Sep 06,2022 06:50

      జార్ఖండ్‌ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం విజయవంతంగా నెగ్గింది. శాసనసభలో 81 సీట్లుండగా సోరెన్‌ సర్కారుకు 48 మంది ఎంఎల్‌ఎలు మద్దతిచ్చారు. దాంతో జార్ఖండ్‌లో ఇంతకాలం బిజెపి సృష్టించిన రాజకీయ రగడకు తెరపడినట్లయింది. ప్రతిపక్ష రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రంలోని బిజెపి ఏ విధంగా నానాగడ్డి కరుస్తుందో ఇప్పటికే పలు రాష్ట్రాల ఉదంతాలు అనుభవంలో ఉన్నాయి. అలాంటి నక్కజిత్తులనే జార్ఖండ్‌లో బిజెపి చివరి వరకు ప్రదర్శించింది. ఎత్తులు, కుతంత్రాలు పారకపోవడంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సమయంలో మిత్రపక్షం ఎజెఎస్‌యుతో కలిసి సభ నుంచి ఉడాయించింది. జార్ఖండ్‌లో కొన్నాళ్లుగా రాజకీయ అస్థిరత నెలకొనడానికి బిజెపియే కారణం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జెఎంఎం నేతృత్వంలో కాంగ్రెస్‌, ఆర్‌జెడి సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ సర్కారును ఏదోక సాకుతో పడగొట్టాలని బిజెపి కాచుక్కూర్చుంది. ముఖ్యమంత్రి సోరెన్‌ తన అధికారంతో మైనింగ్‌ కాంట్రాక్టు కేటాయించుకున్నారన్నది బిజెపి ఆరోపణ. 'లాభదాయక' కేసు కింద సోరెన్‌ను శాసనసభా సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని నిరుడు ఫిబ్రవరిలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ వ్యవహారం కాస్తా ప్రభుత్వ విశ్వాస పరీక్ష దాకా వచ్చింది.
    విశ్వాస పరీక్షకు ముందు బిజెపి అనుసరించిన పద్ధతులు జుగుప్స కలిగించాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేశాయి. సంతలో పశువులను కొన్నట్లు అవతల పార్టీల ఎంఎల్‌ఎల కొనుగోలుకు బిజెపి నిస్సిగ్గుగా బరితెగించింది. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్‌ బిశ్వ శర్మ స్వయంగా రంగంలోకి దిగి ఎంఎల్‌ఎలకు గాలం వేశారు. అస్సాం, బెంగాల్‌లో కొంత మంది తమ ఎంఎల్‌ఎలు నగదుతో పట్టుబడ్డట్లు స్వయంగా సిఎం సోరెన్‌ ఆరోపించారు కూడా. క్యాంప్‌లు సరేసరి. బిజెపి ఆపరేషన్లు, ఆకర్ష్‌లపై సోరెన్‌ అప్రమత్తమై తమ ఎంఎల్‌ఎలను బిజెపి వైపు వెళ్లకుండా కాపాడుకున్నారు. బిజెపి కుయుక్తులను దీటుగా తిప్పికొట్టారు. చేసేది లేకనే బిజెపి చేతులెత్తేయాల్సి వచ్చింది. గవర్నర్లను అడ్డుపెట్టుకొని విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, కూల్చేయడం బిజెపికి వెన్నతో పెట్టిన విద్య. జార్ఖండ్‌ లోనూ ఆ ప్రయత్నం జరిగింది. సోరెన్‌ అనర్హతపై కేంద్ర ఎన్నికల సంఘం పంపిన సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయకుండా తొక్కిపట్టి, ప్రభుత్వాన్ని అనిశ్చితిలో పడేసి, బిజెపి యత్నాలకు పరోక్షంగా సహకరించారు. వెయ్యి తలల బిజెపి రక్కసిని భాగస్వామ్య పార్టీల సహకారంతో సోరెన్‌ సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని కాపాడుకోగలగడం పెద్ద విజయమే.
     సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎ ఇత్యాది ప్రభుత్వ సంస్థలను రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా ప్రతిపక్షాలపై ప్రయోగించే దుర్మార్గం కేంద్రంలో మోడీ వచ్చాక తారాస్థాయికి చేరింది. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడం, అస్థిరపర్చడం బిజెపికి రోజు వారీ తంతుగా మారింది. ఢిల్లీలో లిక్కర్‌ స్కాంపై సిబిఐ దర్యాప్తు పేరుతో ఆప్‌ సర్కారును ఇబ్బంది పెట్టాలని చూడగా మొన్ననే అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గి బిజెపి కుయుక్తులను తిప్పికొట్టింది. బీహార్‌లో తొలుత బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జెడియు నేత నితీష్‌ కుమార్‌, తన పదవికి బిజెపి ఎసరు తెస్తుందని ముందే గ్రహించి బిజెపితో తెగతెంపులు చేసుకొని జాగ్రత్త పడ్డారు. ఆర్‌జెడి, కాంగ్రెస్‌, లెఫ్ట్‌తో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది బిజెపికి సుతరాం మింగుడు పడని పరిణామం. మహారాష్ట్రలో శివసేనలో చీలిక తెచ్చి, మద్దతిచ్చి శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని దించడంలో కేంద్ర బిజెపి పాత్ర 'అమోఘం'. కర్ణాటకలో జెడిఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలగొట్టిందో ఎరుకే. ఈ చర్యలు ప్రజాస్వామ్యంలో సహించరానివి. పార్టీ ఫిరాయింపు, ప్రజాప్రాతినిధ్య చట్టాలకు విరుద్ధమైనవి. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేటివి. బిజెపి అనైతిక పద్ధతులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నచోట దాని ఎత్తులు పారట్లేదు. జార్ఖండ్‌ అనుభవం అదే. ప్రాంతీయ పార్టీలు ఈ వాస్తవాన్ని గ్రహిస్తేనే వాటికి మనుగడ.