Sep 24,2023 08:35

ఈ మధ్యకాలంలో విడుదలైన షారుక్‌ ఖాన్‌ సినిమా 'జవాన్‌'. టైటిల్లోనే సైనికుడు కథ అని అర్థమవుతోంది. అందులోనూ షారుక్‌ ఖాన్‌, నయనతార కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అటు బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ అభిమానులు ఆసక్తిగా చూశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కథలే ఇప్పటివరకూ వచ్చాయి. కానీ సైనికుడి జీవితంలో నష్టం జరిగితే దాని రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నారు దర్శకుడు అట్లీ కుమార్‌. మెసేజ్‌ ఓరియేంటేడ్‌ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కించారు. తమిళ హీరో విజయ్ తో తెరి, మెర్సిల్‌, బిగిల్‌ వంటి వరుస విజయాలు అందుకున్నారు. దాంతో బాలీవుడ్‌ నటీనటులతో సినిమా తీసే అవకాశం దక్కించుకున్నారు. గత సినిమాల మాదిరే ఇందులోనూ మంచి మెసేజ్‌ను ఇచ్చారు. మరి కథ ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..గుండుతో కనిపించే ఓ అజ్ఞాత వ్యక్తి (షారుక్‌ ఖాన్‌) తన గ్యాంగ్‌లోని ఆరుగురు అమ్మాయిలతో కలిసి ముంబైలోని మెట్రోరైల్‌ని హైజాక్‌ చేస్తాడు. ప్రభుత్వాన్ని రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తాడు. ఆ క్రమంలో ప్రయాణికుల ప్రాణాల్ని తీయడానికి కూడా వెనుకాడడు. హైజాకర్లని పట్టుకోవడం కోసం ఐపీఎస్‌ నర్మద (నయనతార) ని రంగంలోకి దింపుతుంది అధికార యంత్రాంగం. అయినా తాను అనుకున్నది సాధించి, చాకచక్యంగా తప్పించుకుంటాడు. తనకి ఇచ్చిన రూ.40 వేల కోట్లని పేదల ఖాతాల్లో జమ చేస్తాడు. నయా రాబిన్‌హుడ్‌ లాంటి ఆ హైజాకర్‌ వ్యవహారం సంచలనంగా మారుతుంది. నర్మద, తన బృందం సాగించిన పరిశోధనలో హైజాకర్‌.. ఓ కారాగారంలో విధులు నిర్వర్తించే జైలర్‌ ఆజాద్‌ (షారుక్‌ఖాన్‌) పోలికలతో ఉన్నట్టు తేలుతుంది. జైలర్‌ ఆజాద్‌ హైజాకర్‌గా మారాడా? ఆయన వెంట ఉన్న ఆరుగురు యువతులు ఎవరు? ఒకప్పుడు ఆర్మీలో పనిచేసిన విక్రమ్‌ రాథోడ్‌ (షారుక్‌ ఖాన్‌) కీ, ఆజాద్‌కీ సంబంధం ఏంటి? ప్రపంచంలోని ఐదో అతి పెద్ద ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్‌ (విజరు సేతుపతి) తో ఆర్మీలో పనిచేస్తున్న విక్రమ్‌ రాథోడ్‌కు ఎక్కడ విరోధం మొదలౌతుంది..? ఒక జవాన్‌పై దేశద్రోహి అనే ముద్ర పడటం వెనుక జరిగిన కథ ఏంటి..? అనేదే మిగతా కథ. ఓ తమిళ దర్శకుడు మొదటిసారిగా ఓ హిందీ సినిమాకి, అదీ అగ్రనటుడు అయిన షారుఖ్‌ఖాన్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయడం హర్షించదగ్గ విషయం. దర్శకుడు అట్లీ దేశభక్తి, రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇలాంటి సున్నితమైన సమస్యలు తీసుకొని, వాటికి కొన్ని వాణిజ్యపరమైన అంశాలు జత చేసి ఆసక్తికరంగా వున్న ఒక కథను అల్లారు. ఇటువంటి కథలు గతంలో దర్శకుడు శంకర్‌, కొరటాల శివ చేశారు. అదే కోణంలో దర్శకుడు అట్లీ తీయడం అభినందనీయం. రైతుల ఆత్మహత్యలు అనేవి ఇప్పుడు దేశం అంతటా వినిపిస్తున్న సమస్య. దాన్ని అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకంగా చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి సదుపాయాలు లేక ప్రజలు ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో వాస్తవికంగా చూపించారు. అదే క్రమంలో దేశభద్రత కోసం పనిచేస్తున్న జవాన్ల పరిస్థితులు, వారు పడుతున్న ఇబ్బందులు, ఎటువంటి నాసిరకం తుపాకులు అందచేస్తున్నారు, వాటివలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో అందరికీ తెలిసేలా తీశారు. ఈ భాగస్వామ్యంలో ప్రైవేట్‌ వ్యక్తులు, మధ్యవర్తులు, అవినీతిపరులు ఎలా డబ్బులు చేసుకుంటున్నారు అనే విషయం చూపించారు. ప్రభుత్వాల్ని ప్రశ్నించేలా కొన్ని సంఘటనలు తీర్చిదిద్దుతూ బ్యాలెన్సింగ్‌గా కథని చెప్పారు దర్శకుడు.
షారుక్‌ఖాన్‌ ఎప్పుడూ కనిపించనంత మాస్‌గా, వైవిధ్యమైన రెండు విభిన్న పాత్రల్లో ఆజాద్‌, విక్రమ్‌ రాథోడ్‌గా డ్యూయల్‌ రోల్‌ చేశారు. ఆయన అభిమానులకి మరింత ఉత్సాహాన్నిచ్చారు. నయనతార పోలీస్‌ ఆఫీసర్‌గా సరిగ్గా సరిపోయారు. దీపికా పడుకొనె ఒక సన్నివేశంలోనే కనిపించారు. ఆమెది ఒక వీరోచిత పాత్ర. ఇక విజరు సేతుపతి విలన్‌గా జీవించారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా తమతమ పాత్రలను చేశారు. చివరలో సంజరుదత్‌ వచ్చి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
నటీనటులు : షారుక్‌ ఖాన్‌, నయనతార, విజరు సేతుపతి, ప్రియమణి, మాన్య మల్హౌత్ర, దీపికా పడుకొనె, సంజరు దత్‌ తదితరులు.

నిర్మాణ సంస్థ : రెడ్‌ చిల్లీస్‌
నిర్మాతలు : గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ
దర్శకత్వం : అట్లీ కుమార్‌
సంగీతం : అనిరుధ్‌
సినిమాటోగ్రఫీ : జీ.కే. విష్ణు