May 21,2023 07:41

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి. ప్రకృతి మానవాళికి జీవనాధారం. మానవ ఆరోగ్యం, ఆహారం, ఆర్థిక వ్యవస్థల శ్రేయస్సు ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. అయితే ప్రస్తుత పరిణామాలతో ప్రకృతి సంక్షోభంలో పడింది. ఫలితంగా ప్రపంచంలోని 80 లక్షల వృక్ష, 10 లక్షల జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇంతలా పర్యావరణ వ్యవస్థ క్షీణించడం ప్రపంచ జనాభాలో 40 శాతం మందిపై ప్రభావం చూపనుందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యకమం (యుఎన్‌ఇపి) సూచిస్తుంది. ఈ నెల 22న ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం నేపథ్యంలో దీనపైనే అట్టమీది కథనం...

1


ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో వైవిధ్యాంశాలు ప్రకృతిలో ఉన్నాయి. మొక్కలు, జంతువులు, జీవరాశులు.. లక్షలాదిగా ఉండే జీవరాశులన్నీ ప్రకృతిలో భాగమే. ఇలాంటి విభిన్న అంశాల జీవవైవిధ్యం (బయో డైవర్సిటీ) ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. 'ఆధునీకరణ' ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం బయో డైవర్సిటీకి పెద్దపీట వేస్తున్నాయి. మన దేశం కూడా దీనికి మరింత ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాలుగా జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే అనేక దేశాల్లో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు కృషి జరుగుతోంది.

  • జీవవైవిధ్య స్థాయులు

జీవవైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు.
1. జన్యుపర జీవవైవిధ్యం (జెనిటిక్‌ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్‌ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్‌ బయోడైవర్సిటీ)

  • జన్యుపర జీవవైవిధ్యం..

ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉండే విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి. ఉదాహరణకు జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, చర్మం రంగు వివిధ రకాలుగా ఉండటం. ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులు, పుష్పాలు మొదలైనవి.

  • జాతిపర జీవవైవిధ్యం..

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు. అయితే భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలావరకూ కీటకాలు, సూక్ష్మజీవులే.

  • ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం..

దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు, నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహాసముద్ర ప్రాంతాలు వంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవవైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవవైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవవైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

2
  • ఆవిర్భావం ఇలా..

ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌ఇపి) నవంబర్‌ 1988లో బయోలాజికల్‌ డైవర్శిటీపై నిపుణుల తాత్కాలిక వర్గింగ్‌ గ్రూపును, దాని అవసరాన్ని గుర్తించింది. వెంటనే మే 1989లో అంతర్జాతీయ జీవవైవిధ్య సమావేశం ఏర్పాటు చేసింది. క్రమంగా 1992న నైరోబీ కాన్ఫరెన్స్‌ ఫర్‌ ది అడాప్షన్‌ ఆఫ్‌ ది కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్శిటీతో ముగిసింది. అనంతరం కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్శిటీ (సిబిడి) 1993 డిసెంబర్‌ 29న నిర్వహించిన సమావేశం నుంచి జీవవైవిధ్య దినోత్సవం ఏర్పడింది. ప్రధానంగా మూడు లక్ష్యాలతో ఇది పనిచేస్తుంది. మొదటిది జీవవైవిధ్య పరిరక్షణ, స్థిరమైన లక్ష్యంతో కూడిన జీవవైవిధ్యం, జన్యు వనరుల వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే ప్రయోజనాల న్యాయమైన, సమానమైన భాగస్వామ్యం.

  • కాలుష్య ప్రభావం..

జీవవైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరికత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది. ఉదాహరణకు అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు. దీని ఫలితంగా జీవవైవిధ్యంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతోంది. నదులు, భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. దీంతో జీవి మనుగడుకు ముఖ్య కారకమైన నీరు దొరక్క తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.

  • జీవావరణ సమతౌల్యం..

ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు. ఈ సమతుల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది. ఇక భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి. జీవావరణ సమతుల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి. ఉదాహరణకు ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రకృతి విపత్తులూ దీనికి నిదర్శనాలే. సముద్రాల నీటిమట్టం అమాంతం పెరగడం, తీర ప్రాంతాలు కోతకు గురవ్వడం, ఉత్తరాఖండ్‌ లాంటి ప్రాంతాల్లో తరచూ వరదలు సభవించడంతోపాటు పెద్ద పెద్ద కొండలు విరిగి పడిపోవడం, హిమపాతాలు పూర్తిగా కరిగిపోవడం వంటివి తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఫలితంగా అనేక నష్టాలనూ చవిచూస్తున్నాం.

3
  • జాతిపర జీవవైవిధ్యంలో మ్యాపింగ్‌..

బ్రిట్స్‌, పాల్‌ విలియమ్స్‌, డికీయిర్‌రైట్‌, చారిస్‌ హంప్‌ రేజర్‌ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్‌ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్‌) ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయనం పటాల్లో గుర్తించారు. బీటా పటాలు (బీటా మ్యాప్స్‌) ఇందులో జీవవైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతుల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు. గామా పటాలు (గామా మ్యాప్స్‌) ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.

  • వైవిధ్యత లేకుంటే అనర్థమే..

జీవ సమాజంలో జీవుల మధ్య ఉన్న విభిన్నతను జీవవైవిధ్యం అంటాము. జీవుల సంఖ్య, భిన్నత్వం, మార్పు చెందే తత్వాలన్నీ జీవవైవిధ్యానికి సంబంధించినవే. ప్రకృతిలో సహజంగా, కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన కొన్ని జాతులు అదృశ్యమై, మరికొన్ని కొత్తజాతులు ఆవిర్భవిస్తాయి. ప్రస్తుతం ప్రకృతిలో వస్తున్న మార్పులను తట్టుకోలేక ఎన్నో జీవజాతులు అంతరించి పోతున్నాయి. దీనికి ప్రధాన కారకుడు మానవుడు. విధ్వంసకరమైన అభివృద్ధి పేరిట మానవుడు జరిపే ప్రకృతి ప్రతికూల చేష్టల వల్ల ఏటా కొన్ని వందల జాతులు అంతరించి పోతున్నాయి. ప్రధానంగా భౌగోళిక, జీవావరణ మార్పుల వల్ల ఇప్పటివరకు ఐదుసార్లు జీవవైవిధ్యం చాలావరకూ అంతరించిపోయింది. మళ్లీ పరిణామం చెందుతూ వచ్చింది.

4


అయితే ఇదంతా అనేక లక్షల ఏళ్ల కాలంలో జరిగింది. దాదాపు 350 సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ప్రపంచమంతా వ్యాపించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడి తద్వారా మానవ జనాభా 18 రెట్లు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో సగటు జీవన ప్రమాణాలు మెరుగుపడి, మానవుని అవసరాలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన ఆ అవసరాల నిమిత్తం సహజ వనరులు మట్టి, నీరు, గాలి, జంతు, వృక్షజాతులను అస్థిరమైన పద్ధతిలో వినియోగించుకుని పర్యావరణాన్నీ, జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఈ 'మానవ చర్య' అణుయుద్ధం కన్నా తీవ్రమైనదని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒక జాతి నశిస్తే మనిషి దాన్ని తిరిగి సృష్టించ లేడు. జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది. జీవుల మధ్య ఆహారగొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం వాటిల్లుతుంది. భూమిపై ఆహారపంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే 90 శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారాలుగా ఉంటాయి. మొక్కలు నశిస్తే వాటిమీద ఆధారపడిన జంతువులు నశిస్తాయి. పక్షులు నశిస్తే మొక్కలు పెరగడం, పంటలు పండటం ఆగిపోతుంది. అంతిమంగా ఏ జీవికైనా ఆహారోత్పత్తి దెబ్బతిని మనిషి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అయితే 2030 నాటికి జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే చర్యలను తగ్గించకపోతే వాస్తవ జిడిపిలో 10 శాతాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి తప్పదని ప్రపంచ బ్యాంక్‌ సూచిస్తుంది. దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 2.3 శాతం, ఉప సహారా, ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలు వార్షికంగా 9.7 నుంచి 6.5 శాతం వరకూ తగ్గుదలను చవిచూడాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరిస్తుంది.

2
  • అభివృద్ధి పేరుతో అతి వినియోగం..

భూమిపై మానవుడు మనుగడ సాగించడానికి ఆహార, శక్తి వనరులు, ఔషధాలు, కలప, నార, పీచు రూపంలో మొక్కలు మానవుడికి ఉపయోగపడుతున్నాయి. జంతువులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, భూమిపై ఉన్న ప్రతి జీవి మానవుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవవైవిధ్యానికి ప్రస్తుతం అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తున్న చర్యల వల్ల నష్టం వాటిల్లుతోంది. దీనికితోడు ప్రకృతి వనరుల అతి వినియోగం వల్ల కూడా జీవావరణంలోని సమతుల్యతను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దీనికి తీవ్ర స్థాయిలో ముప్పు పొంచి ఉన్నట్లు యూఎన్‌ఈపీ ఇటీవల ప్రకటించింది. గత శతాబ్దకాలంలో అనేక వన్య జీవులు కనుమరుగైన నేపథ్యంలో జీవవైవిధ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడవులను సంరక్షించడం.. అక్కడ ఉండే అన్ని రకాల జీవులు, వాటి తెగలు, వాటిలోని విభిన్న జన్యువులు, జీవులు మధ్య ఉన్న సంబంధాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచించారు.

  • మితిమీరిన క్రిమిసంహారకాల వినియోగం..

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటకనాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీలు లాభాపేక్షతో వాటిని విచక్షణా రహితంగా వాడేలా చేస్తున్నాయి. దీంతో నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వస్తోంది. అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోతున్నాం. అంతేకాదు ఎన్నో జీవజాతులు కాలక్రమంలో అంతరించిపోయాయి. అందుకే వ్యవసాయంలోనూ, వ్యవసాయేతర రంగాల్లోనూ క్రిమిసంహారకాల వినియోగాన్ని సాధ్యమైనంతమేర తగ్గించుకుంటే తగిన ఫలితాన్ని పొందవచ్చు.

3
  • ఆదివాసుల అండదండలతో...

దేశంలో ఆదివాసులు అధికంగా ఉన్నచోట జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగానూ ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో 80 శాతం కంటే ఎక్కువ మంది గిరిజనులున్నారు. అక్కడే జన్యువైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటల్లో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాల్లోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యు మార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్ప కాలంలో, దీర్ఘ కాలంలో ఎలా ఉంటాయో పూర్తిగా అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లుతోంది.

  • అభివృద్ధికి మూలస్తంభం..

పారిశ్రామికీకరణే అభివృద్ధి కాదు.. జీవవైవిధ్యం కూడా అభివృద్ధికి మూలస్తంభమే. అంతేకాదు.. జీవవైవిధ్యం అభివృద్ధిపై, వాతావరణ మార్పులపై సంఘర్షణను పెంచి ఇతర సంక్షోభాలపైనా ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఉద్యోగాల కల్పన, జిడిపి ఉత్పత్తిదారుగానూ పనిచేస్తుంది. పేద దేశాలను సైతం ధనిక దేశాల సరసన నిలబెట్టేందుకు దోహదపడుతుంది. ఉదాహరణకు మత్స్య రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల ఉద్యోగాలు నేరుగా చేపల వేట, చేపల పెంపకంతో ముడిపడి ఉన్నాయి. ఫలితంగా ఈ గొలుసును ఆధారంగా చేసుకుని మరో 2.5 కోట్ల మందికి పరోక్షంగా ఉద్యోగాలు అందుతున్నాయి. అంటే సుమారుగా ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలు వీటిలో 60 శాతం అభివృద్ధి చెంతుతున్న దేశాల్లో ఉన్నాయి. అంటే అటవీ, ప్రకృతి ఆధారిత పర్యాటకం వంటి పరిశ్రమలకు కూడా వర్తిస్తుందని మనం గ్రహించాలి. అంటే జీవవైవిధ్యం విలువ వివిధ రకాల జీవులకు మించినది. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు అందించే సేవలను కూడా జీవవైవిధ్యంగా పరిగణించాలి.

3
  • సంరక్షణా చర్యలు..

మానవుడి వివిధ కార్యకలాపాల వల్ల జీవవైవిధ్యం ఏవిధంగా విచ్ఛిన్నమవుతుందో దాన్ని సంరక్షించడానికి చేపట్టాల్సిన చర్యలు తీసుకోకపోతే భూమిపై జీవం అంతరించిపోయే ప్రమాదమూ అంతే ఉంది. జీవవైవిధ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశం జాతులు, వాటి ఆవాసాలు, వ్యవస్థలు, జీవులు. ఆవరణ వ్యవస్థల మధ్య పరస్పర సంబంధాలను రక్షించడం. ఏ దేశంలోనైతే జీవ వైవిధ్యం కాపాడబడుతుందో ఆ దేశం సమృద్ధిగా ఉంటుంది. జీవ వైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం అడవులపై మనిషి దృష్టిపడటమే. అడవుల్లో అణువిద్యుత్‌ కేంద్రాలు, ఖనిజాల తవ్వకం జరగటం వల్ల జంతుజాలం కనుమరుగవుతుంది. ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. కానీ ఇష్టానుసారంగా చేపలు, ఇతర జంతువుల వేట, మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం యంత్రాల వాడకం, శిలాజ ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం, కర్బన ఉద్గారాలు జీవ వైవిధ్య విధ్వంసానికి ప్రధాన కారణాలు. అందుకే ప్రపంచదేశాలు కలిసికట్టుగా జీవ వైవిధ్య సంరక్షణ చేపట్టాలి. అడవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని ప్రోత్సహించి గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించవచ్చు. దీంతో పాటు ప్రభుత్వాలు అడవుల పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత మేర కార్భన్‌ ఉద్గారాలను తగ్గించే చర్యలు తీసుకోవాలి. సహజ వనరులైన ఎండ, గాలి, నీటి నుంచే విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాధాన్యత నిస్తూ... ప్రతి ఇంట్లో పైకప్పుపై విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకుగానూ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీలు ఇవ్వాలి. ప్లాస్టిక్‌ వాడకాన్ని సాధ్యమైనంత మేర తగ్గించాలి. ఇక జీవ సంపద, వాటి వనరులను ప్రస్తుత అవసరాలకు తగినంత ఉపయోగించుకొని భావితరాలకు కూడా లభించే విధంగా కాపాడుకోవాలి.

3
  • మెగా బయోడైవర్సిటీ దేశాలు..

మెక్సికో 2002లో ప్రపంచవ్యాప్తంగా అధిక జీవ వైవిధ్యం, సంప్రదాయ విజ్ఞానానికి నిలయంగా ఉన్న దేశాలను గుర్తించింది. కన్జర్వేషన్‌ ఇంటర్నేషనల్‌ గుర్తించిన 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చైనా, కొలంబియా, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఇక్విడార్‌, ఇండియా, ఇండోనేషియా, మడగాస్కర్‌, మలేషియా, మెక్సికో, పపువ న్యూగినియా, పెరూ, ఫిలిప్పీన్స్‌, దక్షిణాఫ్రికా, యునెటైడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, వెనిజులా దేశాలు ఉన్నాయి.

  • మనదేశంలో జీవవైవిధ్యం..

ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్‌ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్‌ అత్యంత విస్తీరణ ప్రాంతం.

  1.  మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
  2.  మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
  3.  దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం.
  4. భారత్‌ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు ఐదు జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి
  5.  వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరోలను ఏర్పాటు చేశారు.
  6.  జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.

ఈ సృష్టిలో అన్నింటిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం. వ్యవసాయ పద్ధతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్నీ జీవవైవిధ్యానికి లోబడే ఉండాలి. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక నిరంతర ఆవృత వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగతా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగతా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే వాతావరణ సమతుల్యానికి, పర్యావరణ పరిరక్షణకు జీవరాశులను కాపాడుకోవడం అవసరం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇందుకోసం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815