Jul 24,2022 07:03

ఆకాశం ఏనాటిదో.. మానవుడికి దానిపై అనురాగం అనాటిది.. మానవుడు ఆకాశంలోనే కాదు.. విశ్వ రహస్యాలు తెలుసుకునే పనిలో ఎప్పటి నుండో అలిసిపోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే విశ్వ రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో ఒక అంతరిక్ష గవాక్షం ప్రస్తుతం సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ ఏడాది మొదటి నెలలో అంతరిక్షంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న జేమ్స్‌వెబ్‌ అనే టెలిస్కోప్‌ విశ్వ జననం ఏమిటి? గెలాక్సీల పుట్టుక ఏవిధంగా జరిగింది? నక్షత్రాల ఆవిర్భావం ఎలా జరుగుతుంది? ఇందులో భాగమే ఇటీవల విడుదలైన జేమ్స్‌వెబ్‌ చిత్రాలు.. అసలు జీవ వేదిక ఎటువంటి రహస్యాలను విప్పి చెప్పే పనిలో పడింది? మొదటి విడతగా ఐదు చిత్రాలను తీసి పంపింది. ఒక ఫొటో వంద పదాల పెట్టు అన్నట్టు అవి శాస్త్రజ్ఞులకు ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తూనే, విశ్వం తాలూకు కొత్త రూపాన్ని ఎదుట నిలిపాయి. వీటన్నింటిపైనే ఈ ప్రత్యేక కథనం.

web


ఆది యందు సర్వము ఒకటిగానుండెను. మనకు తెలిసి, ఉనికిలో ఉన్న ప్రతిదీ పదార్థం, శక్తి, కాలం, స్థలం కలిసిపోయి ఉండేవి. ఈ ఏకత్వ రూపం ఊహకు అందనంత సూక్ష్మంగానూ, అనంతమైన దట్టంగానూ ఉండేది. దీనికి వెలుపల ఇంకేదీ ఉండేది కాదు. ఈ విషయం అర్థం కానంత జటిలంగా ఉందంటే, అది అంత జటిలమైనదే! ఎవరికీ ఓ పట్టాన అంతుబట్టదు. అయితే, ఈ ప్రారంభ ఏకత్వం దాదాపు 12-15 బిలియన్‌ సంవత్సరాల క్రితం 'బిగ్‌ బాంగ్‌' అని మనం పిలుచుకునే ఒకానొక ఘటన ద్వారా విచ్ఛిన్నం చెంది, నిత్యం విస్తరిస్తున్న, చలిస్తున్న విశ్వం ఏర్పడింది.
          ఈ బిగ్‌ బాంగ్‌ అనే మహా విస్ఫోటనం కేవలం సిద్ధాంతమేనా లేక వాస్తవమా అనే అనుమానం ఉంది. అది సిద్ధాంతమే, కానీ అనేక నిదర్శనాలతో కూడిన సిద్ధాంతం. ఇరవయ్యో శతాబ్దపు తొలి రోజుల్లో, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని పరిశోధిస్తూ, అంత విస్తృతమైన పదార్థం, శక్తి కలిసి ఉన్నపుడు తొలి విశ్వం విపరీతమైన వేడిగా వుండి ఉండేది, ఆ కారణంగా అణు చర్యలు ఎక్కడ బడితే అక్కడ ఒకే సమయంలో జరిగి ఉండవచ్చు అని సూచించారు.
      అణు చర్యలు జరిగినపుడు రేడియో ధార్మిక పదార్థల రూపంలో రేడియషన్‌ విడుదల జరుగుతుంది. కాబట్టి, ఒకవేళ బిగ్‌ బాంగ్‌ వాస్తవం అయిన పక్షంలో మనం ఆ రేడియేషన్‌ అవశేషాలను విశ్వం అంతటా గుర్తించగలిగి ఉండాలి. బిలియన్ల సంవత్సరాల తరువాత ఈ రేడియేషన్‌ దాదాపు సున్నా డిగ్రీ వరకూ చల్లబడి ఉండాలి.
దశాబ్దాల తరువాత, 1965లో, సౌర కుటుంబం ఆవలి నుండి వచ్చే అధిక ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను గుర్తించగలిగే శక్తివంతమైన రేడియో టెలిస్కోప్‌లు కనుగొనబడ్డాయి. ఈ తరంగాలు అన్ని దిక్కుల నుండి, ఒకే స్థాయిలో, అన్నీ కలిసి ఒకేసారి ప్రసరించేవి. ఇంకా, ఈ రేడియేషన్‌ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ కంటే కాస్త ఎక్కువగా వుంది. పూర్వపు సిద్ధాంతపరమైన అంచనాలకు అతి సమీపంగా! ఈ రేడియేషన్‌ని కాస్మిక్‌ మైక్రోవేవ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ రేడియేషన్‌ అంటారు. ఇదే ఇప్పుడు బిగ్‌ బాంగ్‌ సిద్ధాంతానికి నిర్ధారణగా భావించబడుతుంది.

web


 

                                                                          విశ్వగర్భం చిత్రాలు..

కొద్దిరోజుల క్రితం, జేమ్స్‌వెబ్‌ అంతరిక్ష టెలిస్కోప్‌ ద్వారా తీసిన ఐదు చిత్రాలను నాసా మొదటిసారిగా వెల్లడించింది. ఈ చిత్రాలు నక్షత్రాల పుట్టుక నుండి అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల వరకు-మన విశ్వం జననానికి సంబంధించిన అత్యంత వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. ఈ ఫొటోలలో ఉన్నది ఏమిటి, అది మనకు ఏవిధంగా అర్థం అవుతోందో చూద్దాం.
      వెబ్‌ తీసిన మొదటి చిత్రం డీప్‌ఫీల్డ్‌ అని పిలిచే గెలాక్సీ సముదాయం SMACS 0723. జేమ్స్‌వెబ్‌ కెమెరాలు అంతరిక్షంలోకి సుమారు 13.6 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరం వరకూ చూసే సామర్థ్యం ఉంది. అంతరిక్షంలో ఇప్పటివరకూ మనం చూసిన అత్యంత దూరం ఇదే. తాజాగా పంపిన SMACS 0723 అని పిలువబడే గెలాక్సీ సముదాయం చిత్రంలో వేలాది గెలాక్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని 13.1 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఒక కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం, అంటే దాదాపు 9.5 ట్రిలియన్‌ కిలోమీటర్లు..

కాలంలోకి, వెనక్కి చూడటానికి కాంతి వేగం, కాంతి మనలను చేరుకోవడానికి ఎంత సమయం తీసుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాంతి, ప్రతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది (గంటకు దాదాపు 670 మిలియన్‌ మైళ్లు). ఈ వేగం మనకి రెప్పపాటులా అనిపిస్తుంది. కానీ విశ్వం అంత విశాల ప్రదేశంలో సుదూర ప్రాంతాల నుండి ప్రయాణించి, మనలను చేరడానికి కాంతికి కూడా చాలా సమయం పడుతుంది. భూమి నుండి 150 మిలియన్‌ కిలోమీటర్లు (93 మిలియన్‌ మైళ్ళు) దూరంలో ఉన్న సూర్యుని నుండి కాంతి మనలను చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది.

web


కాంతి చాలా కాలం క్రితం దాని ప్రయాణం మొదలుపెట్టింది. అందువల్ల ఇప్పుడు మనం చూస్తున్న గెలాక్సీలు అంటే, జేమ్స్‌వెబ్‌ కెమెరా చూపిన ఈ గెలాక్సీలు నేడు ఉన్న స్థితి కాదు.. 13.1 బిలియన్‌ సంవత్సరాల క్రితం పురాతన కాలంలో విశ్వం యవ్వనంగా ఉన్నప్పుడు ఉన్న గెలాక్సీలు. దీని అర్థం కాంతి అంతరిక్షం, కాలం గుండా ప్రయాణించి, బిలియన్ల సంవత్సరాల తరువాత మనలను చేరుకుంది. ఈ గెలాక్సీలను ఈ రోజు ఎలా వుంటాయో చూడాలంటే మనం మరో 13 బిలియన్‌ సంవత్సరాలు వేచి ఉండాల్సిందే. వెబ్‌ చిత్రాలలోని వస్తువులు అనేక బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. వీటిలో నీలంగా ఉన్న గెలాక్సీలు చాలా పరిణతి చెందినవి. ఇవి అనేక నక్షత్రాలు, తక్కువ ధూళిని కలిగి ఉంటాయి. ఎరుపు రంగు గెలాక్సీలు అధిక ధూళిని కలిగి ఉంటాయి.. వాటి నుండి ఇప్పటికీ నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. ఆకుపచ్చ గెలాక్సీలు హైడ్రోకార్బన్లు, ఇతర రసాయన సమ్మేళనాలతో నిండి ఉంటాయి.
 

                                                                   గ్రహం మేఘాలలో నీరు ?!

మిగతా ఫొటోలలాగా లేనిది సైంటిఫిక్‌ గ్రాఫ్‌. వెబ్‌ టెలిస్కోప్‌ బాహ్యగ్రహాల అధ్యయనం చేస్తోంది. అంటే.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి వాతావరణాలు వంటి వివరాలు. ఒక గ్రహం దాని మాతృ నక్షత్రం ముందు నుండి పయనిస్తున్నపుడు వాతావరణంలో కనిపించే నక్షత్ర కాంతిని వెబ్‌ విశ్లేషిస్తుంది. ఈ గ్రాఫ్‌లో కనిపించేది, భూమి నుండి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బృహస్పతి లాంటి గ్రహం WASP 96 B  వాతావరణ విశ్లేషణ. ఇది గ్రహం మేఘాలలో పుష్కలంగా నీరు ఉన్నట్టు కనుగొంది.
 

                                                                 ఏమిటీ జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ ?

ప్రపంచంలో ఇప్పటివరకూ నిర్మించిన అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్‌ జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌. ఈ వెబ్‌ టెలిస్కోప్‌ను నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ESA), కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు కలిసి అభివృద్ధి చేశాయి. 1996లో రూపొందించడం ప్రారంభమైనపుడు దీనిని నెక్స్ట్‌ జనరేషన్‌ స్పేస్‌ టెలిస్కోప్‌గా పిలిచేవారు. అయితే, సెప్టెంబరు 2002లో దీనికి 1960లలో నాసా అధిపతిగా ఉండి, చంద్రునిపైకి వెళ్లిన అపోలో ప్రోగ్రామ్‌ను రూపొందించడంలో సహాయపడిన జేమ్స్‌వెబ్‌ పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ అనేక అవాంతరాలు, జాప్యాలు, ఖర్చులు భరించి 2016లో నిర్మాణం పూర్తయింది. అనేక పరీక్షల తర్వాత, 25 డిసెంబర్‌ 2021న ఫ్రెంచ్‌ గయానాలోని కౌరౌ వద్ద ESA  వారి ప్రయోగ సైట్‌ నుండి Ariane 5 రాకెట్‌లో అంతరిక్షంలోకి ప్రయోగించారు. టెలిస్కోప్‌ దాదాపు 1.5 మిలియన్‌ కిలోమీటర్లు ప్రయాణించి, ప్రయోగించిన 30 రోజుల తరువాత అంతరిక్షంలో గురుత్వాకర్షణ స్థిరమైన ప్రదేశం అయిన లాగ్రాంజ్‌ పాయింట్‌కి చేరుకుంది.
 

                                                                  వెబ్‌ టెలిస్కోప్‌ లక్ష్యం ఏమిటి ?

వెబ్‌ టెలిస్కోప్‌ విశ్వం అంచులు, అత్యంత సుదూర గెలాక్సీలు, మొదట ఏర్పడ్డ నక్షత్రాలు వంటివి చూడగలిగే శక్తివంతమైన సాధనంగా రూపొందించబడింది. ఇది ఇంత శక్తివంతమైనది కాబట్టి, విశ్వంలో ఎక్కడైనా ఉపయోగపడే సామర్థ్యాలను కలిగి ఉంది, మన సౌరవ్యవస్థతో సహా, వెబ్‌ టెలిస్కోప్‌కి స్థూలంగా నాలుగు లక్ష్యాలు ఉన్నాయి. ముందుగా బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత ఏర్పడిన మొదటి నక్షత్రాలు, గెలాక్సీల అధ్యయనం. రెండోది గెలాక్సీలను గతం నుండి నేటి వాటితో పోల్చడం. మూడోది నక్షత్రాలు, గ్రహవ్యవస్థలు ఎక్కడ పుట్టాయో తెలుసుకోవడం. నాల్గోది మన సౌరవ్యవస్థలోని వస్తువులతో పాటు, మన సౌరవ్యవస్థకు ఆవల ఉండే గ్రహాల వాతావరణాన్ని గమనించడం, విశ్వంలో ఎక్కడైనా జీవం నిర్మాణ పదార్థాలు ఉన్నాయేమో కనుగొనడం.

web


 

                                                                          ఇది ఎలా పని చేస్తుంది ?

వెబ్‌ టెలిస్కోప్‌ ఒక ఇన్‌ఫ్రారెడ్‌ టెలిస్కోప్‌. అంటే ఇది అంతరిక్షంలో వస్తువులను గుర్తించడానికి ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ను ఉపయోగిస్తుంది. సాధారణంగా చల్లగా, మనం గ్రహించే కాంతిలో సరిగ్గా కనిపించని నక్షత్రాలు, నెబ్యులాలు, గ్రహాలు వంటి ఖగోళ వస్తువులను స్పష్టంగా చూడగలదు. టెలిస్కోప్‌లో దాదాపు 21 అడుగుల వ్యాసంతో ఉండే అద్దం ముఖ్యమైన అంశం. దానితో బాటు 18 చిన్న, షట్కోణ ఆకారపు అద్దాలున్నాయి. వెబ్‌ టెలిస్కోప్‌ కంటే ముందే ప్రసిద్ధమైన హబుల్‌ టెలిస్కోప్‌ అంతరిక్షంలో ఉంది. అయితే, హబుల్‌ భూమి చుట్టూ తిరుగుతుంటే, జేమ్స్‌వెబ్‌ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే, దాని ఇన్ఫ్రా రెడ్‌ (పరారుణ) సామర్థ్యాలు శక్తివంతమైనవి. ఇది కాంతి ప్రారంభం నుండి గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఇది కాలంలో మరింత వెనక్కు, 13.8 బిలియన్‌ సంవత్సరాల క్రితం 'బిగ్‌ బ్యాంగ్‌' తర్వాత కొన్ని వందల మిలియన్‌ సంవత్సరాలలోపు చూసే వీలు కల్పిస్తుంది.
 

                                                                  ఉండి వుండి ఒక వార్త వస్తోంది..!

విశ్వం గతంలో అనుకున్న దానికంటే 5-బిలియన్‌ సంవత్సరాలు చిన్నది అంటూ.. ఒక కొత్త నక్షత్రం పుట్టిందనో, ఒక మూల ఏదో ఒక గ్రహం లాంటిది కనిపించిందనో, ఫలానా గ్రహం మీద నీటి మూలాలు దొరికాయనో.. ఇలా రకరకాల ఖగోళ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఏంటి అనేది సగటు సామాన్యుడి ప్రశ్న. మనం ప్రస్తుతం ఖగోళశాస్త్ర స్వర్ణయుగంలో జీవిస్తున్నాము. విశ్వం స్థితి గురించి కొత్త ఆవిష్కరణల గురించి మామూలు ప్రజలకు అవగాహన తక్కువే. పాఠ్య పుస్తకాలలో మాత్రమే తెలిసిన అనేక విషయాలను ఇప్పుడు సచిత్రంగా చూడగలుగుతున్నాము. పాత్‌ఫైండర్‌ పంపిన మార్స్‌ నుండి, హబుల్‌ పంపిన సుదూర గెలాక్సీల అద్భుతమైన చిత్రాలను చూశాము.
 

                                                                        ఆ ఐదు ఏమిటి ?

జేమ్స్‌వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ పరిశీలించిన ఐదు కాస్మిక్‌ వస్తువులలో ఒకటిగా కారినా నెబ్యులాను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో నక్షత్రాలు ఏర్పడే ప్రాంతం కాస్మిక్‌ క్లిఫ్స్‌ అని పిలువబడే NGC 3324 ఉంది. నక్షత్రాలు, ఇతర జీవులలాగే పుడతాయి. వయసై, చనిపోతాయి. భూమి నుండి 7,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కారినా నెబ్యులా, కాస్మోస్‌లోని పెద్ద నక్షత్ర జన్మస్థలాలలో ఒకటి. హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ఇంతకు ముందు కారినాను చిత్రీకరించింది. కానీ జేమ్స్‌వెబ్‌ తీసినంత స్పష్టంగా లేదు. ఈ చిత్రంలో శిఖరాలలా కనిపించే ఆకారాలు, దుమ్ము, వాయువుతో ఏర్పడ్డవి. వాటిలో కొన్ని ఏడు కాంతి సంవత్సరాల ఎత్తు ఉన్నాయి. ఈ అల్లకల్లోల ప్రాంతంలో తారలు చుట్టుపక్కల ఉన్న పదార్థాలను కలుపుకుంటూ జన్మిస్తున్నాయి. నక్షత్రాలు ఏర్పడేటప్పుడు అపారమైన శక్తి విడులవుతుంది. అది మొత్తం నెబ్యులా ఆకారాన్ని రూపొందిస్తుంది. కాస్మిక్‌ క్లిఫ్స్‌లోని రంగులు కృత్రిమంగా జోడించబడ్డాయి. అయితే, రంగులు లేవని చెప్పలేము. వాస్తవానికి, నక్షత్రాల నుండి వెలువడే కాంతి మనం మానవ కంటితో చూడగలిగే దానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉంటుంది. గెలాక్సీలు ఎలా ఏర్పడతాయి? ఎలా పెరుగుతాయి? ఎలా ఒకదానితో ఒకటి కలిసిపోతాయి? కొన్ని సందర్భాల్లో అవి నక్షత్రాలను పుట్టించడం పూర్తిగా ఎందుకు ఆపివేస్తాయో అర్థం చేసుకోవడానికి పరిశోధకులు నక్షత్రాల నుండి విడుదలయ్యే కాంతి గురించి డేటాను ఉపయోగిస్తారు.

web


 

                                                                  నక్షత్రాల చుట్టూ మేఘాలు..

వెబ్‌ పంపిన ఈ ఫొటోలో ఎరుపు భాగం మధ్యలో రెండు ప్రకాశవంతమైన బిందువులు చనిపోతున్న రెండు నక్షత్రాలు. భూమి నుండి సుమారు 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఒకదానికొకటి కక్ష్యలో ఉన్న ఈ వృద్ధ నక్షత్రాల జంట ఇది. నక్షత్రాలు తమ అంతిమ దశలో ప్రవేశించినప్పుడు, వాయువులు, ధూళిని విడుదల చేస్తాయి. విడుదలైన వాయువులు, ధూళి ఆ నక్షత్రాల చుట్టూ నెబ్యులా, మేఘాలను ఏర్పరుస్తాయి. నక్షత్రాలు చనిపోతున్నపుడు వాటిలోని పదార్థాలను ఎలా తొలగించుకుంటాయనే దాని గురించి మరింత అర్థం చేసుకోవచ్చు. రెండు నక్షత్రాల్లో ప్రకాశవంతమైనది వయసులో చిన్నది. నక్షత్రాలు ఒకదానికొకటి కక్ష్యలో తిరుగుతున్నప్పుడు వాటి చుట్టూ ఉండే వాయు పొరను బాగా కదిలించి, ఒక విశిష్ట ఆకారాన్ని ఇస్తాయి.
 

                                                                            స్టెఫాన్స్‌ క్వింటెట్‌..

స్టెఫాన్స్‌ క్వింటెట్‌ అనేది ఐదు గెలాక్సీల సమూహం. దీనిని 1877లో ఖగోళ శాస్త్రజ్ఞులు మొదటిసారిగా చూశారు. ఆ సమూహ సమగ్ర చిత్రాన్ని వెబ్‌ సంగ్రహించింది. భూమికి 40 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎడమవైపు గెలాక్సీ వాస్తవానికి ముందుభాగంలో ఉంది. మిగిలిన నాలుగు 290 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. నాలుగు దగ్గరగా ఉన్న గెలాక్సీలు పరస్పరం ధూళి, నక్షత్రాలు గురుత్వాకర్షణతో ఒకదాని నుండి మరొకటి సంకర్షణ చెందుతాయి. ఈ ఫొటోలో కొత్త నక్షత్రాల సమూహాలు ప్రకాశవంతమైన కాంతిలా కనిపిస్తున్నాయి. వెనుక వేలాది గెలాక్సీలు కనిపిస్తున్నాయి.

web


 

                                                     జేమ్స్‌వెబ్‌పై ఉల్కల ప్రభావం...ఆందోళనలో నాసా !

ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా జేమ్స్‌వెబ్‌కు పేరు ముద్రపడింది. అంతెందుకు అంతరిక్ష శూన్యంలో ఆరు నెలల కాలం పూర్తిచేసుకుని.. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఓ నివేదిక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాను ఆందోళనకు గురిచేస్తోంది. జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ దెబ్బతిందని.. రానున్న రోజుల్లో టెలిస్కోప్‌ పని తీరుపై ప్రభావం చూపనుందని ఆ నివేదిక సారాంశం. కమీషనింగ్‌ ఫేజ్‌లో టెలిస్కోప్‌ పనితీరును పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ఆ కథనం పేర్కొంది. మే 22న జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్‌ (సూక్ష్మ ఉల్కలు) కారణంగా దెబ్బతింది. చివరి ఉల్క ఢకొీట్టడంతోనే టెలిస్కోప్‌ అద్దం దెబ్బతిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రభావం చిన్నదిగానే చూపిస్తున్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఎంతమేర నష్టం చేకూరుస్తుందన్న విషయంపై ఇప్పుడే అంచనాకి రాలేమని పేర్కొన్నారు. అదే సమయంలో డ్యామేజ్‌ గురించి స్పందించిన జేమ్స్‌వెబ్‌ రూపకర్తలు.. టెలిస్కోప్‌ అద్దాలు, సన్‌షీల్డ్‌ (టెన్నిస్‌ కోర్టు సైజులో ఉంటుంది)లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పనిచేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో నాసా ఉంది.
 

టెలిస్కోప్‌ను కనుగొన్నప్పటి నుండి విశ్వంలోకి మరింత లోతుగా దూసుకెళ్లారు శాస్త్రవేత్తలు. వాళ్లు నిత్యం విశ్వం గురించి కొత్త జ్ఞానాన్ని పొందుతున్నారని మనకు తెలుసు. కానీ ఏమి జరుగుతుందో సామాన్యుడికి అవగతం కావడం లేదు. ఈ సమస్య శాస్త్రం ప్రారంభమైన రోజు నుండీ ఉన్నదే. ఎప్పుడైతే శాస్త్ర విజ్ఞానం సాధారణ మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తుందో.. అదే మనిషికి అవసరం అనిపిస్తుంది. కానీ శాస్త్రీయ దృక్పథం ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. కొత్త ఆవిష్కరణలు, ప్రతిపాదనలు, సిద్ధాంతాలు కొత్తగానే ఉంటాయి. కాలం గడిచిన కొద్దీ వాటి ఫలాలు అందుతాయి. వేచి చూద్దాం.

 

డా. కాకర్లమూడి విజయ్

98490 61159