Dec 06,2022 07:40

            కంటిపై కునుకు లేకుండా స్వల్ప జీతాలతో దినదినగండంగా అస్తుబిస్తు బతుకీడుస్తున్న ఔట్‌సోర్స్‌ ఉద్యోగులను మొత్తానికే ఇంటికి సాగనంపే కర్కశానికి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్శిటీలు, పలు సర్కారీ స్కీముల్లో రెండున్నర లక్షల మంది ఔట్‌సోర్స్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. అందరిపైనా ఒకేసారి వేటు వేస్తే మొదటికే మోసం వస్తుందని తలంచి, దఫదఫాలుగా కత్తి ఝళిపించాలనుకున్నట్లుంది. మొదటి విడతలో పదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులను ఉన్నపళాన ఉద్యోగం నుంచి బయటికి గెంటేస్తూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ వర్క్స్‌, అకౌంట్స్‌ డిపార్టుమెంట్‌ కాన్ఫిడెన్షియల్‌ ఆదేశాలిచ్చింది. చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం కావడంతో ఔట్‌సోర్స్‌ ఉద్యోగుల్లో ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. పదేళ్లకుపైన సర్వీసు కలిగిన వారిని పర్మినెంట్‌ చేస్తారన్న ఊహాగానాలు ఉండగా, ఇప్పుడిలా జరగడంతో తమ భవితవ్యం ఏమవుతుందోనని బెంబేలెత్తుతున్నారు.
            ఔట్‌సోర్స్‌, కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్నది ఆధునిక వెట్టి. నయా-ఉదార విధానాలు శాసించినట్లు ప్రభుత్వాలు కొన్నేళ్లుగా శాశ్వత నియామకాలు చేపట్టట్లేదు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ ఉద్యోగులు అవసరమయ్యారు. ప్రభుత్వం నడిచేది వారిపైనే. ఎన్నెన్నో పోరాటాలు చేస్తేగాని ఇప్పటికి వారు పొందుతున్నది నెలకు రూ.16 వేల నుంచి 23 వేలు. ఉద్యోగ భద్రత, ఇతర బెనిఫిట్లు నాస్తి. రెగ్యులర్‌, తాత్కాలిక ఉద్యోగులు చేసేది ఒకే తరహా పని. టెంపరరీ ఉద్యోగులపైనే పని భారం అత్యధికం. వీరి ఆందోళనలపై నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌, ఔట్‌సోర్స్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి-సమాన వేతనం అమలు చేసి న్యాయం చేస్తామని, ఏ ఒక్కరినీ తొలగించబోమని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలకే మంగళం పాడేందుకు ఏకంగా ఉత్తర్వులిచ్చింది ఆయన సర్కారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో ఆందోళన మొదలుకావడంతో ముఖ్యమంత్రికి తెలీకుండా ఆ ఉత్తర్వులొచ్చాయని, ఆయన ఆగ్రహం వ్యక్తపర్చారనీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాకు చెప్పారు. అయితే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులెవరినీ తొలగించబోమని మాత్రం ఆయన చెప్పలేదు. మరో వైపు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కొన్ని శాఖల్లో పనిలేని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుంటే వారికి మాత్రమే ఆ ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఉత్తర్వుల ఉపసంహరణ జరగలేదు కనక ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి వెల్లడిస్తేనే స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
         విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధి రహిత రాష్ట్రమైంది. చదువుకున్న యువత ఉపాధికి దిక్కులు చూస్తోంది. పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నరు, ముంబయిలకు వలస బాట పట్టింది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి పట్టణాన్నీ ఒక్కొక్క మహానగరం చేస్తామని ఎన్నికల ముందు వైసిపి ఇచ్చిన హామీ ఆచరణకు రాలేదు. కేంద్ర బిజెపి హోదాను ముగిసిన అధ్యాయంగా కొట్టి పారేసినా వైసిపి ప్రభుత్వంలో చలనం లేదు. తామొస్తే ప్రతి ఏడాదీ జనవరి ఒకటిన జాబ్‌ కేలండర్‌ అనగా మూడున్నరేళ్లలో ఒక కేలండర్‌ అదీ పది వేల పోస్టులకు విడుదలైంది. ఇంకా రిక్రూట్‌మెంట్‌ బాలారిష్టాలు దాటలేదు. ప్రభుత్వంలో రెండు లక్షల ఖాళీలున్నా రిక్రూట్‌మెంట్‌ చేపట్టట్లేదు. 'సచివాలయ' ఉద్యోగాలనే గొప్పగా చెబుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీల దోపిడీ నుంచి కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ వారిని కాపాడేందుకంటూ 'ఆప్కాస్‌'ను తెచ్చిన సర్కారు, ఇప్పుడు ఇలా వ్యవహరించడం తగదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఔట్‌సోర్స్‌ ఉద్యోగులను ఇంటికి పంపే అన్ని ప్రయత్నాలూ మానుకోవాలి. ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని వారి ఉద్యోగ భద్రతపై స్పష్టంగా ప్రకటించడం దాని ధర్మం.