మోసగాళ్ల నటనలు...
ఆదమరుపుగా ఉంటే
జీవితాల్ని కాటేస్తాయి,
నమ్మితే వ్యక్తిత్వాల్ని కాజేస్తాయి.
జీవిత రంగస్థలాన..
అద్భుత నటనా చాతుర్యంతో,
అతిశయోక్తులతో
మోసగించే పాత్రలే
అడుగడుగునా..
కల్మష పవనాలను
మనసునిండా నింపుకొని
ప్రేమల పరిమళాలతో
మాయ చేస్తుంటాయి కొన్ని.
మరికొన్ని నమ్రత నీడల్లో
నక్కజిత్తులు వేస్తుంటాయి.
పెదవంచుల నుండి
మాటలతేనె జాలువారుస్తూ
పచ్చగడ్డి మాటున
దాగిన కంటకాల్లా
మెత్తటి పాదాలకు నులివెచ్చటి
రుధిరం అద్దుతాయి ఇంకొన్ని.
ఆత్మీయ పలకరింపుల
మాటున మెచ్చుకోలు కరచాలనాల చాటున మోసాలు
పురుడోసుకుంటూనే ఉంటాయి.
ఓ మనిషీ!
జీవితమే ఓ రంగస్థలం.
ఆశల పొలంలో విత్తుకొన్న
కోర్కెల సశ్యానికై
వెతల యంత్రాల్లో ఇరుక్కొని
దగా చక్రంలో ముక్కలు కాకు.
పలికేమాట, చూసే చూపు
ఆత్మీయతా రాగమై అల్లుకోవాలి.
ఎవరికీ చెడుచేయక
సద్భావాలతో ముత్యమై మెరవాలి.
- వేమూరి శ్రీనివాస్
99121 28967