జీవించడం అంటే నిండా నూరేళ్లు
నిస్సారంగా నిర్జీవంగా నిర్లిప్తంగా
గొంగళి పురుగులా బతికేయడం కాదు
అందమైన సీతాకోకచిలుకలా
జ్ఞాపకాల పూలతోటలో
అనుభవాల పరిమళాలను
ఆస్వాదిస్తూ ఎన్ని క్షణాలు గడిపామన్నదే
జీవించడం అంటే ప్రతిక్షణం లాభనష్టాలు
లెక్క చూసుకుంటూ జేబుల నిండా
చిల్లర నాణాలు పోగేయటం కాదు
కష్టాలు కన్నీళ్ళకు ఎదురీదేవారికి
అండగా నిలబడి ఉన్నదేదో కాస్తైనా
అందరితో కలసి పంచుకుంటూ
ఎన్ని మనసులు గెలుచుకున్నామన్నదే
జీవించడం అంటే రంగు తెలియని
ఊహలోకాల్లో విహరిస్తూ త్రిశంకు స్వర్గంలో
మేడలు కట్టుకుని
ఒంటరిగా బతికేయడం కాదు
సంతోషాల రంగులలో ముంచిన చిరునవ్వుల
కుంచెలతో గుండె గోడలపై ఎన్ని అందమైన
చిత్తరువులను చిత్రీకరించుకున్నామన్నదే
జీవించడం అంటే చేతివేళ్ళ సందుల్లోంచి
జారిపోయే మంచు ముద్దల్లాంటి ఆర్థిక
బంధాలను నిలుపుకోవాలని
చూడటం కాదు..
అనుక్షణం ఆనందాలను పంచుతూ
మరువలేని జ్ఞాపకాలను మిగులిస్తూ
మనతో కలిసి నడిచే ఎన్ని బంధాలను
గుప్పిట్లో దాచుకున్నామన్నదే
జీవించడం అంటే పొగడ్తలు పూలదండలు
చొక్కాలకు అద్దిన క్షణకాలం నిలిచే
అత్తరు ముద్రల గుబాళింపులు కాదు
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి అడ్డుగా
నిలిచిన విమర్శల గోడలను బద్దల కొట్టడానికి
ఎన్ని చెమట చుక్కలను ఖర్చు చేశామన్నదే
జీవించడం అనేది ఒక కళ
అది కథలు, కవితలు రాసినంత తేలిక కాదు
ప్రాణాలను ఉగ్గుపట్టుకోవటం
అంతకన్నా తేలికకాదు
ఆకలితో అల్లాడే అనాథలు అన్నార్తుల
ప్రాణాలు నిలపటానికి మన చేతులతో
ఎన్ని ఆకలి కడుపులు నింపామన్నదే
ఈదర శ్రీనివాసరెడ్డి
7893111985