Jul 10,2022 11:57

'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ ! అని గురజాడ అప్పారావు అన్నారు. అంతేకాదు.. 'వట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్‌ తలపెట్టవోయ్ ' అని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరమైన, పట్టించుకోవాల్సిన అంశం. జనాభా పెరుగుదలలో చైనా, భారత్‌ ఎప్పుడూ ముందంజలోనే ఉన్నాయి. అందుకే ప్రపంచ జనాభా దినోత్సవం. జనాభా ఎందుకు పెరుగుతోంది? దీనివల్ల లాభ నష్టాలేమిటి? అసలు జనాభా అనేది దానికి అదే ఒక శాపమా? లేక వరమయ్యే అవకాశాలున్నాయా? దానిని అదుపు చేయడమా? స్థిరీకరించడమా? పెరుగుదల వేగాన్ని తగ్గించడమా? ఇంత జనాభాకు కనీసవసరాలు తీరుతున్నాయా? ఆరోగ్యం, ఆహారం పరిస్థితి ఏంటి? వంటి అంశాలను ప్రపంచానికి తెలియజేయడానికే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక కథనం..

1


ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల మరణాలకు, అనారోగ్యానికి ప్రధానకారణం పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు. ఇది సమాజం, ప్రజలపై ప్రభావం చూపించే అంశం. అందుకే దీనిపై ఎక్కువ శ్రద్ధ చూపడం ఈ రోజు ముఖ్యలక్ష్యంగా ఉండాలనేది ఐరాస నొక్కి చెప్తోంది. ప్రతి ఏడాదీ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రచారం ప్రపంచవ్యాప్తంగా స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పట్ల వారికి అవగాహన కలిగించడం. అందుకు సంబంధించిన నైపుణ్యాలను పెంచాలని చెప్తోంది. ఈ సందర్భంగా పెరుగుతున్న జనాభా పట్ల కుటుంబ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత, లింగ సమానత్వం, మాత, శిశువుల ఆరోగ్యం గురించి అవగాహన చేసుకోవాలి. పేదరికం, మానవ హక్కులు, ఆరోగ్య హక్కు, లైంగిక విద్య, వంటి సమస్యల గురించి తెలుసుకోవాల్సి ఉందని ఐరాస పేర్కొంది. అందుకోసం ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది.
గర్భనిరోధక సాధనాలు, పునరుత్పత్తి ఆరోగ్యం, కౌమార గర్భం, బాల్య వివాహాలు, లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు మొదలైన వాటిపై అవగాహన కలిగించాలని ఐరాస పేర్కొంది. బాలికా విద్య, బాలికలకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపింది. యువతలో ముఖ్యంగా 15-19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో లైంగిక సంబంధిత సమస్యలను పరిష్కరించడం చాలా అవసరమని పేర్కొంది. సురక్షితమైన, స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ చేయించుకోవడం మానవహక్కుగా పరిగణించాలని తెలిపింది. ఇది లింగ సమానత్వం, మహిళా సాధికారతకూ ప్రధానమైనదని ఐరాస పేర్కొంది. పేదరికాన్ని తగ్గించడంలో కీలకమైన అంశం కుటుంబ నియంత్రణ అని అభిప్రాయపడింది. అందుకే ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా బాధ్యత తీసుకోవాలని తెలిపింది. ఫలితంగా ఈ చర్యలన్నీ సమాజంలో ఆర్థికాభివృద్ధి జరగడానికి వీలవుతుందని వివరించింది.

2


పెరుగుదలే ప్రధాన సమస్య..
మానవ వనరుల్లో జనాభా ముఖ్యమైంది. ఒక దేశాభివృద్ధిని నిర్ణయించడంలో జనాభా కీలకపాత్ర వహిస్తుంది. సహజవనరులను సమర్థవంతంగా ఉపయోగించి అధిక ఉత్పత్తిని, ప్రగతిని పెంపొందించడం మానవవనరుల సామర్థ్యంపైనే ఆధారపడుతుంది. అంటే జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు, అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైంది జనాభా పెరుగుదల.


దేశాభివృద్ధికి సూచిక..
ప్రఖ్యాత జనాభా శాస్త్రవేత్త ఎడ్విన్‌ కానన్‌ భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి కారకమవుతుందని అన్నారు. ఇక మన మనుగడకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన సెవెన్‌ బిలియన్‌ క్యాంపెయిన్‌ కొన్ని సూచనలు చేస్తోంది. అవి 1.దారిద్య్రాన్ని, అసమానతలను తగ్గించడం, జనాభా పెరుగుదల వేగాన్ని అదుపుచేయడం. 2. చిన్న, బలమైన కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి, ఆరోగ్యకరమైన కుటుంబాలకు దారి సుగమం చేయడం. 3. తక్కువ సంతానం, దీర్ఘాయుష్షుల వల్ల వృద్ధుల సంఖ్య పెరగడంపై జాగరూకతతో ఉండటం.
 

3

 

కుటుంబ ప్రణాళికా హక్కే!
కుటుంబ ప్రణాళికను ఈసారి ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణయించింది. దీంతో తొలిసారిగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి పిల్లల సంఖ్య, ఇంకా వారి మధ్య అంతరాన్ని గుర్తించడాన్ని ఒక ప్రాథమిక మానవహక్కుగా వెలుగులోకి తెచ్చినట్లైంది.
 

అప్పుడు మరణాలే..
నాగరికత నేర్చింది మొదలు రెండో ప్రపంచయుద్ధం వరకూ మనిషి మనుగడ అంత సులువుగా లేదు. ఎప్పుడో ఏదో ఒక ఉపద్రవం రావడం, యుద్ధాల కారణంగా భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకునేవి. పైగా వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అంటురోగాలు, వ్యాధులు విజృంభించేవి. శిశు మరణాల రేటు ఎక్కువ. దీంతో జనాభా వృద్ధి ఓ మోస్తరుగా ఉండేది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, అంతకుముందు వచ్చిన స్పానిష్‌ ఫ్లూ కారణంగా లక్షలాది మంది మరణించారు.
 

బేబీ బూన్‌..
ప్రపంచ జనాభా1950 - 87 మధ్య కాలంలో ఒక్కసారిగా విస్ఫోటనం జరిగింది. ప్రపంచ జనాభా 250 కోట్ల నుంచి 500 కోట్లకు చేరుకోవడానికి కేవలం 37 ఏళ్లు మాత్రమే పట్టింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగయ్యాయి. భూస్వామ్య, రాచరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్యం వచ్చింది. ఆధునిక వ్యవసాయం, తగ్గిపోయిన యుద్ధాలు తదితర కారణాలతో జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. అందుకే ఈ 37 ఏళ్ల కాలాన్ని 'బేబీ బూన్‌'గా వ్యవహరిస్తుంటారు.
 

తగ్గిపోతున్న దేశాలు..
ప్రపంచ వ్యాప్తంగా జనాభా రేటు పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంటే.. మరికొన్ని దేశాలు తమ జనాభా తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నాయి. ఉదాహరణకు 2020లో జపాన్‌ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదవుతోంది. ఇటలీలో ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్‌, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని ఒక అంచనా.

4


 

మనదేశంలో..
జపాన్‌, ఇటలీ స్థాయిలో కాకపోయినా మనదేశంలోనూ జనాభా వృద్ధి రేటు తగ్గనుంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 1991-2001 పదేళ్ల కాలానికి 2001-2011తో పోల్చితే జనాభా వృద్ధి రేటు 3.9 శాతం తగ్గింది. జనాభా పెరుగుదల విషయంలో భారతీయులు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు. 1950లో భారతీయ మహిళలు సగటున ఒక్కొక్కరు ఆరుగురు పిల్లలకు జన్మనిస్తే.. ప్రస్తుతం అది 2.1 శాతంగా ఉంది.

సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే జనాభా భవిష్యత్తులోనూ కొనసాగాలంటే ఆ దేశ లేదా ప్రాంత లేదా తెగకు చెందిన మహిళలకు 2.1 శాతం మంది పిల్లలకు జన్మనివ్వాలి. ప్రస్తుతం ఇండియాలో జననాలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అందువల్ల మరో 25 ఏళ్ల పాటు ఇదే స్థాయిలో భారత జనాభా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో మహిళలు జన్మనిచ్చే రేటు 2.1 శాతం కంటే దిగువకు చేరుకుంది.

5


ఆర్థిక సర్వే 2018-19 ప్రకారం 2030 నాటికి ఇండియాలో జననాల రేటు రెండు శాతం కంటే దిగువకు చేరుకుంటుందని తేలింది. ఈ లెక్క ప్రకారం 2047 వరకూ మనదేశ జనాభా పెరుగుతూ పోయి, గరిష్టంగా 161 కోట్లకు చేరుకుంటుందని.. ఆ తర్వాత తగ్గుదల నమోదవుతుందని అంచనా. మొత్తంగా 2100 నాటికి దేశ జనాభా 100 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా.

దాదాపు అర్థ దశాబ్ధం పాటు అత్యంత కఠిన జనాభా నియంత్రణ విధానాలు అమలుచేసిన చైనా ధోరణిలో ప్రస్తుతం మార్పు వచ్చింది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్ని కన్నా పర్వాలేదు అంటోంది. మరోవైపు అమెరికా, పోలాండ్‌ దేశాలు అబార్షన్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలుచేస్తోన్నాయి. ఒక్కో చిన్నారికి 100 యూరోల వంతున ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ప్రతీ నెల ఆర్థిక సాయం అందిస్తోంది. దక్షిణ కొరియా పిల్లలు ఎక్కువగా ఉన్న దంపతులకు ప్రోత్సాహకాలు, హోమ్‌ లోన్లు అందిస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేక సెలవులు కూడా మంజూరు చేస్తోంది.
 

సువర్ణావకాశం..
జనాభా పెరిగిపోయిందని దేశంలో ఆందోళన నెలకొన్నా, ఇప్పుడు ప్రపంచలోనే యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్‌ నిలబడింది. యువ జనాభాలో నైపుణ్యం పెంచి, కొత్త అవకాశాలు సృష్టిస్తేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినవాళ్లమవుతాం. అలా కానట్లయితే మరో 30 ఏళ్లకు అత్యధిక వృద్ధ జనాభా ఉన్న దేశంగా ఇండియా మిగిలిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి, మౌలిక సదుపాయాలతో వృద్ధ జనాభాతో మనదేశం నెట్టుకురావడం కష్టంగా మారుతుంది.

మనదేశంలో 24 కోట్ల ప్రజలతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ నిలిచింది. అత్యధిక జనాభా కలిగిన టాప్‌ టెన్‌ దేశాల్లో ఉన్న బ్రెజిల్‌, నైజీరియా, బంగ్లాదేశ్‌, రష్యా, మెక్సికో కంటే ఉత్తరప్రదేశ్‌ జనాభాయే ఎక్కువ. దీంతో జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది యుపి ప్రభుత్వం. దీనికోసం న్యూ పాపులేషన్‌ పాలసీ 2021-30ని అమల్లోకి తెచ్చారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగినవారికి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సబ్సిడీలు అందవ్వమంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
 

పిల్లల్ని కనండి
జపాన్‌, పోలండ్‌ దేశాల తరహా పరిస్థితిని భారత్‌లో పార్శీ మతస్తులు ఎదుర్కొంటున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు వీరి జనాభా భారత్‌లో లక్షకు పైగా ఉండగా, ఇప్పుడు 55,000లకు పరిమితమైంది. గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మినహాయిస్తే నగరాల్లోనే అక్కడక్కడ వీరు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంచుమించు వెయ్యి మంది ఉండగా, ఏపీలో అయితే రెండు అంకెలలోపే ఉండవచ్చని అంచనా. దీంతో పిల్లల్ని కనాలంటూ దంపతులను ప్రోత్సహించేందుకు 'జియో పార్శీ' అనే పథకాన్ని మైనార్టీ వెల్ఫేర్‌ మినిస్ట్రీ చేపట్టింది. ప్రభుత్వంలో పాటు పలు పార్శీ స్వచ్చంధ సంస్థలు వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నాయి.
     పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు తీర్చే వనరులు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితం అయిపోతున్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించిపోతున్నాయి. వీటన్నింటికీ ఆయా దేశాధినేతలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రధానకారణం. పర్యవసానం దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవడాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆవాసం కల్పించాలంటే భూమి కాకుండా మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందే అని ఇటీవల వినిపిస్తున్న ఘోష.
 

                                                                పెరుగుదల తీరుతెన్నులు

  • భూమిపై మనిషి పుట్టుక మొదలైన తర్వాత వేల ఏళ్ల తర్వాత 1800లో మొదటిసారిగా జనాభా వంద కోట్లను దాటింది.
  • 1900 నాటికి జనాభా ఒకేసారిగా పెరిగి, 200 కోట్లకు చేరుకుంది.
  • 2000 వచ్చే సరికి జనాభా మూడింతలై 600 కోట్లకు చేరుకుంది
  • 2000 నుంచి 2012 అంటే పదేళ్లలో జనాభా 700 కోట్లు అయ్యింది.
  • 2030 నాటికి రికార్డు స్థాయిలో 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
  • 2100 నాటికి ప్రపంచ జనాభా 1000.90 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కకట్టింది.

                                                                                   

                                                                                  కొన్ని లక్ష్యాలు

6

 

  • ఈ దినోత్సవం ప్రత్యేకించి యువతరాన్ని ఉత్తేజపరచనుంది. తమ ఆరోగ్యం, శరీర పుష్టి, లైంగిక సమస్యలు వంటివాటిపై యువత సరైన నిర్ణయాలను తీసుకోగలిగేలా ప్రేరేపించడమే ప్రధాన లక్ష్యం.
  • యువతను రక్షించడానికి, సాధికారత కల్పించడానికి ఈ రోజును జరుపుకోవాలి. యువతకి లైంగికత గురించి సవివరమైన జ్ఞానాన్ని అందించాలి. యువత తమ బాధ్యతలను అర్థంచేసుకునేందు తగిన ఉపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వాలు తక్షణం చేపట్టాలి. అప్పుడే వారు వివాహం చేసుకుని, జీవితంలో స్థిరపడగలుగుతారు. ఆరోగ్యపరంగా యువతుల్లో అవాంఛిత గర్భాలను నివారించడానికి అవగాహన కల్పించాలి. లింగ వివక్షను నివారించడానికి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
  •  ముందస్తు ప్రసవం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచేందుకు వారికి గర్భధారణ సంబంధిత వ్యాధుల గురించి తెలియజేయాలి. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి నిరోధించడానికి వారికి లైంగికంగా సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం అవసరం.
  •  బాలబాలికలకు సమాన ప్రాథమిక విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. ప్రతి జంటకు ప్రాథమిక ఆరోగ్యంలో భాగంగా ప్రతిచోటా పునరుత్పత్తి ఆరోగ్య సేవలను సులభంగా పొందేలా ఏర్పాటు చేయాలి.
6


 

                                                            కుటుంబ నియంత్రణ మానవహక్కు..

పుట్టేబోయే పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ జనాభా మొత్తం ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడు ఈ సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల వ్యాధుల వల్ల మన జనాభా నాసిరకంగా మారిపోతుంది. స్త్రీ జన్మకు పరిపూర్ణతనిస్తూ అండాన్ని పిండంగా మార్చే కర్మాగారంగా గర్భసంచి మారిపోయింది. దీనికి ఎలాంటి సమస్య వచ్చినా మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. ఈసారి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పునరుత్పత్తి వ్యవస్థ, ఆరోగ్య సమస్యలు, కుటుంబ నియంత్రణ (ఫ్యామిలీ ప్లానింగ్‌) అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంది. కుటుంబ నియంత్రణ అనేది మానవహక్కు. ఎంత మందిని కనాలి అనే దానిలో స్త్రీలకే స్వేచ్ఛ ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం పునరుత్పత్తి వ్యవస్థ, ఆరోగ్య సమస్యలు వంటి వాటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం. గణంకాల ప్రకారం ప్రసవ సమయంలో ప్రతిరోజూ చాలా మంది తల్లులు మరణిస్తున్నారు. అందుకే వాటిపైన అవగాహన పెంచాల్సి ఉంది.
 

                                                                  కోవిడ్‌-19 ప్రభావాలు..

బేబీ బూమ్‌ / బస్ట్‌ అయినా, సంతానోత్పత్తి రేటును మార్చడానికి పరిష్కారం ప్రజలందరి పునరుత్పత్తి ఆరోగ్యం, హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఉంది. కోవిడ్‌ -19 తర్వాత ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే లోతైన మాంద్యాల నుండి బయటపడుతున్నాయి. కొందరు వ్యాక్సిన్‌ లభ్యతలో చాలా దూరంలో ఉన్నారు. మరికొందరు కరోనావైరస్‌తో యుద్ధంలో బంధించబడిన మధ్యస్థ స్థితిలో ఉన్నారు. ఇదో ఘోరమైన వాస్తవికత. మహమ్మారి ముఖ్యంగా లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం విషయంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను రాజీ పడేలా చేసింది.
     ఇది లింగ-ఆధారిత అసమానతలనూ బహిర్గతం చేయడమే కాకుండా తీవ్రతరం చేసింది. లాక్‌డౌన్‌లో లింగ-ఆధారిత హింస విపరీతంగా పెరిగింది. అలాగే బాల్య వివాహాలు, స్త్రీ జననేంద్రియ వికృతీకరణ వంటి హానికరమైన పద్ధతులను రద్దు చేసే కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. గణనీయమైన సంఖ్యలో మహిళలు ఉపాధిని కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో వారికి పిల్లలకు, వృద్ధులకు సంరక్షణ బాధ్యతలు పెరిగాయి. వారి ప్రస్తుత ఆర్థికస్థితి తాత్కాలికంగా కాదు.. దీర్ఘకాలంలో అస్థిరపరిచేలా చేసింది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటును మార్చడంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చారిత్రాత్మకంగా, సంతానోత్పత్తి రేట్లపై అలారమిజం మానవహక్కుల రద్దుకు దారితీసింది.

                                                           

                                                            2050 నాటికి మన జనాభా ఎంతో తెలుసా ?

7


ఐక్యరాజ్య సమితి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతకుముందు 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనాభా విస్ఫోటనం జరుగుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదలపై ఫోకస్‌ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది జనాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై దృష్టి సారించే రోజు. ప్రతి ఏడాది ప్రపంచ జనాభాలో దాదాపు 83 మిలియన్ల మంది ప్రజలు చేరుతున్నారని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. మీడియం-వేరియంట్‌ ప్రొజెక్షన్‌ ప్రకారం, సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుతూనే ఉంటాయని భావించారు. అయినప్పటికీ, ప్రపంచ జనాభా 2030లో 8.6 బిలియన్లకు, 2050లో 9.8 బిలియన్లకు, 2100లో 11.2 బిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది.
 

                                                                                     పోకడలు
 

11

 

  • పునరుత్పత్తి వయస్సు వరకు జీవించి ఉన్న వ్యక్తుల సంఖ్యను పెంచడం ద్వారా ఈ నాటకీయ పెరుగుదల ఎక్కువగా నడపబడింది. సంతానోత్పత్తి రేటులో ప్రధాన మార్పులు, పట్టణీకరణను పెంచడం, వలసలను వేగవంతం చేయడం వంటి వాటితో కూడి ఉంది. ఈ పోకడలు రాబోయే తరాలకు సుదూర ప్రభావాలను చూపుతాయి.
  •  ఇటీవలి కాలంలో సంతానోత్పత్తి రేట్లు, జీవన కాలపు అంచనాలలో అపారమైన మార్పులు వచ్చాయి. 1970ల ప్రారంభంలో, స్త్రీలు సగటున ఒక్కొక్కరు 4.5 మంది పిల్లలను కలిగి ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం సంతానోత్పత్తి 2015 నాటికి, ప్రతి స్త్రీకి 2.5 కంటే తక్కువకు పడిపోయింది.
  •  సగటు ప్రపంచ జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 సంవత్సరాల నుండి 2019లో 72.6 సంవత్సరాలకు పెరిగింది. అదనంగా ప్రపంచం అధిక స్థాయి పట్టణీకరణను చూస్తోంది. వలసలను వేగవంతం చేస్తోంది.
  •  గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించిన మొదటి సంవత్సరం 2007. ప్రపంచ జనాభాలో 66 శాతం మంది 2050 నాటికి నగరాల్లో నివసిస్తున్నారు.
  •  ఈ మెగాట్రెండ్స్‌ చాలా విస్తృతమైన చిక్కులను కలిగి ఉన్నాయి. అవి ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఆదాయ పంపిణీ, పేదరికం, సామాజిక రక్షణను ప్రభావితం చేస్తాయి.
  •  ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహాలు, పారిశుధ్యం, నీరు, ఆహారం, ఆరోగ్యానికి సార్వత్రిక లబ్ధిని నిర్ధారించే ప్రయత్నాలనూ ఇవి ప్రభావితం చేస్తాయి.
  •  వ్యక్తుల అవసరాలను మరింత స్థిరంగా పరిష్కరించడానికి, విధాన రూపకర్తలు భూమి మీద ఎంతమంది నివసిస్తున్నారు? వారు ఎక్కడ ఉన్నారు? వారి వయస్సు ఎంత? వారి తర్వాత ఎంత మంది వ్యక్తులు వస్తారో తెలుసుకోవాలి.