తడిసిన ఇసుకబస్తా జీవితం
సునాయాసంగా బరువు
భుజాల కెత్తుకోవాలని
కుస్తీ పడుతుంటే
ఇసుకమట్టి ఉండను
దొర్లిస్తున్న ఓ పేడపురుగు..
నన్నుచూసి నవ్వుకుంటుంది!
మనిషి లక్షల సంవత్సరాలుగా
ప్రయాణం చేసి..
గగనపు అంచుల్లో తేలియాడే..
పిట్ట ఈక ముందు ఓడిపోతాడు!
కాకి గూడు అందంగా అల్లుకున్నట్టు
చిటారుకు ఎగబాకాలని
చింతన పరుడై..
కల్లోల సముద్రమైపోతాడు!
కాలం గాలాన్ని లాక్కుపోదామని
ప్రతిసారి భంగపాటు తెలుసుకోడు
తప్పదు లొంగుబాటని!
జీవితపు గడుల్లో ఎప్పటికప్పుడు
పాచికలు గెలుపోటముల నిర్ణాయక
శాసన కర్తలవుతాయి..యిలా కావాలి..
అనుకుంటాం గానీ మన చేతిలోని తాడు
ఒక్కోసారి మనకే చుట్టుకుంటుంది
మనల్ని మనం ప్రేమించుకుంటామా!
అయినాసరే...
తడిసిన ఇసుకబస్తా జీవితం కిందపడి
సమాధి మీద.. మరణ తేదీ ఫలకమై
అప్పుడప్పుడు ఎవరి జ్ఞాపకాల్లోంచో..
చటుక్కున తప్పిపోతాం..!
రత్నాజీ నేలపూరి
89199 98753