Feb 05,2023 08:29

జీవితంలో బాధలు ఎన్ని ఉన్నా ఏదైనా హాస్యాస్పదమైన సంఘటన జరిగితే బాధలను పక్కన పెట్టి మనసారా నవ్వుకుంటాము. మనసు కూడా తేెలికపడుతుంది. అలాంటి కథల పరిచయమే కామెడీ కథల పుస్తకం. పోట్లూరు సుబ్రహ్మణ్యంగారు జీవిత సారాంశాన్ని తెలియజేసే చక్కని కథలను ఈ పుస్తకం ద్వారా అందజేశారు. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే సంఘటనలే ఇందులో కనబడతాయి. మనం అనుకున్నవారి ఇంటికి వెళ్లి వాళ్లు వండిన పంచభక్య్షపరమాన్నాలు వండి వడ్డిస్తే .. అనారోగ్య సమస్యలతో వాటిని తినడం ఎంత కష్టమో 'సకళ కళావళ్లభుడు' కథను బట్టి అర్థమవుతోంది. నేటి కాలంలో ఎన్ని ఎదురుగా ఉన్నా తినడానికి ఎన్నో దీర్ఘకాలిక రోగాలు అడ్డమొస్తున్నాయి. మనం మనవారితోనే కాకుండా మనం పెంచుకొనే జంతువులతోను ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. కుక్కలనైతే బాగానే ఉంటుంది గాని కోతులను పెంచుకోడం కొంచెం అరుదుగానే కనపడుతుంది. మనిషికి, వానరునికి మధ్య తండ్రి బిడ్డల బంధంతో పోల్చడమే కాక ఇద్దరి మధ్య కీచులాటను చక్కగా 'వీరాంజనేయులు, రామాంజనేయులు' కథ రాశారు. ఎన్నో ఏళ్ల తర్వాత మన పాత స్నేహితుడినించి ఆహ్వానం వస్తే వెంటనే పూర్వజ్ఞాపకాలు జ్ఞప్తికి వస్తాయి. అలాంటిదే 'కమలహాసన్‌ దువ్వెన' కథ. స్వరాన్ని విని మనసు పడి అమ్మాయనుకొని బామ్మను ప్రేమించిన పిచ్చేశ్వరరావు తన 'కలలరాణి' కాదని వాపోయిన హాస్యాస్పదమైనదే ఈ కథ. కప్పల బెకబెకలను అసహ్యించుకునే ఊరివారే వాటిని పెంచుతూ సంపాదనను పెంచుకున్న కథే 'కప్పలు'. గురక పెట్టేవాళ్లు ఎక్కడికైనా వెళ్లినప్పుడు నిద్రకు ఉపక్రమించాలంటే సిగ్గుతో ఎంతగా నలిగిపోతారో.. అదే గురకను మెచ్చుకునే వారు ఉంటే ఆ ఆనందానికి అవధులు లేకుండా పోయే కథే 'ఉండమ్మా! బొట్టుపెడతా!'. చిల్లర కోసం బస్సు కండక్టర్‌తో గొడవ పడి తీరా చిల్లర వచ్చిందని ఆనందపడినంతసేపు లేకుండా తన డబ్బు చెల్లదని తెలిసి నీరుగారిపోయిన వారు మన మధ్యా ఉంటుంటారు. ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లింపులు వచ్చి కాస్త ఊరట పొందుతున్నాము గాని కొన్నేళ్ల కిందట సమయానికి చిల్లర డబ్బులు లేకుంటే పడే కష్టాల సారాంశమే 'పప్పులో కాలు-కప్పులో పాలు' కథ. దెయ్యాలున్నాయంటూ భయపెట్టినా వినకుండా దిగిన శంకరయ్య.. దెయ్యం కాదు తన బాధను ఎలా చెప్పుకోవాలో తెలియక దెయ్యం పూనినట్లు నటించిన మహిళ అని తెలిసి ఆమెను మార్చి అనాథైన తనకు తోడు చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అంతే కాక దెయ్యం పట్టిందన్న వారికి తనదైన శైలిలో దెయ్యాలను ఒదిలిస్తూ .. దెయ్యాల భూత వైద్యుడిగా స్థిరపడి ఎవరినీ నొప్పించకుండా తన జీవితాన్ని సాఫీగా గడిపిన 'నరబలికోరిన నారి' శంకరయ్య కథ చాలా బాగుంది. ఎవరైనా టిక్కెట్టు లేకుండా ట్రైన్‌లో ప్రయాణిస్తే ఫైన్‌ వేసే నిజాయితీ గల ఒక రైల్వే టిటిఇ అనుకోని సందర్భంలో రైల్లోకి చొరబడి కొంత దూరం ప్రయాణించి దిగిపోయిన ఒక చిరుతపులికి సైతం టిక్కెట్టు డబ్బులు తన పర్సునుంచి తీసి కట్టి తన నిజాయితీని నిరూపించుకున్న కథే 'పులిరాజు'. బుల్లబ్బాయికి పెళ్లే కాదంటూ హేళన చేసిన ఊరివారే శిల్పాశెట్టిలాంటి అమ్మాయి పెళ్లాంగా రాబోతుందని తెలిసి ఘనసన్మానం చేసిన కథే 'బుల్ల్లెబ్బాయి పెళ్లి'. నెలజీతం రాగానే రారాజుగా జల్సాలు చేస్తే నెలాఖరు వచ్చేసరికి వారి జీవితము ఎంత భారమో.. అసలు ఒక నెలంతా జీతం రాకపోతే జీవనం ఎంత దుర్భరమో తెలిపే కథే 'జీతం-జీవితం'. ముగ్గురిలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు బెటర్‌ అనుకున్న లెక్చరర్‌ అనంత్‌కు.. ఆ ముగ్గురూ కలసి అన్నీ బెటర్‌గా ఉన్నవారినే పెళ్లి చేసుకోవాలని అతని వద్ద సెలవుతీసుకున్న ముగ్గురు శిష్యురాళ్ల కథే 'రంభా-ఊర్వశి-మేనక'. ఆస్తులు తెగనమ్మేసి తమ దగ్గరకు రమ్మన్న బిడ్డల దగ్గరకు వెళ్లాలని పట్టుబట్టిన భార్య నాగరత్నమ్మకు సరే అని చెప్పిన భర్త మధుసూదనరావు మనసులో మాత్రం తెలియని బాధ మొదలవడంతో అనారోగ్యానికి గురై ఆస్తులు అమ్మక్కర్లేదనే సరికి లేచి కూర్చున్న కథే 'వడదెబ్బ'.
మన సంప్రదాయాలను, సంస్కృతులను తెలిపే హరిదాసులు లేటెస్ట్‌ అప్‌డేట్‌ అంటూ టెక్నాలజీ కథలు చెబితే జరిగే నష్టం గురించి తెలిపేదే 'బాలహరిదాసు' కథ . ఒకరికి నీతులు చెప్పే మిత్రులు వారేంటో తెలుసుకోకుంటే దానిపై విసిగిన వారు వారిరువురి మధ్య చిచ్చురేపి చోద్యం చూసిన కథే 'శ్రీరంగనీతులు చెప్పొద్దు'. ఎందరో ఆరాధిస్తున్నా వారందరినీ కాదని తనను ఎంతగానో ప్రేమిస్తున్న శ్యాంసుందర్‌కు సొంతమైన వసంత కథే 'అంకిత'. ఇప్పుడంటే మనకు వార్తలు తెలుసుకోడానికి ఏం కష్టపడనవసరం లేదు. ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా అంటూ ఏదైనా సమాచారం నిమిషాల్లో మనందరికీ చేరుతుంది. కానీ ఒకప్పుడు న్యూస్‌ పేపర్‌లో వచ్చే వార్తల కోసం ఉదయమే లేచి, వాటిని చదివి నలుగురికీ వినిపించేవారు. ఆ నలుగురూ సమాచారం తెలుసుకోడానికి ఎంతో అసక్తి చూపేవారు. దానిపై చర్చలూ జరిగేవి.. ఇలాంటి హాస్య కథలపై చతురోక్తులూ సాగేవి. హాస్యంలోనే ఎంతో జీవితముందని మరిన్ని కథలు కలిగిన ఈ పుస్తకాన్ని రచయిత చక్కని సరళితో రాశారు.0

సిహెచ్‌ సాయిలక్ష్మి
75697 44709