Jul 11,2023 15:13

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : సేవాగుణంతో పనులు చేస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపణలు చేయడం తగదని ఎంపీ సంజీవ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఎంపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వారాహి పేరుతో యాత్ర నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్లు హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నారనడం, మహిళలు డేటా బయటకు పంపిస్తున్నారని చెప్పడం దారుణం అన్నారు. కరోనా టైంలో బంధుమిత్రులు ఇళ్లకు రానప్పుడు కూడా వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి.. మందులు, పాలు,పెరుగు అందించారని, మంచం దిగలేని వృద్ధులకు 1వ తేదీన ఉదయాన్నే ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఎక్కువ పుస్తకాలు చదివాను చేగువేరా నా స్ఫూర్తి అని అంటుంటాడని, ఇలాంటి మాటలు మాట్లాడి రాజకీయాలలో తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడని, మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్‌ చేశారు.