతికి అప్పగించి, వాటిని నిర్వీర్యం చేయటానికి కేంద్ర ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలంటూ లేవు. మళ్ళీ మన దేశం పూర్వ వైభవం సాధించాలంటే, సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే... యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే... ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయటమొక్కటే మార్గం. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తు సేవల ఉత్పత్తికి తగ్గ డిమాండు ఏర్పడుతుంది. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాలు కలసికట్టుగా ఉద్యమాలను నిర్మించి, దేశ ప్రజానీకం మద్దతును కూడగట్టి, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి. అదే ఇప్పుడు... దేశ కార్మికవర్గం ముందున్న ప్రధాన కర్తవ్యం.

వ్యాసకర్త సెల్‌: 7382099838
డా|| చిలకలపూడి కళాధర్‌

డా|| చిలకలపూడి కళాధర్‌